పగడం అంటే ఏమిటి? మానవుడు పగడాన్ని ఎందుకు ధరించాలి?
ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో దీనిని ఇప్పటికీ దృష్టిదోషం తగలకుండా ఉండేందుకు ధరిస్తారు. హిందువులు కూడ ఆదికాలంనుంచి వీటిని ఉపయోగిస్తున్నారు. నిజానికి పగడం రాయి కాదు. ఇది సముద్రంలో నివసించే కోరల్ ఫాలిప్ అనే జిగురువంటి చిన్న సముద్ర ప్రాణి కవచం అని చెప్పవచ్చు. ఈ కవచం దాని శరీరంలో వెలుపల పెరుగుతుంది. ఇది ఆ ప్రాణి శరీరాన్ని కాపాడుతుంది. దానితోపాటు పెరుగుతుంది. ప్రతి పాలిప్ చిన్న నాళికలా ఒకవైపు మూతపడి ఉంటుంది.
రెండోవైపు అనేక నాళికలు (టెంటకిల్స్) ఉండేవి. నీటివలో ఉండే రాళ్లకు అడుగున అతుక్కుని ఉంటుంది పాలిప్. పిల్లలు దాని శరీరంనుంచి చిన్న చిన్న మొగ్గలుగా వస్తాయి. ముసలి పాలిప్ చనిపోయినప్పుడు, మిగిలినవి సంతానోత్పత్తి చేస్తాయి. ఈ విధంగా పాలిప్ కొన్ని లక్షల సంఖ్యలో తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటాయి. పగడం ఒక పొర మీద మరొక పొర ఏర్పడుతుంది. ఇవి సముద్రంలో మేటలుగా ఏర్పడుతాయి.
సముద్ర నౌకలకు ఇవి ప్రమాదకరమైనవి. తెల్లగా ఉండే ఈ పొరకు సముద్రంలో ఉండే కొన్ని పదార్థాల వల్ల ఎర్రని రంగు ఏర్పడుతుంది. వీటినుంచే మనకు పగడాలు లభిస్తాయి. ఇవి ఫసిఫిక్, హిందూ, మధ్యధరా సముద్రాలలో ఎక్కువగా లభిస్తాయి. ఆఫ్రికా, ఇటలీ తీరాలలో ఉన్న మధ్యధరా సముద్రంలో నీలిరంగు పగడాలు లభిస్తాయి.