Type Here to Get Search Results !

పిల్లల పాటలు

పిల్లల పాటలు

ఆటలు ఆడీ పాటలు పాడీ
ఆటలు ఆడీ పాటలు పాడీ

అలసీ వచ్చానే- తియ్యాతియ్యని

తాయిలమేదో తీసీ పెట్టమ్మా



పిల్లిపిల్లా కళ్ళు మూసి పీట ఎక్కిందీ

కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కిందీ

కడుపులోని కాకి పిల్ల గంతులేస్తోందీ



తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా

గూట్లో ఉన్నా బెల్లమ్ముక్కా కొంచెం పెట్టమ్మా

చేటలొ ఉన్న కొబ్బరి కోరు చారెడు పెట్టమ్మా

అటకా మీడి అటుకుల కుండా అమ్మా దింపమ్మా

తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా



ఆటలు ఆడీ పాటలు పాడీ

అలసీ వచ్చానే- తియ్యాతియ్యని

తాయిలమేదో తీసీ పెట్టమ్మా


కాళ్ళాగజ్జీ కంకాలమ్మ
కాళ్ళాగజ్జీ కంకాలమ్మ

వేగు చుక్కా వెలగామొగ్గా

మొగ్గా కాదూ మోదుగబావీ

నీరూ కాదూ నిమ్మల వారీ

వారీ కాదూ వావింటాకు

ఆకూ కాదూ గుమ్మడి పండూ

కాల్దీసి కడగా పెట్టు.

(గజ్జి వచ్చినప్పుడు కంకోలం అనే ఆకును రుబ్బి పూయాలి. తగ్గక పోతే వేకువ ఝామున లేత వెలక్కాయలోని గుజ్జును పూయాలి. దానికీ తగ్గక పోతే మోదుగ ఆకును రుబ్బి పూయాలి. తగ్గడమ్ ప్రారంభించాక నిమ్మరసాన్ని బాగా పలచన చేసి కడగాలి. ఇంకా మాడక పోతే వావింటాకు పూయాలి. గుమ్మడి పండులోని గుజ్జు కూడా గజ్జికి మందే. ఈ చికిత్సా విధానాలన్నిటినీ సూక్ష్మంలో మోక్షం లాగ వివరించే పాట ఇది. కాలు తీసి కడగా పెట్టు అనడంలో గజ్జి అంటు వ్యాధి కాబట్టి జాగ్రత్తగా ఉండమనే సూచన ఉంది.)


కొండ మీది
కొండ మీది గుండు జారి

కొక్కిరాయి కాలు విరిగె

దానికేమ్మందు?



వేపాకు పసుపూ, వెల్లుల్లి పాయ

నూనెమ్మ బొట్టు - నూటొక్కసారి నూరి

పూటకొక్కసారి పూయవోయ్


చిమడకే చిమడకే
చిమడకే చిమడకే ఓ చింతకాయ

నీవెంత చిమిడినా నీ పులుపు పోదు

ఉడకకే ఉడకకే ఓ ఉల్లి పాయ

ఎంతెంత ఉడికినా నీ కంపు పోదు


చిట్టి చిట్టి మిరియాలు
చిట్టి చిట్టి మిరియాలు,

చెట్టుకింద పోసి,

పుట్టమన్ను తెచ్చి,

బొమ్మరిల్లు కట్టి,

అల్లవారి కోడలు నీళ్ళకెళితే,

కల్లవారి కుక్క భౌ--భౌ అనెను,

నా కళ్ళ గజ్జెలు ఘల్లుమనె.


తప్పెట్లోయ్ తాళాలోయ్
తప్పెట్లోయ్ తాళాలోయ్

దేవుడి గుళ్ళో బాజాలోయ్

పప్పూ బెల్లం దేవుడికోయ్

పాలూ నెయ్యి పాపడికోయ్


నారింజ కాయ
నారింజ కాయ నిన్ను చూడగానె నా నోరూరు

తొక్కవిప్పి తినగ అబ్బబ్బ పులుపు తిననె తినను,

తీసి నేలకేసి కొడ్తాను.


వంకరటింకర ఒ
వంకరటింకర సొ -- సొంఠి

వాని తమ్ముడు అ - అల్లమ్

నల్లగుడ్ల మి--మిరియాలు

నాలుగు కాళ్ళ మే--మేక.


వానల్లు కురవాలి
వానల్లు కురవాలి వాన దేవుడా

వరిచేలు పండాలి వాన దేవుడా

నల్లనీ మేఘాలు వాన దేవుడా

చల్లగా కురవాలి వాన దేవుడా

మా ఊరి చెరువంత వాన దేవుడా

ముంచెత్తి పోవాలి వాన దేవుడా

కప్పలకు పెండ్లిళ్ళు వాన దేవుడా

గొప్పగా చేస్తాము వాన దేవుడా

పచ్చగా చేలంత వాన దేవుడా

పంటల్లు పండాలి వాన దేవుడా

వానల్లు కురవాలి వాన దేవుడా

వరిచేలు పండాలి వాన దేవుడా


చిట్టి చిలకమ్మా...
చిట్టి చిలకమ్మా

అమ్మ కొట్టిందా

తోటకెళ్ళావా

పండు తెచ్చావా

గూట్లో పెట్టావా

గుటుక్కు మింగావా


హాయీ హాయీ
ఇది చిన్న పిల్లలను నిద్రబుచ్చేటప్పుడు పాడే పాట



హాయీ....చిచ్చిళుళుళుళువ హాయీ

హాయి హాయి హాయి ఆపదలు గాయీ

చిన్నివాళ్ళనుగాయి శ్రీ వెంకటేశా-హాయ్

హాయమ్మ బాయమ్మ అక్క జెల్లెళ్ళు

తొలి ఒక్క జన్మాన తోడి కోడళ్ళు || హాయి ||


చందమామ రావె
పిల్లలు కొద్ది కొద్దిగా మారం చేసే వయసు వచ్చి, మొండిఘటాలైతే చందమామను చూపిస్తూ ఇలా పాడతారు

చందమామ రావె - జాబిల్లి రావె

కొండెక్కి రావె - కోటి వేలు తేవె

పరుగెత్తి రావె - పాలు పెరుగు తేవె

అన్నింటిని తేవె - అబ్బాయి కీవె


బుర్రు పిట్ట బుర్రు పిట్ట
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది

పడమటింటి కాపురము చెయ్యనన్నది

అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది

మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది

మొగుడు చేత మొట్టికాయ తింటానన్నది


బుజ్జి మేక
పిల్లలు : బుజ్జిమేక బుజ్జిమేక ఏడికెలితివి ?

బుజ్జి మేక : రాజుగారి తోటలోన మేతకెల్తిని.

పిల్లలు : రాజుగారి తోటలోన ఏమి చూస్తివి ?

బుజ్జి మేక : రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని.

పిల్లలు : పూల చెట్లు చూసి నీవు ఊరుకుంటివా ?

బుజ్జి మేక : ఊరుకోక పూల చెట్లు మేసి వస్తిని.

పిల్లలు : మేసి వస్తే తోటమాలి ఏమి చేసెను ?

బుజ్జి మేక : తోటమాలి కొట్ట వస్తే తుర్రుమంటిని.


మా తాత
మా తాత అందం చందమామ చందం

మా తాత గుండు గుమ్మడి పండు

మా తాత మీసం రొయ్యల మీసం

మా తాత పిలక పంచదార చిలక


ఛల్ ఛల్ గుర్రం
ఛల్ ఛల్ గుర్రం చలాకి గుర్రం

సవారీ చేస్తే చక్కని గుర్రం

సాములు చేస్తే సర్కస్ గుర్రం

పౌరుషం ఉంటె పందెం గుర్రం

ఆగకపోతే అరబ్బీ గుర్రం

చచ్చుదైతే జట్కా గుర్రం ||ఆగక ||


బావ బావ పన్నీరు
బావ బావ పన్నీరు బావ ని పట్టుకు తన్నేరు

వీధి వీధి తిప్పేరు వీసెడు గంధం పూసేరు

చావడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు


చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ
చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ

అట్లు పొయ్యంగా ఆరగించంగ

ముత్యాల చెమ్మ చెక్క ముగ్గు లెయ్యంగ

రత్నాల చెమ్మ చెక్క రంగు లెయ్యంగ

పందిట్లొ మా బావ పెండ్లి చెయ్యంగ

సుబ్బ రాయుడి పెండ్లి చూసి వద్దం రండి

మా ఇంట్లొ పెళ్ళి మళ్లీ వద్దాం రండి.




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom