అయోధ్యా కాండము
సరయు నది దాటుతున్న రాముడు
దశరథుడు రాజ్యభారాన్ని పెద్దకొడుకైన రామునకప్పగింపవలెనని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వమూ సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి.
రాముని సవతి తల్లియైన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కాని ఆమె చెలికత్తె మంధర కైకేయికి ఇలా నూరిపోసింది - "రాముడు రాజయితే కౌసల్య రాజమాతవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి, రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు.". ఈ మాటలు కైకేయి వంటబట్టాయి. అంతకు పూర్వము దశరధుడు ఆమెకు రెండు కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరధుని రెండు కోరికలు కోరింది - (1) భరతుని పట్టాభిషేకము (2) రామునకు 14 ఏండ్ల వనవాసము.
దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో క్రుంగిపోయాడు. కాని రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృతనిశ్చయుడై ఉన్నాడు. రామునితోబాటు ఆత్మయైన సీత, నీడయైన లక్ష్మణుడూ వనవాసానికి బయలుదేరారు. అయోధ్యపురవాసులంతా విలపించారు.అందరివద్దా సెలవు తీసుకొని సీతారామలక్ష్మణులు సకలసౌఖ్యాలూ వర్జించి, నారదుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరధుడు రామునికై విలపిస్తూ స్వర్గతుడైనాడు.
మేనమామల ఇంటినుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికీ, తన ముఖం ఇతరులకు చూపడానికీ అతని మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి - "నీకు చెందవలసిన రాజ్యం నావంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి, అయోధ్యకు తిరిగివచ్చి మమ్మలనందరినీ ఏలుకో" అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు దుఃఖించాడు. కాని "తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే" అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు - "14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంత వరకు నీ పాదుకలను సింహాసనంపై ఉంచి, భృత్యునిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను" అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకినీ తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపతపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినపుడు సీతమ్మవారు అనసూయ ఉపదేశములు, ఆశీర్వచనములు గ్రహించింది.