ఉత్తరకాండము
ఉత్తర రామాయణం కథ
రామరాజ్యం
శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. అందుకే ఇప్పటికీ శ్రేయో రాజ్య పరిపాలనకు రామ రాజ్యాన్ని ఉదాహరణగా వాడతారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.
సీత గురించిన నింద
ఒక గ్రామములోని బావి దగ్గర రామ లక్ష్మణులు సీత
అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కథలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు. రాముడు ప్రసన్నుడై భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు. రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు. రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు.
అడవుల పాలైన సీత
లక్ష్మణునితో అడవికి బయలుదేరకముందు వశిష్టుని కలవడానిజి వచ్చిన సీత
లక్ష్మణుడు మారుమాటాడక ఉదయాన్నే రథం సిద్ధం చేయమని మంత్రి సుమంతుడుకి చెప్పి సీత వద్దకు వెళ్ళి" తల్లీ. ఆశ్రమంలొ గడపాలన్న నీకోరిక మేరకు నేడు నిన్ను మున్యాశ్రమాలకు గంగా నదివద్దకు తీసుకువెళ్లమని అన్న ఆనతిచ్చారు" అనగానే సీత సంతోషంగా అతనితో గంగానదికి ప్రయాణమవుతుంది. గంగానదిని దాటిన పిదప మున్యాశ్రమతీరంవద్ద " తల్లీ! నా పాపాన్ని క్షమించు. నిన్ను నేను ఇక్కడకు తీసుకువచ్చినది ఈ తీరంలో వదిలి వెళ్లడానికే గాని తిరిగి అయోధ్యాపురికి తీసుకు వెళ్ళడానికి కాదు" అని అసలు సంగతి చెప్పగా ఆమె మూర్చపోయి తేరుకొని "నాయనా సౌమిత్రీ! నేను కష్టాలు అనుభవించడానికే పుట్టాను అని అనిపిస్తున్నది. పూర్వజన్మ పాపం పట్టి పీడించక తప్పదుమరి. అప్పుడు అరణ్యాలలో భర్త తోడుతో గడిపాను. ఇప్పుడు ఒంటరిగా ఉండగలనా? నీభర్త నిన్నెందుకు విడిచిపెట్టాడని అడిగే ముని పత్నులకు ఏమి జవాబు చెప్పేది? సరే. విధిరాత అనుభవింపకతప్పదు. ఆయన మాటను గౌరవిస్తానని చెప్పు. నా నమస్కారాలు తెలియచెయ్యి. " అంటుంది. లక్ష్మణుడు ఆమె పాదాలకు మొక్కి ప్రదక్షిణం చేసి వెళ్ళలేక వెళ్లలేక గంగా తీరం దాటి వెడతాడు.
ముని ఆశ్రమం, కుశలవులు
వాల్మీకి ఆశ్రమములో సీతా దేవి
సీత అతను వెళ్ళేంతవరకూ అక్కడే ఉండి పెద్దగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. ముని బాలకుల ద్వారా ఈసంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. " అని ఓదారుస్తాడు. ఆయన ఆశ్రమంలో ఉన్న అందరినీ పేరు పేరునా పిలచి జానికీ దేవికి ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకొనే బాధ్యతను అప్పగిస్తాడు. అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవకుశనామధేయులై దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.
రాజసూయం
యాగాశ్వాన్ని బధించిన లవ కుశులు
ఇదిలా ఉండగా ఒక రోజు రాముడు తమ్ములను పిలిచి తనకు రాజసూయ యాగం చేయాలనున్నది అని చెపుతూ వారి సలహా అడుగుతాడు. భరతుడు అన్నకు అంజలి ఘటించి" ప్రభూ! నీ పాలనలో ధర్మదేవత చక్కగా నడుస్తోంది. కీర్తి చంద్రుడ్ని ఆశ్రియించిన వెన్నెలలా నిన్ను అంటిపెట్టుకొనే ఉన్నది. పాప కర్ములు అయిన రాజులు లేరు. ఈ భూమ్మీద ఉన్న సకల ప్రాణులకు ఏలికవు గతివి నువ్వే అని మరిచావా? రాజసూయం వల్ల అనేక రాజవంశాలు నేలమట్టం అవుతాయి. అందువల్ల రాజసూయం అనవసరమని నా అభిప్రాయం " అనగానే లక్ష్మణుడు అందుకొని" అన్నా! భరతుడు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం, ధర్మయుక్తం. నీకు యాగం చేయాలని కోరిక ఉంది గనుక అశ్వమేధం చేయి. ఇది నిర్వహించి పూర్వం ఇంద్రుడు వౄతాసురవధ వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకం వదిలించుకొన్నాడు. " అంటాడు. శ్రీ రాముడికి వారి మాటలు బాగా నచ్చాయి. " సోదరులారా. మీరు చెప్పినమాటలు నాకు సమ్మతంగానే ఉన్నాయి. ఈ యాగం నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయండి. " అని అనుమతిస్తాడు.
సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన దేశాధిపతులు, మునులు, నటులు, గాయకులు రాగా నైమిశారణ్యంలో గోమతీ నదీ తీరాన యజ్ఞవాటికను సమస్త వైభవోపేతంగా నిర్మించి అది చూడ్డానికి వచ్చేవారికై సకల సౌకర్యాలు సమకూరుస్తారు. మంచి లక్షణాలు కలిగిన గుర్రాన్ని రాముడు అర్చించి వదిలిపెట్టాడు. రక్షకుడిగా లక్ష్మణుడు ఋత్విజులతో సహా బయలుదేరాడు. తరువాత రాముడు యజ్ఙవాటికలోకి ప్రవేశించాడు. అప్పుడు భూమండలంపై ఉన్న రాజులు అందరూ రాముడిని అభినందించి కానుకలు సమర్పించుకోసాగారు. ఇలా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏడాది పాటు అశ్వమేధ యాగం కొనసాగింది. దీన్ని మెచ్చుకోని వారు లేరు. అప్పుడు వాల్మీకి మహర్షి శిష్యసమేతంగా విచ్చేసాడు. భరత శత్రుఘ్నులు ఆయన కోసం సౌకర్యవంతమైన పర్ణశాలను ప్రత్యేకించి నిర్మించి విడిది ఏర్పాటు చేసారు. విడిదిలోకి చేరిన తరువాత వాల్మీకి లవకుశలను కూర్చోపెట్టుకొని" చిరంజీవులారా! మీకు నేర్పిన రామాయణాన్ని రాజమార్గాల్లోనూ, మును వాసాల్లోనూ, యజ్ఞవాటిక దగ్గర రాముని మందరం దగ్గర శ్రావ్యంగా, శ్రుతి బద్ధంగా మధురంగా ఆలపించండి. రోజుకు ఇరవై సర్గలు పాడండి. ఫలాలు దుంపలే ఆరగించండి. ఎవరైనా ధనం ఇస్తే స్వీకరించకండి. మీరు ఎవరు అని ప్రశ్నిస్తే " వాల్మీకి శిష్యులం అని మాత్రమే చెప్పాలి. ప్రభువయిన శ్రీరాముడ్నిమాత్రం చులకనగా చూడకండి. అని బోధిస్తాడు.
రామాయణ గానం
రాముని సభలో రామాయణమును గానము చేయుచున్న లవ కుశులు
మరునాటి ఉదయం లవకుశులు వాల్మీకి మునికి నమస్కారం చేసి, ఆయన ఆశీర్వాదంతో రామాయణ గానం అయోధ్య నలుదెసలా ఆరంభిస్తారు. ఆ గానామృత మాధుర్యానికి జనులు సమ్మోహితులై వారిని వెంబడిస్తారు. దేశం నలుమూలలా కుశలవుల గాన మాధుర్యం గురించే చర్చ జరుగుతూంది. రాముడు కూడా ఆ గానాన్ని విని ముగ్దుదౌతాడు. యజ్ఞకర్మ పూర్తి కాగానే ఒక సభను ఏర్పాటు చేసి మునులు, రాజులు, పండితులు, సంగీత విద్వాంసులు, భాషావేత్తలు, వేదకోవిదులు, సకలవిద్యాపారంగతులు ఆసీనులై ఉన్న సమయాన రాముడు కుశలవులను తమ గాన మాధుర్యాన్ని వినిపించమని కోరతాడు. మొదటి సర్గనుంచి ఇరవై సర్గలు వరకూ వారు అతి రమ్యగా గానంచేయగా సభాసదులు చప్పట్లు చరిచి వారి గాన మాధుర్యానికి జేజేలు చెప్తారు. రాముడు భరతునితో ఈ బాలురకు పద్దెనిమిదివేల బంగారు నాణేలు బహూకరించమని కోరగా లవకుశులు తమకు ఎలాణ్టి ధనమూ కానుకలూ అవసరం లేదని తిరస్కరిస్తారు. అప్పుడు రాముడు . మీరు పాడిన కావ్యం ఏమిటి? అని ప్రశ్నించగా లవకుశులు " దీని కర్త వాల్మీకి మహర్షి. ఇప్పుడాయన ఇక్కడే ఉన్నారు. ఆయనే మాగురువు. మీ చరిత్రనే ఆయన ఇరవై నాలుగువేల శ్లోకాలుగా వ్రాసాడు. దీనిలో 7 కాండాలున్నాయి. అయిదువందల సర్గలున్నాయి. వంద కథలున్నాయి. మీకంతగా కోరిక ఉంటే పాడి వినిపిస్తాం" అన్నారు.
జానకీదేవి కళంక రహిత
మళ్ళీ కలసిన సీతా రాములు
రాముడు సరే అని అంగీకరిస్తాడు. ఆయన కోరికమేరకు వారు ప్రతిరోజూ రామాయణాన్ని గానం చేసారు. అది విని రాముడు వీరు సీతాపుత్రులే అని గ్రహించాడు. దూతలను వెంటనే పిలిచి "మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి. నామాటలుగా ఇలా చెప్పండి. మహర్షీ రాముడు నమస్కరించి మీకు విన్నవిస్తున్నదేమంటే మీ కావ్యం విన్నాను. అతి రమ్యంగా ఉన్నది. మీరు నిజంగా జానకీ దేవి కళంక రహిత అనిభావిస్తే ఆమెను సభాముఖానికి తీసుకొనివచ్చి ఆవిషయం ఆమెను నిరూపించుకోవాలి అని చెప్పగా వారు వాల్మీకిని కలసి తిరిగి వచ్చి" రేపు సీత తన నిర్దోషిత్వావ్వి ప్రకటిస్తుంది. కాబట్టి ఆమెపై అభాండాలు వేసిన వారుకూడా సభకు రావచ్చునని వాల్మీకి సెలవిచ్చారని చెప్తారు. రాముడు సభనుద్దేశించి "రేపు సీత తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తుంది. మీరు తప్పక రావాలి" అని చెబుతాడు. ఆయన ప్రకటన విన్న వాళ్ళందరూ "ఇటువంటి ధర్మ పాలన నీకే చెల్లుతుంది" అని మెచ్చుకొంటారు. సభలోకి రాగానే శ్రీరాముడితో పాటు సభాసదులందరూ వినయంగ లేచి నిలబడి మునీశ్వరుల అనుమతితో తిరిగి ఆసీనులయ్యారు. ముగ్ద సౌందర్యమూర్తి అయిన జానకీ దేవిని చాలా కాలం తరువాత చూసిన జనులు కన్నుల నీరుడుకున్నారు. అప్పుడు హృదయభారభరితమైన మౌనాన్ని చేదిస్తూ మేఘ గంభీర స్వరంతో వాల్మీకి ఇలా అన్నారు" సభికులారా! ఈమె పరమసాధ్వి జానకీ దేవి. దశరధుని కోడలు. శ్రీరామచంద్రుని ఇల్లాలు. ఈమెను శ్రీరామ చంద్రుడు లోక నిందకు భయపడి పరిత్యజించినాడు. నేను చెప్పునది సత్యము. ఇందులో ఏమైన అనృతమున్నట్టయితే ఇన్ని వేల సంవత్సరాల నా తపస్సు నిర్వీర్యమై పోగలదు"
సభికులు మహా ముని పలుకులు విని చేష్టలు దక్కినవారయ్యారు. శ్రీ రాముడు చిరునవ్వుతో లేచి మునిని శాంతి పరుస్తూ "మునీంద్రా! దివ్యజ్ఞాన సంపన్నులైన తమ వాక్యములు సత్యభూషణములు. నా దేవేరి శీలమును గురించి నాకు ఏమాత్రమూ సందేహము లేదు. ఆమె మహా సాధ్వి అని నాకు తెలియును. మరి లోకులకు కూడా తెలియవడం అవసరమని నే నట్లు నడుచుకోవలసి వచ్చింది. ఆ తరువాత ఈ కుర్రవాళ్ళను చూస్తే నా కుమారులే అని నా అంతరాత్మ తెలుపుతూంది. లోకం కోసమే సీత తన సాధుశీలాన్ని చాటుకోవాలి" అన్నాడు. ఆ మాటలకు అంతా సీత వైపు చూసారు.
సీత భూప్రవేశం
సీత కాషాయాంబరాలు ధరించి ఒక్క మాటు చూసింది. రెండు చేతులు జోడించింది. సభా భవనంలోని గాలిలో చల్లని కమ్మని పరిమళాలు వ్యాపించసాగాయి. అప్పుడు సీత ఇలా అంది" నేను రాముడ్ని తప్ప అన్యుల్ని తలచనిదాననే అయితే భూదేవి నా ప్రవేశానికి వీలుగా దారి ఈయాలి. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడూ రాముని పూజించేదాన్ని అయితే భూదేవి నా ప్రవేశానికి మార్గం చూపాలి" అని ప్రార్ధించింది సీతా దేవి ప్రార్థన ముగించీ ముగించగానే భూమి బద్దలు అయింది. నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనమొకటి పైకి వచ్చింది. దానిలో ఆసీనురాలయిన భూమాత రెండు చేతులతో సీతను తీసుకొని పక్కన పొదవి కూర్చోపెట్టుకొంది. ఆకాశం నుంచి పూల వాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా అయిపోయింది. సభాసదులు దీనులై విలపిస్తూ రాముడి వంక చూడసాగారు. రాముడి దుఃఖానికి అంతే లేదు. "నా కన్నుల ముందే నా భార్య మాయమయింది. లంకలో నుంచి తీసుకొని వచ్చిన ఆమెను భూమినుండి తెచ్చుకొనలేనా? భూదేవీ! అత్తగారివైన నిన్ను మర్యాదగా అడుగుతున్నాను. తక్షణం సీతను తెచ్చి ఈయకుంటే జగత్ప్రళయం సృష్టిస్తాను." అన్నాడు. అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది. ఇప్పటి దాకా నువ్ జరిగినది విన్నావు. ఇక జరగబోయేది కూడా మహాముని రాసి ఉన్నాడు. అది నీవు, మునులు మాత్రమే వినాలి " అని చెప్పి వెళ్ళిపోయాడు.
లక్ష్మణునికి ధర్మ సంకటం
మరునాడు మిగతా గాథ రాముడు విన్నాడు. అశ్వమేధం ముగిసింది. లవకుశులతో రాముడు అయోధ్యకేగాడు. కాలం ఎవరికోసమూ ఆగదు. ఒక నాడు ఒక ముని వచ్చి రాముడ్ని చూడాలని లక్ష్మణుడ్ని కోరాడు. రామాజ్ఞతో లక్ష్మణుడు మునిని రాముని గదిలోకి ప్రవేశపెట్టాడు. వచ్చిన ముని " రామా! మనం మాటాడే విషయాలు పరులెవరికీ తెలియరాదు. ఒక వేళ అలా మధ్యలో ప్రవేశించినా విన్నా మరణదండన విధిస్తానంటే నీతో ముచ్చటిస్తాను" అన్నాడు. రాముడు సరేనని లక్ష్మణుడ్ని ద్వారానికి కాపలాగా ఉండమన్నాడు. ఆ తరువాత ముని ఇలా అన్నాడు" రామ చంద్రా! నేను మునిని కాదు. యమధర్మరాజుని. మానవులను సమయానుసారంగా మరణాన్ని సిద్ధపరచే సమవర్తిని. నీవు ఈ లోకానికి వచ్చిన కార్య నెరవేరింది. బ్రహ్మ పుణ్యలోకాలకు వచ్చి పరిపాలించమని కోరాడు. " అన్నాడు. రాముడు నవ్వి "యమధర్మరాజా! ముల్లోకాలను రక్షించడమే నా బాధ్యత. నా స్వస్థానానికే రావడానికి నేను సిద్ధమౌతున్నాను." అన్నాడు. ఇలా వీరు సంభాషించుకొంటున్న వేళ దుర్వాసుడు రాముడి దర్శనానికి వచ్చాడు. లక్ష్మణుడు దర్శనం చేయించేందుకు వ్యవధి కావాలన్నాడు. ముక్కోపి అయిన దుర్వాసుడు "ఓరీ! ఈ.. రామ దర్శనానికి నేను వేచివుండాలా? తక్షణం నేను రాముడ్ని కలవాలి. లేకుంటే నీ దేశం, వంశం , మీ అన్నదమ్ములు నాశనం కావాలని శపిస్తాను " అన్నాడు. దుర్వాసుని కోఫం ఎరిగిన వాడైన లక్ష్మణుడు తన వంశం దేశం నాశనమయ్యే కంటే తాను రాముడు ఆజ్ఞను ధిక్కరించి తానొక్కడూ మరణశిక్షపొందడం మేలని తలచి యముడు రాముడు సంభాషణకు అంతరాయం కలిగిస్తూ " అన్నా! నీకోసం దుర్వాసుల వారు వచ్చారు" అని అన్నాడు.
లక్ష్మణుడి యోగ సమాధి
రాముడు యముని వడి వడిగా పంపి దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. దుర్వాసుడు తనకు ఆకలిగా ఉన్నదని మృష్టాన్నం కావాలనీ కోరాడు. ఆయనను కోరిక మేరకు తృప్తి పరచి తాను యముడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని విచారించసాగాడు. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్య చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత, శతృఘ్నులను సమావేశ పరచి విషయం విని విచారించాడు. వశిష్ఠుడు " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణసమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే సౌమిత్రి తన ఇంటి వైపు కూడా చూడక సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని అమరావతికి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం తమ దగ్గరకు వచ్చినందుకు దేవతలు సంతోషించారు.
లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు. ఈ మాట విని యావత్తు రాజ్యం దుఃఖించింది. భరతుడయితే మూర్చపోయాడు. కొంతసేపటికి తేరుకొని భరతుడు" అన్నా! నువ్వులేని రాజ్యం నాకెందుకు? నిన్నువదిలి నేనుండలేను. కోసల రాజ్యం రెండుభాగాలు చేసి దక్షిణం కుశుడికి ఉత్తరం లవుడుకి ఇచ్చేద్దాం. ఇదే ధర్మబద్ధం . వెంటనే శతృఘ్నునికి కబురుపెడదాం. " అన్నాడు. వరసగా జరుగుతున్న ఘటనలు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించాయి. వశిష్ఠుడు " రామా! ప్రజల అభీష్టాన్ని కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి"" అన్నాడు. రాజు ప్రజలతో సభ జరిపి "నా నిర్ణయం రాజ్యాన్ని త్యజించి పోవడం. మీ నిర్ణయం ఏమిటి?" అని అడిగాడు. "ప్రభూ మీ నిర్ణయమే మాకు శిరో ధార్యం. తమతో పాటు అనుసరించాలని మాలో చాలా మందికి ఉన్నది. అందుకు అనుమతించండి. అదే మాకోరిక" అన్నారు. రాముడు సరేనన్నాడు.
రాముని నిర్ణయం
ఆరోజే కుశలవులకు పట్టాభిషేకం జరిపి కొడుకులిద్దరను తొడమీద చేకొని వారి శరస్సులను ఆఘ్రూణించి వారికి హితవచనాలు చెప్పి ధనకనక వస్తు వాహనాలతో సైన్యాన్ని ఇచ్చి కుశుణ్ణి కుశాపతికి, లవుణ్ణి శ్రావస్తికి పంపాడు. తరువాత దూతల ద్వారా జరిగిన సంగతులన్నీ శత్రుఘ్నుడికి తెలియ చేసాడు. శతృఘ్నుడు మంత్రి పురోహితులను పిలచి తన అన్నతో తానూవెళ్ళిపోతానని తెలిపి తన రాజ్యాన్ని రెండుగా విభజించి మధురను సుబాహుడికి, విదిశానగరాన్ని చిన్నవాడు శత్రుఘాతికీ ఇచ్చి అభిషిక్తులను చేసాడు. రాముడు వెళ్ళి పోతున్నాడన్న విషయం తెలిసిన వానరులు, భల్లూకాలు, రాక్షసులు తండోప తండాలుగా అయోధ్యకు తరలి వచ్చారు. అంగదుడు చేతులు జోడించి" రామా ! అంగదుడికి నా రాజ్యం అప్పగించి వచ్చేసాను. నన్నూ నీతో తీసుకొని పో" అన్నాడు. రాముని వద్దకు విభీషణుడు వచ్చి ఏదో రామునికి చెప్పబోగా రాముడు వారించి "విభీషణా సూర్యచంద్రులున్నంత దాకా , నా కథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకొన్నంత కాలం నువ్ ధర్మబధ్ధమైన పాలన గురించి కూడా పొగిడేలా చక్కని రాజ్య పాలన చేయాలి. ఇది స్నేహితునిగా నా ఆజ్ఞ. అంతే కాదు మా ఇక్ష్వాకువంశ కులనాధుడు జగన్నాధుడు. ఆయనను సదా సేవించడం మానకు." అన్నాడు. అప్పుడు ఆంజనేయుడిని పిలిచి" నాయనా!నీవు, మైందుడు , ద్వివిదుడు. మీ ముగ్గురూ కలికాలం అంతమయ్యేదాకా చిరాయువులై ఉండండి. అని ఆశీర్వదించి, మిగిలిన వానర భల్లూక వీరులనందరినీ తనతో తీసుకొని వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు.
రామావతార పరిసమాప్తి
మరునాడు తెల్లవారింది. బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, చేతి వేళ్ళ మధ్య ధర్భలు పట్టుకొని, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు. ఆయనకు రెండు పక్కలా శ్రీ దేవి, హ్రీదేవి, ముందు భూదేవి ఉన్నారు. ధనుర్భాణాలు పురుష రూపంతో ఆయన్ని అనుగమించినాయి. వేదాలు, గాయత్రి , ఓంకారవషట్కారాలు ఆ పురాణ పురుషుణ్ణి అనుసరించాయి. బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, జనగణం, రాక్షసులు ఆమర్యాద పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశు పక్ష్యాదులు కూడా రాముని వెంట పోగా అయోధ్య అంతా పాడుపడినట్టు ఖాళీ అయిపోయింది. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకొన్నాడు. అప్పటెకే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. అర్చకుల మంత్రోచ్చారణలు జరుపుతునారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు" మహావిష్ణూ ! నీకు శుభమగుగాక! నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ!సకల భువనాలకూ నువ్వే ఆధారం."
పితామహుడి మాటలు విని రాముడు వైష్ణవ రూపం స్వీకరించాడు. సోదరులుకూడా అలాగే చేసారు. కిన్నెరులు కింపురుషులు, యక్షులు, దేవతలు ఇలా సకల లోకాలకు చెందినవారంతా జయజయ ధ్వానాలు చేసి విష్ణువుకు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు. బ్రహ్మ రెండుచేతులా విష్ణువుకు మొక్కి"దేవా! నిన్ను నమ్మిన వారు ఆశ్రయించినవారు పశువులైన పక్షైనా సంతానకమనే దివ్యలోకం చేరతారు. ఇప్పుడు వీరినందరినీ ఆ లోకానికే చేరుస్తాను. వానరాదులు ఏ దేవతాంశం నుంచి జన్మించారో ఆ దేవతాంశం పొందుతారు. సుగ్రీవుడు సూర్యునిలో లేనమై పోతాడు" అన్నాడు. రాముడ్ని అనుసరించిన వారు " గో ప్రతారం " అనే తీర్ధంలో మునిగారు. వాళ్ళకి పూర్వ శరీరాలు పోయి దివ్యశరీరాలు వచ్చాయి.అప్పుడు వారు తమకు కేటాయించిన విమానాల్లో పుణ్యలోకాలు వెళ్ళిపోయారు.