Type Here to Get Search Results !

శివదీక్ష నియమాలు తెలుసా ? _ Do you know the rules of Shiv Diksha?

శివదీక్ష నియమాలు తెలుసా ? 

శివరాత్రికి శ్రీశైల మహాక్షేత్రంలో శివదీక్షలు ఇస్తారు . ఇవి మన పురాణాల్లో కూడా ప్రస్తావించబడ్డాయి . అయ్యప్పమాల, భవానీ దీక్షని తీసుకున్నట్టే, నియమాలతో శివదీక్షని కూడా ఆచరిస్తారు . సాధారణంగా జనవరి ప్రాంతంలో ఆరంభమయ్యే ఈ శివదీక్షా విశేషాలని గురించి వివరంగా చదువుకుందాం , తెలుసుకుందాం రండి . 
 
ప్రపంచమునకు ఆధారమైనది శివునకు చిహ్నమైనది శివలింగం. ఈ శివలింగంతో సంబంధాన్ని కలిగించి, తాపత్రయం అణిచి వేసేది దీక్ష! శివదీక్ష ! ఈ జన్మలోనే ఇచ్చాలన్నీ తీరిపోయి,  మోక్షము పొంది, ఆ పరమాత్మలోనే ఐక్యం అయిపోయేలా చేసేందుకు ఈ  శివదీక్ష ఉపయోగపడుతుంది. 

 జగజ్జనని పార్వతీదేవి శివదీక్షను ఆచరించింది .ఇక  పాండవ మధ్యముడైన అర్జునుడు కూడా శివదీక్షను ఆచరించాడని మహాభారతంలో చెప్పబడింది . ఆంగ్లశకం 660లో బాదామి చాళుక్యుడైన మొదటి విక్రమాదిత్యుడు శివదీక్షను మండలదీక్షగా స్వీకరించినట్లు శాసనాలు చెబుతున్నాయి . 660 నాటి ఒక రాగి శాసనములో బాదామి చాళుక్య ప్రభువు రెండవ విక్రమాదిత్యుడు శివ దీక్ష తీసుకున్నట్లు, అతనికి ఆ దీక్ష ప్రసాదించిన సుదర్శనాచార్యునకు ఈ పటంకర్ అను గ్రామమును దక్షిణగా ఇచ్చినట్లు తెలియవస్తోంది.   కుషాణ ప్రభువు "బీంబ్రద్ ఫైసిస్" ఈ దీక్ష స్వీకరించి శివుని పూజించినట్లు ఆనాటి నాణెములు వలన తెలుస్తున్నది. క్రీస్తుశకము పూర్వ కాలంలో కూడా ఎంతోమంది రాజులు ఈ శివ దీక్షను స్వీకరించారు.  ఈ మహత్తర శివ దీక్ష స్వీకరించటం జ్యోతిముడితో శివలింగమును చూచి దీక్షను వదలటం అత్యుత్తమైన కార్యమని మన పురాణాలు చెబుతున్నాయి . 

అయ్యప్ప దీక్షని పోలిన నియమాలు శివదీక్షలోనూ ఉంటాయి . ఈ దీక్షను స్వీకరించినప్పుడు ఇంతకుముందు శివదీక్ష పొందిన వారితో  మాలాధారణ చేయించుకోవాలి.  మాలాధారణని , పురాతనమైన ఆలయంలో స్వీకరించడం మంచిది .  దీక్ష ఇచ్చే వారు సదాచార వర్తనులు, మంచి మనస్సు గల గురువులై ఉంటె మంచిది . దీక్షని స్వీకరించాక , మనసా వాచా కర్మణా పరిశుద్ధులై శివ దీక్షను ఆచరించటం వలన ఎంతటి గొప్ప కార్యాన్నైనా సాధించగలరని ఫలశృతి . 

శివ దీక్ష నియమములు :
చందనపు రంగుల బట్టలు ధరించాలి.  కొందరు నీలపు రంగు వస్త్రాలు కూడా ధరిస్తుంటారు. 
దీక్షాకాలంలో చెప్పులు తొడగకూడదు . 
క్షౌరము చేయించుకోకూడదు. 
త్రికాలమునందు స్నానము చేసి శివపూజ చేయాలి.  మూడుపూట్లా వీలుకానివారు ,  ఉదయము, సాయంకాలము రెండుపూట్లా  శివుని విధిగా పూజించాలి. 
రుద్రాక్ష మాలని ధరించాలి. 
నుదుటన చందనము విభూతి కుంకుమను పెట్టుకోవాలి. 
దీక్ష సమయంలో మౌనవ్రతులై ఉండాలి.  అవసరమైనంతవరకే అంటే మితంగా మాట్లాడాలి . 
నిత్యం, అనుక్షణం శివభక్తిని వీడకూడదు.ఇతరులను పిలిచినప్పుడు అయ్యప్ప భక్తులు "స్వామి "అన్నట్లు "శివా" భక్తులు కూడా "శివ" అని పిలుస్తుండాలి. 
అవకాశమున్న సార్లు "శివపంచాక్షరీ" ఓం నమశ్శివాయ అని జపము చేసుకుంటూ ఉండాలి. ఒక బీజాన్ని మట్టిలో నాటినట్టు, మనసులో ఈ పంచాక్షరీ మంత్రాన్ని నాటుకోవాలి . 
ఒంటి పూట శాఖాహార భోజనం చేస్తూ,  నేలపై నిద్రించాలి . 

ఈ విధంగా నలభై రోజులు దీక్షని చేపట్టాలి. అది ముగిసిన తర్వాత,  జ్యోతిర్ముడితో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలి .  శ్రీశైల మల్లికార్జున స్వామికి భ్రమరాంబ దేవికి నమస్కరించి దీక్ష విరమించాలి . 


శివ దీక్ష మాల ధారణ మంత్రము:

ఓంకార శక్తి సంయుక్తం-సచ్చిదానంద రూపిణీం
శ్రీశైలేశదశాపూర్ణం -శివముద్రాం నమామ్యహం

అంటూ రుద్రాక్షమాలకు ఉన్న స్వామివారి ముద్రకు ప్రణామం ఆచరించాలి. 

శ్రీశైల శృంగ నిలయః సాక్షాత్తు శ్రీ మల్లికార్జునః
దీక్షా బద్ధ స్వరూపాంచ- ముద్రాం మే పాతు సర్వదా

అంటూ శివ మాల ధారణం చేయాలి.
 

శివదీక్ష విశేషం :
ఈ శివదీక్ష నియమ పూర్వకంగా చేపట్టిన వారికి భూతప్రేత పిశాచ బాధలు నశించిపోతాయి .  గ్రహముల వలన కలుగు అపకారము తొలగిపోతుంది . సిరి  సంపదలు లభిస్తాయి. ఇహ లోకమున సౌఖ్యము, పరలోకమున మోక్షము లభిస్తాయి. 

అవకాశం ఉన్న వారి దీక్ష చేపట్టండి మల్లికార్జున స్వామి కృపకు పాత్రులు కండి. 

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః పార్వతీ పతే నమో నమః



Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom