మన భారతదేశం మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలున్నాయి. వాటిలో కాశీలోని విశ్వనాథలింగం కూడా ఒకటి. కానీ పరమపవిత్రం అయిన కాశీ నగరంలో విశ్వనాధ లింగం కాకుండా మిగిలిన 11 జ్యోతిర్లింగాలకు ప్రతిగా 11 లింగాలు ఉన్నాయి. కాశీలోని ఈ 12 లింగాలను దర్శిస్తే, 12 జ్యోతిర్లింగాలను దర్శించిన ఫలితం కలుగుతుందట. ఈ లింగాల ప్రాశస్త్యం కాశీఖండంలో వివరించి ఉంది. మరి ఆ లింగాల గురించి తెలుసుకుందామా?
ఈ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో సోమేశ్వర్ లింగం ఉంది. మన్ మందిర్ ఘాట్ దగ్గర గల వారాహి ఆలయ సమీపంలో సోమనాధుడు కొలువై ఉన్నాడు. వారాహి ఆలయం నుండి దారి కనుక్కుంటూ వెళ్ళండి.
ఈ లింగానికి ప్రతిగా కాశీలో గణేశ్వర్ కొలువై ఉన్నాడు. వారాహి దేవి ఆలయానికి సమీపంలోనే గణేశ్వర్ (రామేశ్వర్ అని కూడా అంటారు) కొలువై ఉన్నాడు. కనుక్కుంటూ వెళ్ళండి. సోమనాథ్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది.
ఈ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో త్రిపురాంతకేశ్వర లింగం ఉంది. కొన్ని లాండ్ మార్క్స్ ఇస్తున్నా గమనించండి. Mehmoorgunj Union Bank దాటిన తర్వాత సిద్దార్థ్ అనే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. తర్వాత శీతలాదేవి ఆలయం. శీతలా దేవి ఆలయం నుండి ఎడమ పక్క సందులోకి తిరిగి కొంచెం దూరం వెళ్తే Sigra Tila (Mount Of Mud) అని వస్తుంది. అక్కడే ఈ త్రిపురాంతకేశ్వరుడు కొలువై ఉన్నాడు. దారి కనుక్కుంటూ వెళ్లాల్సిందే.
ఈ ఆలయంలోనే త్రిముఖ వినాయకుడు కొలువై ఉన్నాడు. తప్పక దర్శించండి. త్రిముఖ వినాయకుడు కాశీలోని 56 వినాయక స్వరూపాలలో ఒకటి. కాశీఖండం ప్రకారం వినాయకుని 3 ముఖాలలో కోతి, సింహం, ఏనుగు ఉంటాయి. కానీ మనకు విగ్రహంలో 3 ఏనుగు తొండాలు కనిపిస్తాయి.
త్రిపురాంతకేశ్వర్ ఆలయానికి దగ్గరలోనే Kamaccha అనే ప్రదేశం వద్ద, కామాఖ్య ఆలయ సమీపంలో వైద్యనాథేశ్వరుడు కొలువై ఉన్నాడు.
6) మహాకాళేశ్వర్ :
మృత్యుంజయ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న మహాకాళేశ్వర లింగం ఉజ్జయినిలో కొలువై ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా ఉంది. ఈ లింగార్చన వలన సమస్త విశ్వాన్ని అర్చించిన ఫలము లభిస్తుందట.
7) ఓంకారేశ్వర్ :
సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు అగ్ని స్తంభంగా వెలిసినప్పుడు అకార, ఉకార, మకారాలతో కలిసిన ఓంకారలింగం బ్రహ్మదేవుని ప్రార్ధన మేరకు కాశీలో ఓంకారేశ్వరుడిగా వెలిసాడు. ఓంకారేశ్వరుడిని కపిలేశ్వర్, నాగేశ్వర్ అని కూడా పిలుస్తారు. ఓంకార జ్యోతిర్లింగానికి ప్రతిగా ఈ ఓంకారేశ్వరుడిని చెప్తారు.
కాశీ పట్టణంలోని ఓంకారేశ్వరుడి ముందు నిలబడి ఎవరైతే బ్రహ్మగారు చేసినటువంటి ఓంకారేశ్వర స్తోత్రం చేసి అభిషేకం చేస్తారో వారు సశాస్త్రీయంగా నమక చమకాలతో రుద్రాభిషేకం చేసిన ఫలితం పొందుతారు. ఈ లింగార్చన వలన లక్ష మార్లు రుద్రజపం చేసిన ఫలితం వస్తుంది. అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుంది.
ఓంకారేశ్వరుడి లింగంతో పాటూ అకారేశ్వర లింగం, మకారేశ్వర లింగం కూడా ఉంటాయి. వాటిని కూడా తప్పకుండా దర్శించండి. (పూర్వం బిందు లింగం, నాద లింగం కూడా ఉండేవట). ఈ ఐదు లింగాలను (అకార, మకార, ఓంకార, బిందు, నాద లింగాలు) పంచ అక్షర లింగాలు అని పిలుస్తారట. మత్స్యోదరీ తీర్ధంలో స్నానం చేసి ఓంకారేశ్వరుడిని అర్చిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. మచ్చోదరి ప్రాంతంలో పథాని టోలా మార్గంలో ఈ ఆలయం ఉంది.
8) నాగేశ్వర జ్యోతిర్లింగం :
ఈ లింగానికి ప్రతిగా కాశీలో కూడా నాగేశ్వరుడు కొలువై ఉన్నాడు. పథాని టోలా మార్గంలో సంకటా దేవి ఆలయ సమీపంలో నాగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ లింగార్చన వలన మనం జీవితంలో తెలిసిగాని, తెలియకగానీ చేసిన సమస్త పాపాలూ నశిస్తాయట.
మృత్యుంజయ్ మహాదేవ్ ఆలయంలో కూడా నాగేశ్వర్ లింగం ఉంది. ఆ లింగాన్ని కూడా నాగేశ్వర జ్యోతిర్లింగానికి ప్రతిగా చెప్తారు.
9) త్రయంబకేశ్వర్ నాశిక్ :
నాశిక్ త్రయంబకేశ్వరునికి ప్రతిగా కాశీలో త్రయంబకేశ్వరుడు వెలిసాడు. త్రిలోకనాధ్ అనే పేరుతో కూడా ఈ లింగాన్ని పిలుస్తారు. Hauj Katora అనే ప్రదేశంలో పురుషోత్తం ఆలయంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో అనేక విష్ణు ప్రతిమలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని పురుషోత్తం ఆలయం అని పిలుస్తారు. కనుక్కుంటూ వెళ్లాల్సిందే.
10) భీమేశ్వర్ జ్యోతిర్లింగం :
ఈ జ్యోతిర్లింగానికి ప్రతిగా కాశీలో భీమాశంకరుడు కొలువై ఉన్నాడు. ఈ లింగార్చన వలన మనం చేసిన అన్ని రకాల కర్మలూ నశించి మోక్షం లభిస్తుందట.
విశ్వనాధుని ఆలయం నుండి ఉత్తర దిశగా నడిస్తే సరస్వతీ పాఠక్ అని వస్తుంది. అక్కడి నుండి కాశీ కార్వత్ ఆలయం కనుక్కుంటూ వెళ్ళండి. ఈ ఆలయంలోనే భీమాశంకరుడు కొలువై ఉన్నాడు.
11) కేదారేశ్వర్ :
కాశీలో తప్పక దర్శించాల్సిన మందిరం. విశ్వనాధ లింగం ఎంత గొప్పదో.. అలాగే స్మరణ మాత్రం చేత మోక్షాన్నే ఇవ్వగలిగిన లింగం కేదారేశ్వర లింగం. ప్రతీరోజూ ఉభయ సంధ్యలయందు కేదారేశ్వరుడిని స్మరిస్తే మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.
తెల్లవారుఝామున బ్రాహ్మీ ముహూర్తంలో గంగాస్నానం చేసి, కేదారేశ్వరుడిని దర్శించాలి. ఈ కేదారేశ్వర లింగం కూడా స్వయంభూ లింగమే. హిమాలయ కేదారేశ్వరుడి కన్నా కాశీలోని కేదారేశ్వరుడు ఉదారుడు అంటారు.
పూర్వం వశిష్ఠుడనే బ్రాహ్మణ పిల్లవాడు ప్రతీ సంవత్సరం తన గురువు గారితో కలిసి హిమాలయాల్లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేవారు. ఒకసారి కేదార దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో తన గురువుగారు చనిపోతూ కేదారేశ్వరుడుని దర్శించుకునే మార్గంలో ప్రాణాలు పోయినా కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పి ప్రాణాలు విడిచారు. తరువాత ఆ పిల్లవాడు కాశీ క్షేత్రంలో బ్రహ్మచారియై సదా పరమేశ్వర ధ్యానంలో గడిపేవాడు. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం చైత్ర మాసం లోని పౌర్ణమి తిధిలో హిమాలయ కేదారేశ్వరుడిని దర్శించుకుని వచ్చేవాడు. వశిష్ఠుడు వార్ధక్యం చేత ఇంక కేదారేశ్వరుని దర్శనానికి వెళ్లలేక, కాశీలో పరమేశ్వరుడిని ప్రార్ధించగా వశిష్ఠుని కోరిక మేరకు పరమేశ్వరుడు కేదారేశ్వరుడిగా కాశీలోనే వెలిసాడు. హిమాలయ కేదారేశ్వరుడి పూజ కన్నా, కాశీలోని కేదారేశ్వరుడి పూజ 7 రెట్లు అధిక పుణ్యఫలం ఇస్తుందని ప్రతీతి.
12) విశ్వేశ్వర్ :
కాశీ విశ్వనాధ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయం. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని 'బంగారు మందిరం' అని కూడా అంటారు. విశ్వనాధుని దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం.