Type Here to Get Search Results !

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే - Shri Subrahmanyam Saranam Prapadye

 శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే

ఆరు ముఖములను, పన్నెండు చేతులను కలిగి నెమలి వాహనారూఢుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్న శివపార్వతుల గారాల బిడ్డ దేవ సేనల ప్రభువు కేవలం కావడి మొక్కులను సమర్పించినంతనే భక్తులకు వంశాభివృద్ధిని, బుద్ధి సమృద్ధిని ప్రసాదించే భక్తసులభుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు జన్మించిన పవిత్ర పర్వదినం 'శ్రీ సుబ్రహ్మణ్య షష్టి'. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. ఈ పర్వదినానికి సుబ్బరాయషష్టి, కుమారషష్టి, స్కందషష్టి, కార్తికేయషష్టి, గుహప్రియా వ్రతం వంటి పేర్లున్నాయి.


శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుక...

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు బలగర్వితుడై సకల లోకవాసులను హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అందుకు ''శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. శివుడు తపస్సు మానేసి పార్వతీదేవిని పరిణయమాడునట్టు చేస్తే వారికి జన్మించే కుమారుడు తారకాసురుడిని అంతమొందిస్తాడు'' అని ఉపాయం చెప్పాడు. ఈ మాటలను విన్న దేవతలు, శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలాగా చేసేందుకు మన్మథుడిని పంపగా శివుడు తన మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని దహించి వేశాడు. అయితే తారకాసురుడిని అంత మొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు తనకు పరిచర్యలు చేస్తూ ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ శృంగారంలో తేలియాడుతూ ఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడవేసింది.


అగ్నిదానిని భరించలేక గంగలో వదలగా దానిని గంగ తన తీరంలోని శరవణమునకు తోసివేసింది. అక్కడే శ్రీకుమారస్వామి జన్మించాడు. శరవణమున జన్మించిన వాడు కనుక స్వామికి 'శరవనబహ్వుడు' అనే పేరు ఏర్పడింది. అంతేకాకుండా గంగానదిలో పడిన రేతస్సు ఆరు భాగాలుగా ఏర్పడింది. ఆ ఆరు భాగాలు అలల తాకిడికి ఏకమై ఆరు ముఖములు, పన్నెండు చేతులు, రెండు కాళ్ళతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందువల్ల ఆయనకు 'షణ్ముఖుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆవిర్భవించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరు కృత్తికలను నియమించారు. వారు పెంచి పెద్ద చేశారు. ఆరు కృత్తికల చేత పెంచబడడం వల్ల స్వామికి 'కార్తికేయుడు' అనే పేరు ఏర్పడింది. ఈ విధంగా కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిపై దండెత్తి తారకాసురుడిని అంతమొందించి దేవతలను ప్రజలను రక్షించినట్లు కథనం.


బ్రహ్మనే బంధించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి !

త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి కుమారుడిగా జన్మించి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు  నియమించిన కృత్తికల చేత పెంచబడిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని బాల్యంలోని బందించినట్లు పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యస్వామి పసివాడుగా తల్లి పార్వతీదేవి ఒడిలో ఉన్న సమయంలో ఒకసారి శివుడు పార్వతీదేవికి ప్రణవ మంత్రార్థాన్ని వివరించారు. బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దానిని విన ఆకళింపు చేసుకున్నాడు. ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి రాగా బాలుడుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ప్రణవమంత్రార్థాన్ని చెప్పాల్సిందిగా అడిగాడు. బ్రహ్మ సరిగ్గా చెప్పకపోవడంతో సుబ్రహ్మణ్యస్వామి బ్రహ్మదేవుడుని బంధించాడు. శివుడు జోక్యం చేసుకుని విడిపించాడు.


నెమలి వాహనం,కోడి ధ్వజం...

తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి శూరపద్ముడుపై దండెత్తి యుద్ధం చేశాడు. యుద్ధంలో ఆరవరోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో....నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటున్నట్లు పురాణ కథనం.


వల్లీ...దేవసేనలు.....

శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఇద్దరు దేవేరులున్నారు. శ్రీవల్లీదేవి, శ్రీదేవ సేనలు. వారు తారకాసురుడిని అంతమొందించిన తర్వాత దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యస్వామికిచ్చి వివాహం చేయగా, తిరుత్తణి ప్రాంత పాలకుడైన నందిరాజు కుమార్తె వల్లీదేవిని వేటగాడి రూపంలో వెళ్ళి వివాహం చేసుకున్నట్లు పురాణ కథనం.


కావడి మొక్కులంటే ఇష్టం.......

పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద 'బ్రహ్మదండం' అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.


సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని షోడశోపచారాలు అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ దినమంతా ఉపవాస వ్రతం పాటించి మరుసటిరోజు తిరిగి పూజ చేసి భోజనం చేసి ఉపవాసంను విరమించాలి. అంతేకాకుండా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని సర్పంగా కూడా ఆరాధిస్తూ ఉండడం ఆచారం. కనుక పుట్ట వద్దకు వెళ్ళి పూజ చేసి పుట్టలో పాలుపోయడం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. దీనికి తోడు గ్రహదోషాలతో బాధపడేవారు ముఖ్యంగా రాహు, కేతు, సర్ప, కుజదోషములున్న వారు కఠినమైన ఉపవాసం ఉండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఫలితాలుంటాయని చెప్పబడుతూ ఉంది.


బ్రహ్మచారికి పూజ

సుబ్రహ్మణ్యషష్టినాడు బ్రాహ్మణ బ్రహ్మచారిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి రూపంగా భావించి పూజించి పులగం, క్షీరాన్నం వంటి వంటలను చేసి భోజనం పెట్టి, పంచలసాపు,దక్షిణలను తాంబూలమందు ఉంచి ఇచ్చి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.


వీటికి తోడు ఈరోజు "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ విధంగా సుబ్రహ్మణ్యషష్టి జరుపుకోవడం వల్ల వంశాభివృద్ధి, విజ్ఞానాభివృద్ధి, బుద్ధి సమృద్ధి కలుగుతాయి.

షదాననం చందన లేపితాంగం

మహారసం దివ్య మయూర వాహనం

రుదస్య నూనుం సురలోకనాథం

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే.




   

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom