వసంత పంచమి
ఇలా చేస్తే సరస్వతీ అనుగ్రహం.. విద్యా ప్రాప్తి
హిందూ మతంలోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతిని చదువుల తల్లిగా ఆరాధిస్తారు. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది.
మాఘ శుక్ల పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు. జ్ఞానం మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానం, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత సరస్వతీదేవి వసంత పంచమి రోజే జన్మించిందని భావిస్తారు. అందుకే ఆ రోజున సరస్వతిని ప్రత్యేకంగా పూజిస్తారు. అంతేకాదు, అమృతం కోసం దేవదానవులు పాలకడలిని చిలుకుతుండగా ఈరోజునే శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించిందని, అందుకే దీనిని మదన పంచమిగా కూడా పేర్కొంటారు.
యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా.. సకల విద్యాస్వరూపిణి సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావన తిథి. బ్రహ్మవైవర్త పురాణం సహా పలు పురాణాలు ఈ రోజున సరస్వతీదేవిని అర్చించాలని పేర్కొంటున్నాయి.
‘మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః’వసంత పంచమి రోజున ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని పూజించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించాలి. సరస్వతిదేవి ప్రతిమతోపాటు జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలు, లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తరం చదివి... తెల్లని కుసుమాలు, సుగంధ ద్రవ్యాలు, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.
ఈ రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా జరిపిస్తారు. తద్వారా ఆ తల్లి కరుణాకటాక్షాలు లభించి అపారమైన జ్ఞానం సిద్ధిస్తుందని, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం. పూర్వ కాలంలో రాజులు తమ ఆస్థానాలలో దర్బారులు నిర్వహించి, కవితా గోష్టి జరిపి కవులు, పండితులు, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.
విధాత బ్రహ్మ సైతం పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు. గాయత్రీదేవి ఐదు రూపాలలో సరస్వతీదేవి ఒకటి. గురు శాపం వల్ల విద్యను కోల్పోయిన యాజ్ఞవల్క్యుడు సూర్యుని ఆరాధించగా, అతడికి సరస్వతీ ఉపాసనను సూర్యభగవానుడు ఉపదేశించాడు. సరస్వతీ కృపతో స్మృతి శక్తిని తిరిగి సంపాదించిన యాజ్ఞవల్క్యుడు మహావిద్వాంసుడయ్యాడు. వాల్మీకి సైతం సరస్వతీని ఉపాసించి రామాయణ రచనను చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
వ్యాస మహర్షి సరస్వతీదేవి అనుగ్రహంతోనే వేదాలను విభజించాడు. అష్టాదశ పురాణాలను ఆవిష్కరించి, భారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడు. తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం పొందడమే కాదు, ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేశాడు.
సరస్వతిదేవిని విద్య, వాక్కు, తెలివి, జ్ఞానం మరియు కళల దేవతగా పూజిస్తారు. విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి మాఘ శుక్ల పంచమి రోజున జన్మించటం వలన ,ఈరోజున సరస్వతిని ప్రత్యేకంగా పూజిస్తారు.మాఘ శుక్ల పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి ,మదన పంచమి అని కూడా అంటారు. ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో లక్ష్మిదేవి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.సరస్వతి దేవిని ప్రముఖంగా నవరాత్రి మరియు వసంత పంచమి పండుగల సమయంలో ఎక్కువగా పూజిస్తారు.
సరస్వతీ పూజకు ముందుగా దీపారాధన ,ఆచమనం చేసి గణపతిని పూజించుకొనిన తరువాత సరస్వతి పూజని మొదలుపెట్టాలి.
ఆచమ్య, ప్రాణాయా మాదీన్ కుర్వా, దేశకాలమాన గోత్రనామధేయాదీన్ సంస్కృత్య-
ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ మమ ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫల పురుషార్ధ సిద్ధ్యర్థం, సకలవిద్యా పారంగతత్వ సిద్ధ్యర్థం చ వర్షే వర్షే ప్రయుక్త ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ఆశ్వయుజ మాస ప్రతిపచ్చుభ సమయే శ్రీ సరస్వతీదేవి ముద్దిశ్య శ్రీ సరస్వతీ దేవతా. ఇతి సంకల్ప్య - కలశపూజాం కుర్యాత్.
షోడశోపచార పూజా
శ్లో ॥ పుస్తకేతు యతోదేవీ క్రీడతే పరమార్థతః
తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికమ్॥
ధ్యానమేవం ప్రకురీత్వ సాధనో విజితేంద్రియః,
ప్రణవాసవ మారుఢాం తదరత్వేన నిశ్చితాం॥
ధ్యానం:
శ్లో॥ అంకుశం చాక్ష సూత్రంచ పాశం వీణాంచ ధారిణీం,
ముక్తాహారసమాయుక్తాం మోదరూపాం మనోహరామ్
కృతేన దర్పణాభ్యేన వస్తే ణోపరిభూషితాం,
సుస్తనీం వేదవేద్యాం చ చక్రార్థ కృతశేఖరామ్
జటాకలాప సంయుక్తాం పూర్ణచంద్రనిభాననం,
త్రిలోచనాం మహాదేవీం స్వర్ణనూపుర ధారిణీం
కటకై స్స్వర్ణ రత్నాద్యై ర్ముక్తావలయభూషితాం,
కంబుకంఠం సుతామ్రోష్టీం సర్వాభరణ భూషితాం
కేయూరై ర్మేఖలాద్యైశ్చ ద్యోతయంతీం జగత్రయం
శబ్దబ్రహ్మాత్మికాం దేవీం ధ్యానకర్మ సమాహితః ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహనం :
అత్రాగచ్ఛ జగద్వంద్యే సర్వలోకైక పూజితే,
మయాకృతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీ ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ఆవాహయామి.
ఆసనం:
అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం.
ముక్తామణ్యంచిఉంచారు చాసనం తే దాదామ్యహం ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - ఆసనం సమర్పయామి.
పాద్యం:
గందపుష్పాక్షతై స్సార్థం శుద్దతోయేన సంయుతం,
శుద్ధస్పటిక తుల్యాంగి పాద్యం తే ప్రతిగృహ్యతాం ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం:
భక్తాభీష్టప్రదే దేవీ దేవదేవాది వందితే,
ధాతృప్రియే జగద్ధాత్రి దదామ్యర్ఘ్యం గృహాణ మే ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనీయం:
పూర్ణచంద్ర సమానాభే కోటిసూర్య సమప్రభే,
భక్త్యా సమర్పితం వాణీ గృహాణాచమనీయకం ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం :
కమలభువనజాయే కోటిసూర్య ప్రకాశే
విశదశుచివిలాసే కోమలాకారయుక్తే
దధీమధుఘృతయుక్తం క్షీరరంభాఫలాధ్యం
సురుచిర మధుపర్కం గృహ్యతాం దేవవంద్యే ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం:
దధిక్షీరఘృథోపేతం శర్కరా మధుసంయుతం,
పంచామృతస్నాన మిదం స్వీకురుష్వ మహేశ్వరి ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం:
శుద్ధోదకేన సుస్నానం కర్తవ్యం విధిపూర్వకం,
సువర్ణకలశానీకై ర్నానాగంధ సువాసితైః ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - శుద్ధోదక స్నానం సమర్పయామీ.
వస్త్రయుగ్మం :
శుక్ల వస్త్రద్వయం దేవీ కోమలం కుటిలాలకే.
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణీ ప్రతిగృహ్యతాం ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం:
శబ్దబ్రహ్మాత్మికే దేవీ శబ్దశాస్త్ర కృతాలయే,
బ్రహ్మమాత్రం గృహాణ త్వం బ్రహ్మశక్రాది పూజితే ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - యజ్ఞోపవీతం సమర్పయామి.
ఆభరణాదీన్ :
కటకమకుటహారై ర్నూపురై రంగదార్యే
ద్వివిధసుమణియుకై రేఖలా రత్నహారై:॥
కమలదళవిలసే కామదే సంగృహీష్వ
ప్రకటిత కరుణార్ద్రే భూషితే: భూషణాని ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - ఆభరణాని సమర్పయామి.
గంధం:
చందనాగరు కస్తూరీ కర్పూరాద్యైశ్చ సంయుతం,
గంధం గృహాణ త్వం దేవి విధిపత్నీ ర్నమోస్తుతే॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః గంధం సమర్పయామి.
అక్షతలు:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండుల నిర్మితాస్
గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తి శ్శుభాత్మకాన్ ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.
పుష్పపూజ :
మందారాది సుపుష్పైశ్చ మల్లికాభిర్మనోహరై:,
కరవీరై ర్మనోదమ్యై ర్వకులై: కేతకై శ్శుభై:
పున్నగైర్జాతికుసుమై ర్మందారైశ్చ సుశోభితై:,
నీలోత్పలైః శుభై శ్చాన్యై స్తత్కాల తరుసంభవైన,
కల్పితాని చ మాల్యాని గృహాణానురవందితే.
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - పుష్పైః పూజయామి.
అథాంగ పూజా
ఓం బ్రహ్మణ్యై నమః పాదౌ పూజయామి
ఓం బ్రహ్మణ్యమూర్తయే నమః గుల్ఫౌ పూజయామి
ఓం జగత్స్వరూపిణ్యై నమః జంఘా పూజయామి
ఓం జగదాద్యాయై నమః జానునీ పూజయామి
ఓం చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి
ఓం కమలభూమయే నమః కటిం పూజయామి
ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి
ఓం హరిపూజ్యాయై నమః ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః స్తనౌ పూజయామి
ఓం విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి
ఓం గానవిచక్షణాయై నమః కంఠం పూజయామి
ఓం స్కందప్రపూజ్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం ఘనబాహవే నమః బాహూ పూజయామి
ఓం పుస్తకధారిణ్యై నమః హస్తౌ పూజయామి
ఓం శ్రోత్రీయబంధవే నమః శ్రోత్రే పూజయామి
ఓం వేదస్వరూపాయై నమః వక్త్రం పూజయామి
ఓం సువాసిన్యై నమః నాసికాం పూజయామి
ఓం బింబసమానోష్ట్యై నమః ఓష్టౌ పూజయామి
ఓం కమలచక్షుషే నమః నేత్రే పూజయామి
ఓం తిలకధారిణ్యై నమః ఫాలం పూజయామి
ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి
ఓం సర్వప్రదాయై నమః ముఖం పూజయామి
ఓం శ్రీ సరస్వత్యై నమః శిరః పూజయామి
ఓం బ్రహ్మరూపిణ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.
శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి
ఓం సరస్వత్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం శ్రీప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్తకధృతే నమః 10
ఓం జ్ఞానసముద్రాయై నమః
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామరూపాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం మహాపాతకనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః 20
ఓం మహాభాగ్యాయై నమః
ఓం మహోత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః
ఓం సీతాయై నమః
ఓం విమలాయై నమః 30
ఓం విశ్వాయై నమః
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమ:
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకారభూషితాయై నమః 40
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వసుధాయ్యై నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః 50
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః
ఓం వింధ్యాచలవిరాజితాయై నమః
ఓం చండికాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం బ్రాహ్యే నమః
ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
ఓం సౌదామన్యై నమః
ఓం సుధామూర్యై నమః 60
ఓం సుభద్రాయై నమః
ఓం సురపూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచన్నాయై నమః
ఓం విద్యారూపాయై నమః
ఓం విశాలాక్షై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహాఫలాయై నమ: 70
ఓం త్రయీమూర్త్యై నమః
ఓం త్రికాలజ్ఞాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్రరూపిణ్యై నమః
ఓం శుంభాసురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్తబీజనిహంత్రే నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః 80
ఓం ముణ్డకాయప్రహరణాయై నమః
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
ఓం సర్వదేవస్తుతాయై నమః
ఓం సామ్యాయై నమః
ఓం సురాసురనమస్కృతాయై నమః
ఓం కాళరాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమ: 90
ఓం వారాహ్యై నమః
ఓం వారిజాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్రగంధాయై నమః
ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధరసుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమ: 100
ఓం నీలభుజాయై నమః
ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
ఓం చతురాననసామ్రాజ్యై నమః
ఓం రక్తమధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలజంఘాయై నమః
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః 108
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
ధూపం:
దశాంగం గుగ్గులో పేతం సుగంధంచ మనోహరం
ధూపం గృహాణ కల్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతామ్ ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.
దీపం :
ఘృతావర్తి సంయుక్తం దీపితం దీపమంబికే,
గృహాణ చిత్స్వరూపే త్వం కమలాసన వల్లభే ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః దీపం దర్శయామి.
నైవేద్యం :
అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిస్టోపపాచితాన్.
మృదులాన్ గుడసమ్మిశ్రాన్ సజ్జీరక మరీచికాన్
కదళీపన సామ్రాణిచ పక్వాని సుఫలాని చ
కందమూల వ్యంజనాని సోపదంశం మనోహరం,
అన్నం చతుర్విధో పేతం క్షీరాన్నంచ ఘృతం దధి
శీతోదకం చ సుస్వాదు స్సుకర్పూ రై లాది వాసితం,
భక్షభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం
శ్రీ సరస్వతీ దేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం:
తాంబూలం చ సకర్పూరం పూగ నాగదళై ర్యుతం,
గృహాణ దేవదేవేశీ తత్వరూపీ నమోస్తుతే ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
నీరాజనం గృహాణత్వం జగదానందదాయిని,
జగత్తిమిరమార్తాండ మండలే తే నమోనమః ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి.
పుష్పాంజలి:
శారదే లోకమాతస్త్య మాశ్రి తాభీష్టదాయిని,
పుష్పాంజలిం గృహాణత్వం మయాభక్త్యా సమర్పితమ్ ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - పుష్పాంజలిం సమర్పయామి.
మంత్రపుష్పం :
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా,
యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి ర్దేవై స్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - మంత్రపుష్పం సమర్పయామి.
చతుర్దశ ప్రదక్షిణ :
పాశాంకుశధరా వాణీ వీణాపుస్తకధారిణీ,
మమ వన్డే వసే న్నిత్యం దుగ్ధకుందేందు నిర్మలా.
చతుర్దశ సువిద్యాసు రమతే యా సరస్వతీ,
చతుర్దశేషు లోకేషు సా మే వాచి వసేచ్చిరమ్ ॥
పాహిపాహి జగద్వంద్యే నమస్తే భక్తవత్సలే.
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః చతుర్దశ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
ఉపాయన దానం :
లడ్డుకాన్ ఘృతసంయుక్తాన్ చతుర్దశ మనోహరాన్
సదక్షిణం సతాంబూల ముత్తమాయ ద్విజాతయే ॥
సరస్వతీ నమస్తుభ్యం వరదే భక్తవత్సలే
ఉపాయనం ప్రదాస్యామి, విద్యావృద్ధిం కురుష్వ మే ॥
శ్రీ సరస్వతీ దేవ్యై నమః - ఉపాయనదానం సమర్పయామి.
వాయనదానం :
భారతీ ప్రతిగృహ్లాతు భారతీవై దదాతి చ,
భారతీ తారకోభాభ్యాం భారత్యైతే నమో నమః
ఇతి పూజావిధానం సమాప్తం.
శమీ ప్రార్థనా
(దశమ్యాం సాయాహ్నే శమీపూజాం కృత్వా తదనంతరం ధ్యాయేత్)
శమీ శమయ తే పాపం శమి శత్రు వినాశినీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శిని॥ 1
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం, ఆరోహతు శమీం లక్ష్మీ రౄణామాయుష్యవర్ధనీం ॥ 2
నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్ర ధారిణే, త్వత్తః పత్రం ప్రతీష్యామి సదామే విజయీభవ ॥ 3
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. పౌరుషేచా ప్రతిద్వంద్వశ్చరైనం జహి రావణమ్ ॥ 4
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం, దుస్స్వప్నహిరిణీం ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం ॥ 5
సరస్వతీ వ్రత కథ
సూతుండు శౌనకాదులను చచి ఇట్లనియె: మహర్షులారా! ఇంకొక ఉత్తమమైన వ్రతము జెప్పెద వినుండు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది రాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతులను పూజింపవలయు, లేక మూలా నక్షత్రము మొదలుకొనియైన పూజ చేయవలయును. అట్లు చేయుటకు అశక్తుడయ్యెనేని నవమినాడైనను పూజింపవలయును. మరియు ఈవ్రతం ఆచరించువారు ఇహలోకమున నిరంతర ఐశ్వర్య సంపన్నులై పరంబున దుర్గాలోకంబుజెందుదురు.
అనిన ఋషివర్యులు సూతునింగాంచి "మహాత్మా! తొల్లి ఈవ్రతంబు ఎవ్వరాచరించి సుఖంబుజెందిరి" యని అడుగగా సూతుండు "మునులారా! కృతయుగంబునందు మహా ధార్మికుండును, ప్రజాపాలన సమర్థుండును, నిత్యైశ్వర్య సమాయుక్తుండును, రథగజతురగ యుతుండునునగు సుకేతుండను రాజు కలడు. అతనికి సౌందర్య, గాంభీర్య, యౌవన సంపన్నురాలగు సువేదియను భార్య కలదు. అట్టి వనితామణి తోడకూడి ధర్మము తప్పక ప్రజాపాలనంబొనర్చుటచే క్షామము, శత్రువుల వలన భయంబును లేకుండెను.
ఇట్లుండ ఆ న్నరేంద్రునకును, అతని జ్ఞాతులకును విరోధము సంభవించినందున యుద్ధసన్నద్ధుడై శత్రువులుండు స్థలమునకు పోయి గదాశక్తి భిండివాల తోమర ముసల ముద్గర ప్రాస పట్టిసాద్యాయుధంబులచే కయ్యం బొనర్చె. ఆ ఘోరంబగు సమరమున సుకేతుండు శత్రువులచే కొట్టబడి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచుండెడి సుకేతుని అతని భార్యగాంచి "ఓహో! మన పురుషుండు సమరమున నిలువనేరక పరుగిడుచుండునపుడు మన మిచట నిలువుట తగదని ఆ సువేదియు భర్తను అనుసరించి పోయెను. ఇట్లిరువురు బహుదూరంబు జని ఒక అరణ్య ప్రాంతమును ప్రవేశించి క్షుద్బాధా పీడితులగుచు నివసించియుండ, కొద్దీ రోజులకు ఆ రాజశ్రేష్ఠుడు వ్యాధిపీడితుండై నడచుటకు కూడా శక్తిలేక ఉండెను. అంత నా రాజపత్ని మిగుల దుఃఖాక్రాంతురాలై భర్తను తన తొడమీద నిడుకొని శోకించుచు ఆ వనమునందు సంచరించుచుండగా ఆంగీరస మహర్షి ఆ వనితామణి చెంతకు వచ్చి యిట్లనియె.
"ఓ నారీతిలకమా! నీకు క్షేమము గలుగును గాక! దంపతులుగా నుండెడు మీరు ఎవ్వరు?. ఎచ్చోట నుండువారు, ఇచ్చటి కేల వచ్చితిరి? రాజ్యంబును, బంధుజనంబులను వదలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడుచు ఈ వనమునందేల సంచరించుచున్నారు?" అని అడుగగా ఆ మగువ మాటాడుటకు నోరాడక బొటబొట కన్నీరు నించి భోరుమని ఎలుగెత్తి వెక్కి వెక్కి యేడ్వం దొడంగె.
అంతట ఆముని 'ఓ వనితారత్నమా! దుఃఖము నొందకుము. లోకంబున మనుజులు దుఃఖము నొందుటచే ఏ కార్యమును సాధింపబోరు, కావున మీ దుఃఖమును పోనడచెద'ను చెప్పుమని దుఃఖోపశమనం బొనర్చి అడుగగా ఆ సువేదియు నిట్లనియె.
'మునివర్యా! ఈ నరవరుండు నా పెనిమిటి. ఇతండు రాజ్య పరిపాలనము సేయుచుండ కొద్దిరోజులకు ఇతనికిని, జ్ఞాతులకును విరోధము సంభవించెను. అంత ఇరు తెగలవారును దొడ్డకయ్యం బొనర్చిరి. ఆ కయ్యమున శత్రువులు మిగుల బలపరాక్రమశాలు అగుటం వలన, ముసల ముద్గర ప్రాస పట్టిసాధ్యాయుధములను నా భర్తపై ప్రయోగింప, ఇతండు ఆ బాణముల దెబ్బల కోర్వజాలక రాజ్యమునందు ఆశను వదలి ఈ అడవికి పరుగెత్తి వచ్చుచుండ నేను కూడా వచ్చితిని, కావున ఓ మహాత్మా! మరల మాకు రాజ్యమును, పుత్రసంతానంబును కలుగుటకు ఉపాయంబును చెప్పండని అనేక విధంబుల ప్రార్థింప, ఆంగీరస మహర్షి యిట్లనియె.
'ఓ పుణ్యవతీ! . నా తోడం కూడ రమ్ము. ఇదిగో అతి సమీపమున పంచవటీ తటాకమునందు దుర్గాక్షేత్రం వున్నది. అచ్చట దుర్గాదేవి సన్నిహితురాలై వున్నది. ఆ మహాదేవిని నీవు భక్తియుక్తురాలవై పూజించిన నీకు మరల రాజ్యమును పుత్రపౌత్రాభి సంపదయును కలుగునని చెప్పిన, ఆ సువేది భర్తను మోసికొని ఆంగీరస మహర్షి కడకు కొనివచ్చెను.
ఆ మహర్షియు ఆ సువేదిని భర్తతోడ స్నానము చేయుమనిన, ఆ పతివ్రతయు స్నానము చేసి వస్త్రములను ఎండబెట్టుకొని వచ్చిన తోడనే ఆంగీరస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజ చేయించెను.
ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు పూజచేసి, పదియవ దినమున ఉదయముననే మేల్కాంచి స్నానముచేసి పాయసాన్నముచే 'దుర్గాదేవి' యనెడు మంత్రమును ఉచ్చరించుచు హవనం బొనర్చి ఆంగీరస మహర్షికి దంపతీ పూజచేసి వారి అనుగ్రహము వలన దశదానాది వివిధ దానములంజేసి యథావిధిగ వ్రతమును పరిసమాప్తి బొందించి ఆంగీరస మహర్షితోడ వారి ఆశ్రమమునకు ఆ సువేది భర్తతోడం బోయెను.
అచట కొన్నిదినములు సుఖముగ వాసము చేయుచుండగ దుర్గా సరస్వతీ వ్రత మొనర్చిన మాహాత్మ్యము వలన ఆ సువేది గర్భంబు ధరించి పదియవ మాసమున నొక పుత్రునిం గనెను. అంతట అంగీరస మహర్షి ఆబాలునకు జాతకర్మాద్ సంస్కారము లొనర్చి సూర్యప్రతాపుండను పేరు పెట్టించి ఐదేండ్లు వెళ్లగానే విద్యాభ్యాసము చేయించెను. అంత ఆ బాలుండును సకల శస్త్రాస్త్ర విద్యల నేర్చుకొని యౌవ్వనంబు వచ్చిన తోడనే మహర్షిచే ననుజ్ఞం దీసికొని శత్రువులపైకి సమరమునకు బోయి, ముసల ముద్గరాద్యాయుధములం బ్రయోగించిన శత్రువులు బాలుడగు సూర్యప్రతాపుని తోడం పోరాడనేరక పరుగెత్తిపోయిరి. తోడనే ఆ బాలుండును తన రాజ్యమును మరల బొంది, తలిదండ్రుల తోడ్కొనిపోయి సుఖముగ రాజ్యపరిపాలనం బొనర్చుచుండెను. సువేదియును ప్రతి సంవత్సరమును దుర్గాసరస్వతుల పూజించుచు నిహలోకంబున పుత్రపౌత్రాది సంపదల తోడం గూడుకొని సుఖముగ నుండి అనంతరమున స్వర్గముం బొందెను.
కావున ఈ వ్రతమును బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులునుం జేయందగు. మఱియు ఈకథను వినువారును, పఠించువారును సకల పాపవిముక్తులై యిహలోకమున సర్వసుఖముల ననుభవించి, పిదప పరమపదంబు నొందుదురు.
సరస్వతీ వ్రత కథ సమాప్తము.