Type Here to Get Search Results !

నదులకీ పుష్కరుడికీ మధ్య ఉన్న బంధం ఏమిటి? - What is the relationship between the river and Pushkar?

నదులకీ పుష్కరుడికీ మధ్య ఉన్న బంధం ఏమిటి?

పోషయతీతి పుష్కరం.. పుష్కరం అనగా పోషించేది అని అర్ధం. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటూ, మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తుంది. 

మేధ్యం అంటే నదిలో మూడుసార్లు మునక వేస్తే, తెలిసీ తెలియక చేసే పాపాలు పోతాయి. 

మార్జన అంటే నీటిని చల్లుకోవడం.. అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన. 

ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి, భారతదేశములోని 12 ముఖ్యమైన నదులకు 'పుష్కరాలు' వస్తాయి. బృహస్పతి (గురు గ్రహం) సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున తిరుగుతుంది. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ నదికి పుష్కరాలు వస్తాయన్నమాట.

గంగా నది ------ మేష రాశి

రేవా నది (నర్మద) ------- వృషభ రాశి

సరస్వతీ నది ----- మిథున రాశి

యమునా నది ------ కర్కాటక రాశి

గోదావరి నది  ------ సింహ రాశి

కృష్ణా నది ------- కన్యా రాశి

కావేరీ నది ------ తులా రాశి

భీమా నది ------ వృశ్చిక రాశి

పుష్కరవాహిని/రాధ్యసాగ నది ------ ధనుర్ రాశి

తుంగభద్ర నది ------ మకర రాశి

సింధు నది ------ కుంభ రాశి

ప్రాణహిత నది ------ మీన రాశి

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కర కాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కర కాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత శక్తివంతమైనవి.

అసలు ఎవరు ఈ పుష్కరుడు? 

పూర్వం తుందిలుడనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన తన తపస్సుతో పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపచేసుకోగా, ఆ పరమాత్మ వరం కోరుకోమన్నాడు. అప్పుడు తుందిల మహర్షి నీలో నన్ను లీనం చేసుకో అని వరం కోరుకోగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలంలో తుందిలుడిని లీనం చేసుకున్నాడు. ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన తుందిల మహర్షి మూడున్నర కోట్ల తీర్ధాలకూ ఆధిపత్యం పొంది పుష్కరుడు అయ్యాడు.

సృష్టి మనుగడకు నీరే ఆధారం. కానీ జల సంపత్తి అంతా తుందిల మహర్షి ఆధీనంలో ఉండిపోవడంతో ఆ సృష్టి కర్త అయిన బ్రహ్మ శివుడిని ప్రార్ధించి, పుష్కరుడిని తన కమండలంలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇదిలా ఉండగా బృహస్పతి (గురు గ్రహం) లోకాన్ని కాపాడడం కోసం తనకు పుష్కర స్పర్శ కావాలనుకున్నాడు. అందుకోసం  జలాన్ని ఇవ్వాల్సిందిగా బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలి వెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. 

మేషాది రాశుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు మొదటి మరియు చివరి పన్నెండు రోజులూ పూర్తిగాను, మిగిలిన సంవత్సరం అంతా మధ్యాహ్న కాలంలో రెండు ముహూర్తాల కాలం పాటు పుష్కరుడు ఆ నదీ జలాల్లో ఉండేలాగా ఒప్పదం.

పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు ముక్కోటి దేవతలు, పితృదేవతలు కూడా ఆ నదీజలంలో ఆవాహన అయ్యి ఉంటారు. అందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది. శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు.

పుష్కర స్నానం ఎలా చెయ్యాలి?

పుష్కర స్నానానికి నదిలో దిగేముందు చెప్పవలసిన శ్లోకం:

పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ 

మృత్తికాం తే మయాదత్తం ఆహారార్ధం ప్రకల్పయా  

(స్త్రీలయితే 'మృత్తికాం' అని ఉన్న చోట 'హరిద్రాం' అని చదువుకోవాలి) 

ముందుగా, ఈ శ్లోకం చదువుతూ గట్టు మీద ఉన్న మట్టిని (స్త్రీలయితే మట్టికి బదులు పసుపు, కుంకుమ) కొద్ది కొద్దిగా మూడు సార్లు నదిలో వేసి, ఆ తరువాతనే నదిలోకి దిగాలని శాస్త్ర వచనం. లేదంటే పుష్కర స్నాన ఫలం దక్కదట. దీని వెనుక ఒక పురాణ గాధ ఉన్నది...  

పిప్పలాదుడు కౌశిక మహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒక రోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ, ఆ చెట్టు పండ్లు తింటూ, అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఆ పిల్లవాడి పరిస్థితిని చూసి, చలించి పోయిన నారద మహర్షి  'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి, ఆ నామం నీ జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు. 

ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి అతను సాధించిన తపోశక్తికి అభినందిస్తాడు. పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని అడగగా శనిదేవుడే అందుకు కారణమని చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు. ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెప్పగా, శాంతించి, శనిదేవుడిని తిరిగి గ్రహ మండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వారికి శని సంబంధమైన దోషాలు, బాధలు ఉండవని వరాన్ని ప్రసాదించాడు.  

తరువాత పిప్పలాద మహర్షి యజ్ఞం చేయగా, ఆ యజ్ఞ కుండం లోంచి కృత్య అనే రాక్షస భూతం ఉద్భవించింది. ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని, మునులని తినబోగా, వెంటనే పరమ శివుడు కల్పించుకుని, నిన్ను తలచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో నీ ఆకలి తీర్చుకో అని ఆఙ్ఞాపించాడట. అందుకే పుణ్య నదీ స్నానాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకం చెప్పుకున్న తరువాతనే స్నానం చెయ్యాలి. 

ముందుగా ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి. సభక్తికంగా మూడు మునకలు వేసినా సరిపోతుంది. కానీ సబ్బులు, షాంపూలతో మాత్రం నదీ స్నానం చెయ్యకూడదు.

పుష్కరాల సమయంలో...  

సూర్యోదయానికి పూర్వం చేసే 

స్నానం వలన.. వెయ్యి గోదానాలు చేసినంత పుణ్యం

పిండ ప్రదానం వలన... అశ్వమేధ యాగ ఫలము 

మధ్యాహ్న సమయంలో చేసే 

స్నానం వలన వాజపేయ యాగం చేసిన ఫలితము 

లభిస్తుందని శాస్త్ర వచనం. 

దానాలు: 

పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, దానాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. పుష్కర 12 రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దానానికి ప్రసిద్ధి. 

మొదటి రోజు: భూ దానం, ధాన్య దానం, సువర్ణ దానం, రజత దానం, అన్న దానం

రెండవ రోజు: రత్న దానం, గో దానం, లవణ దానం, వస్త్ర దానం

మూడవ రోజు: గుడ (బెల్లం), అశ్వశాఖ, ఫల దానం (పండ్లు)

నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె

ఐదవ రోజు: ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు 

ఆరవ రోజు: ఔషధ దానం, కర్పూర దానం, చందన దానం, కస్తూరి దానం 

ఏడవ రోజు: గృహ దానం, మంచం, కుర్చీ, పీట లాంటి గృహోపకరణ వస్తువులు 

ఎనిమిదవ రోజు: చందనం, కంద మూలాలు, పుష్ప మాలలు 

తొమ్మిదవ రోజు: కంబళ్ళు, దుప్పట్లు, పిండ దానం, దాసీ దానం 

పదవ రోజు: శాకం (కూరగాయలు) దానం, సాలగ్రామ దానం, పుస్తక దానం 

పదకొండవ రోజు: గజ దానం 

పన్నెండవ రోజు: నువ్వుల దానం 

పిండ ప్రదానాది కార్యక్రమాలు:

పుష్కర తీర్ధంలో పిండ ప్రదానం చేస్తే, సమస్త నదీ తీరాల్లో పిండ ప్రదానం చేసినట్లే.. అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించుకుంది. పైగా సూర్యోదయానికి పూర్వం చేసే పిండ ప్రదానం వలన అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో వేసుకున్నట్లే. మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని శాస్త్ర వచనం. సూర్యాస్తమయ వేళలో మాత్రం పుష్కర తీర్ధంలో ఎలాంటి క్రతువులు నిర్వహించరాదు. 

 ముగింపు:

తీర్ధ స్నానం ఉత్తమం. దానికంటే నదీ స్నానం ఉత్తమం. దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం, బ్రహ్మము నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం, అన్నం నుండి జీవుడు ఉద్భవించాయి. నదీ జలాలను సేవిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని నదీ జలాలలో స్నానమాచరిస్తే మాంద్యం, అలసత్వం మొదలైన శారీరక రుగ్మతలు నశిస్తాయని తైత్తరీయ ఉపనిషత్తు వివరిస్తుంది. పుష్కర స్నానం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. ఇలాంటి మహత్తు ఉన్నందుకే పుష్కర స్నానానికి అంత ప్రాధాన్యత.

Credits:-

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom