ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం
శ్రీమన్నారాయణుడి నాలుగో అవతారమైన నరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం యాదాద్రి పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. నరసింహుని నాలుగు రూపాలైన లక్ష్మీనరసింహ స్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగనరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి ఈ క్షేత్రంలో విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. యాదాద్రి కొండనే ఐదోరూపమైన ఉగ్రనరసింహస్వామిగా భక్తులు తలపోస్తారు. ‘స్వామీ నృసింహః సకలం నృసింహః’ అంటూ సృష్టిసర్వస్వమూ శ్రీమన్నారాయణుడైన నృసింహుని లీలావిలాసంగా భావించి, భక్తిప్రపత్తులతో కొలుస్తారు. ఇంతటి విశిష్టమైన యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కృష్ణశిలతో సంప్రదాయరీతిలో పునర్నిర్మించడం విశేషం. పునర్నిర్మించిన ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో రూపుదిద్దుకుంది. త్వరలోనే ఈ ఆలయం భక్తుల దర్శనానికి పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదాద్రి ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనకు ప్రతిరూపంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రీశుని ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా, భక్తజనావళికి కనువిందుగొలిపేలా శిల్పులు అత్యద్భుతంగా నిర్మించారు. ప్రధానాలయం పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. పాంచరాత్ర ఆగమ, వాస్తు శాస్త్రాల ప్రకారం ఆలయ విస్తరణ, అభివృద్ధి చేపట్టారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టారు.
ఆధారశిల నుంచి గోపురం పైవరకు పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం ప్రపంచంలోనే తొలిసారి కావడం యాదాద్రి ఆలయ విశేషం. దేవాలయ నిర్మాణ శైలి కోసం దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాలైన తిరుమల, మధురై, పళని, చిదంబరం, శ్రీరంగం, కుంభకోణం, అక్షరధామ్ వంటి ఆలయాలను పరిశీలించారు. గర్భాలయాన్ని తాకకుండా, ప్రధానాలయాన్ని విస్తరించారు. పాత ఆలయం మాదిరిగానే ముఖమండపం రాజప్రాసాదాన్ని తలపిస్తుంది. త్రితల రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళుతుండగా ఐరావతాలు స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి. ఇదివరకటిలాగానే స్వామి దర్శనం తర్వాత క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు తూర్పువైపు బయటకు వెళ్లే సమయంలో కొద్దిసేపు కూర్చునేందుకు వీలుగా ఉండే దిమ్మెను నూతన ఆలయంలో కూడా ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు ఆలయ దృశ్యాలను తిలకిస్తూ భక్తులు తన్మయత్వం పొందేలా తీర్చిదిద్దారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రెండులక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ఈ రెండు జిల్లాల మధ్యన 20 కిలోమీటర్ల దూరంలోని భూమిలో ఈ రాయి లభించింది. 2016లో యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ పూజలు చేశారు. ఐదేళ్లలో ఈ ఆలయాన్ని శిల్పులు పూర్తిస్థాయిలో నిర్మించి భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పించే దిశగా పనులు పూర్తి కావచ్చాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన స్థపతితో పాటు పదకొండుమంది ఉపస్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేనువందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఈ శిల్పుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటీడీఏ రూ.200 కోట్లు ఖర్చు చేసింది.
కృష్ణశిల ప్రత్యేకత
శ్రీరంగం ఆలయం మాదిరిగా నల్లరాతి శిలతో యాదాద్రి ఆలయం నిర్మాణం జరిగింది. కృష్ణ శిలగా ప్రసిద్ధి చెందిన ఈ నల్లరాయి ఎండకాలం చల్లదనాన్ని, చలికాలం వెచ్చదనాన్ని ఇస్తుంది. అత్యంత కఠినమైన శిల కావడం వల్ల ఎక్కువ కాలం ఆలయం పటిష్ఠంగా ఉంటుంది.
వేంచేపు మండపం..
యాదాద్రి క్షేత్రంలోని పడమటి రాజగోపురం ముందు భాగంలో నిర్మించిన మండపమే వేంచేపు మండపం. ఈ మండపాన్ని తిరుమలలో గొల్ల మండపం అంటారు. యాదాద్రీశుడి సన్నిధిలో నిర్మించి ఈ మండపంలో శ్రీస్వామి సేవలు, ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసినప్పుడు వేంచేపు మండపంలో భక్తుల కోసం కొద్ది సమయం అధిష్ఠింపజేస్తారు.
బ్రహ్మోత్సవ మండపం..
బ్రహ్మోత్సవ మండపాన్ని తూర్పు రాజగోపురం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవ మూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి, ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు.
అష్టభుజి ప్రాకార మండపం..
దేవాలయాల్లో అష్టభుజి ప్రాకార మండపాలు నిర్మించడం చాలా అరుదు. అతికొద్ది ఆలయాల్లో మాత్రమే ఈ అష్టభుజి ప్రాకార మండపాలు కనిపిస్తాయి. యాదాద్రీశుడి ఆలయంలో నిర్మించిన ఈ మండపం చాలా అరుదైనది. భక్తులకు కనువిందు చేసేలా ఈ అష్టభుజి ప్రాకార మండపం పై భాగంలో సాలహారం ఏర్పాటు చేశారు. వీటిలో కేశవ మూర్తులు, నవ నారసింహులు, ఆళ్వారులు, అష్టదిక్పాలకులు, అష్టలక్ష్మీ, దశావతారాలు, వైష్ణవ విగ్రహాలను సాలహారాల్లో ప్రతిష్ఠించనున్నారు.
ప్రధానాలయం ఇలా..
యాదాద్రీశుడి ప్రధానాలయ పునర్నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి వైటీడీఏ అధికారులు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులు దేశంలోని పలు దేవాలయాలను సందర్శించి వాటి నిర్మాణ శైలిని పరిశీలించారు. వారు దర్శించిన ఆలయాల్లో శ్రీవిల్లిపుత్తూరు, శ్రీరంగం, తిరుపతి, అహోబిలం, మధురై తదితర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో విజయనగర, పల్లవ, చోళ, కాకతీయ, హొయసాల శిల్ప శైలిని మిళితం చేసి శిల్ప శాస్త్ర ప్రకారం నిర్మించారు. ఏనుగులు పల్లవ, స్తంభాలు కాకతీయ, చాళుక్య, ఉప పీఠాలు హొయసాల శిల్పరీతులను ప్రతిబింబిస్తాయి. తెలంగాణకు చెందిన కాకతీయ శిల్పకళా రీతులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ప్రధానాలయంలో కాకతీయ స్తంభాలను, పడమర రిటైనింగ్ వాల్‌లో ఎలిఫెంట్ ప్యానల్‌ను తీర్చి దిద్దారు.
పాత ఆలయం మాదిరిగానే
వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా రాతి కట్టడాలతో యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. పాత ఆలయం చుట్టూ సిమెంట్ కట్టడాలను విడతలు విడతలుగా చేపట్టారు. ప్రస్తుతం గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పటిçష్ఠమైన గోడ నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని వెడల్పు చేశారు. గతంలో దేవాలయం చుట్టూ రథం, స్వామి వారి సేవ తిరగడానికి మూడు వైపుల్లో మాత్రమే స్థలం ఉండేది. దక్షిణం దిక్కున 120 అడుగుల రిటైనింగ్ వాల్ నిర్మించి ఆలయానికి దక్షిణ భాగంలో స్థలం పెంచారు.
గర్భాలయాన్ని మధ్యగా లెక్కిస్తూ పూర్తి అలయ నిర్మాణం చేపట్టారు. ముఖమండప స్థలం పెంచారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. చుట్టూ ప్రాకార, అష్టభుజి మండపాలు నిర్మించారు. ప్రధానాలయంలో గతంలో ఉన్న విధంగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ్ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఇందులో అదనంగా సేనా మండపం, ఆళ్వార్, రామానుజుల ఉప ఆలయాలను నిర్మించారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి భక్తులు వచ్చి, పడమటి రాజగోపురం నుంచి భక్తులు వెళ్లే మార్గంలో రాతి మెట్లకు రాతి రెయిలింగ్‌ను ఏర్పాటు చేయడం విశేషం.
ప్రథమ ప్రాకారం చుట్టూ..
ఆలయంలో ఏర్పాటు చేసిన ప్ర«థమ ప్రాకారం చుట్టూ అధిష్ఠం, స్తంభ వర్గం, ప్రస్తరంతో సహా కిటికీలను అందంగా నిర్మించారు. వీటిపై సాలహారాలను ఏర్పాటు చేశారు. 243 సాలహార విగ్రహాలను ఈ సాలహారాల్లో అమర్చారు. ఇక్కడ ప్రత్యేకించి స్లాబ్‌పై నీళ్లు రావడానికి అనువుగా సోమసూత్రంలాగా రాతిని నిర్మించారు.
దివ్య విమానం..
విమానం అనగా వివిధ కట్టడములతో నిర్మించిన నిర్మాణాన్ని విమానం అంటారు. వి+మానం విడదీయగా.. ఇందులో వి అనగా విశిష్టమైన, మానం అనగా కొలతలతో చేపట్టిన నిర్మాణం అని అర్థం. ఈ విమానంపైన కేశవ మూర్తుల ఆకారాలు, గరుత్మంతులు, సింహాలు, విమాన శిఖరం, అష్టకోణం ఆకారం ఉంటాయి.
నలు దిశల మండపాలు..
ప్రధానాలయ అంతర్ ప్రాకారంలోని నలు దిశల్లోను నాలుగు మండపాలను నిర్మించారు. ఈశాన్యంలో కల్యాణ మండపం, వాయవ్యంలో అద్దాల మండపం, నైరుతిలో యాగశాల, ఆగ్నేయంలో దీపాలంకరణ మండపం ఏర్పాటు చేశారు. ఈశాన్యంలో నిర్మించిన కల్యాణ మండపంలో భక్తులు నిత్య కల్యాణం నిర్వహిస్తారు. ఇక వాయవ్యంలో నిర్మించిన అద్దాల మండపంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు, అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. నైరుతిలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహిస్తారు. ఆగ్నేయంలో దీపాలంకరణ మండపంలో నిత్యం దీపాలు వెలిగించనున్నారు.
ప్రతిచోటా ఆధ్యాత్మిక రూపాలే..
తూర్పు రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి వెళ్లే మార్గంలో శిల్పులు అద్భుతమైన శిల్పాలను చెక్కారు. ఆలయంలో ఇరువైపులా గోడలకు శంఖు చక్ర నామాలు, ఏనుగుల వరుసలు, గరుత్మంతుడు, ఆంజనేయస్వామి, సుదర్శనమూర్తి, యోగ నారసింహుడు, గర్భాలయ గోడకు పంచ నారసింహ రూపాలు, పడమర ద్వారానికి ఇరువైపులా చండ ప్రచండ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఆలయ శైలి మార్చలేదు..
పంచనారసింహులతో విరాజిల్లుతున్న యాదాద్రి పాత ఆలయ శైలిని ఏమీ మార్చలేదు. గతంలో మూడు అంతస్తులు ఉండగా, ఇప్పుడు ఐదు అంతస్తులు నిర్మించారు. చిన్నగా ఉన్న ఆలయాన్ని మరింత పెద్దగా విస్తరించారు. నూతనంగా స్వామివారి ఆలయ ద్వారాన్ని విస్తరించడంతో పాటు ప్రధాన గర్భాలయ ద్వారాలకు రాగిపై బంగారు పూత పూసి, బంగారు రేకులను అమర్చారు. గర్భాలయ ముఖ మండపంపై ప్రహ్లాద చరిత్రను తీర్చిదిద్దారు. ప్రహ్లాదుడి జననం నుంచి హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని పట్టాభిషేకం వరకు పది ఘట్టాలను రూపొందించారు.
కనువిందు చేస్తున్న గాలిగోపురం
యాదాద్రికి విచ్చేసే భక్తులకు కొత్తగా నిర్మించిన గాలి గోపురం కనువిందు చేయనుంది. ప్రస్తుతం గాలి గోపురం పూర్తి అయింది. మరో రెండు నెలల్లో దీనికి మెట్ల దారి నిర్మాణం పూర్తి కానుంది. గతంలో ఇక్కడి నుంచి స్వామివారి పాదాల మెట్ల దారి ఉండేది.
రాతి లాకింగ్, డంగు సున్నం జిగట మిశ్రమంతో
పురాతన కాలంలో డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనారలను సరైన పాళ్లలో కలిపి జిగట మిశ్రమం తయారు చేసి రాతికట్టడాలలో ఉపయోగించే వారు. నాటి సంప్రదాయశైలిని యాదాద్రి ప్రధానాలయ రాతి కట్టడాల్లో ఉపయోగించారు. రాతి లాకింగ్ విధానానికి అదనంగా జిగట మిశ్రమం ఉపయోగించడంతో వందలాది సంవత్సరాల వరకు ఆలయాలు పటిష్ఠంగా ఉన్నాయని భావించి, నేటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణంలో వీటిని ఉపయోగించారు. నాటి నిర్మాణ శైలిని తలపించేలా నేడు యాదాద్రి ఆలయం రాతి కట్టడాల్లో ఈ జిగట మిశ్రమాన్ని పెట్టారు. భూకంపాలను తట్టుకునేలా ఈ జిగట మిశ్రమం ఎంతో గట్టిగా ఉంటుందని శిల్పులు అంటున్నారు. ఈ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్, కాంక్రీట్ వాడలేదు.
ధ్వజ స్తంభం
మానవుడికి వెన్నెముక ఎంత ముఖ్యమో, ఆలయాలకు ధ్వజస్తంభం అంత ముఖ్యం. కల్యాణం జరిగే దేవాలయాల్లో కచ్చితంగా ధ్వజస్తంభం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. పాలు కారుతున్న చెక్కతో ఈ ధ్వజస్తంభం చేయాలని శాస్త్రం చెబుతుందని శిల్పులు అంటున్నారు. యాదాద్రీశుడి ఆలయంలో సుమారు నలభై అడుగుల ఎత్తు ఉన్న ధ్వజస్తంభాన్ని తీసుకువచ్చారు. దీనిని ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రాంతంలోని టేకు వృక్షం నుంచి తీసుకువచ్చారు. త్వరలోనే ధ్వజ స్తంభం ప్రతిష్ఠించిన అనంతరం రాగి, బంగారు తొడుగులు అమరుస్తారు.
తిరుమల తరహాలో క్యూకాంప్లెక్స్
భక్తుల రద్దీ దృష్ట్యా క్యూ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. ఇండోర్‌లో క్యూకాంప్లెక్స్ డిజైన్ తయారు చేయించారు. జీ ప్లస్ త్రీ భవన సముదాయంలో ఒక్కో అంతస్తులో రెండు విశాలమైన భవనాల్లో ఇరవైవేల మంది ఏకకాలంలో స్వామి దర్శనం కోసం వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అంతకంటే రద్దీ పెరిగితే టోకెన్ విధానం ద్వారా మరుసటి రోజుకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లో మంచినీరు, గాలి, వెలుతురు ఏర్పాట్లతో పాటు వాష్‌రూమ్‌లనూ ఏర్పాటు చేస్తున్నారు.
దేవుని పూజాధికాల కోసమే విష్ణు పుష్కరిణి
కొండపైన గల విష్ణుపుష్కరిణిలోని పవిత్ర జలాలను స్వామివారి పూజాదికాల కోసమే వాడుతారు. చక్ర తీర్థం, తెప్పోత్సవం, బిందెతీర్థం కోసం వినియోగిస్తారు. గతంలో భక్తులు ఇందులోనే స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకునే వారు.
దేవతా వృక్షాలు, నక్షత్ర వృక్షాలు
యాదాద్రి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల భక్తులకు కేవలం దేవుడి చుట్టూ మాత్రమే కాకుండా వారి వారి నక్షత్రం వృక్షాల చుట్టూ, దేవతా వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని ప్రతీతి.
శివాలయం పూర్తి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పునర్నిర్మాణంతో పాటు రూపుదిద్దుకుంటున్నది శ్రీపర్వత వర్ధని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రధానాలయంతో పాటు అమ్మవారి ఆలయాలను కృష్ణశిలతో నిర్మించారు. మూడంతస్తుల రాజగోపుర శిఖరం వరకు కృష్ణశిలతో నిర్మించారు. మూలమూర్తులున్న మహా మండపాన్ని పదహారు స్తంభాలతో నిర్మించారు. అంతే కాకుండా నల్లరాతితో ఫ్లోరింగ్ చేశారు. ఇక గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలను ఇటుక, సిమెంట్‌తో నిర్మించారు. మహా మండపం ఎదురుగా మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన ఆరడుగుల నంది విగ్రహాన్ని నెలకొల్పారు. ముఖ మండపం మధ్యలో స్ఫటిక లింగం ఏర్పాటు చేయనున్నారు.
ప్రత్యేకతల ప్రాకార మండపం
ప్రధానాలయం చుట్టూ ఉన్న రెండో ప్రాకార మండపం ఆలయం వైపు భక్తుల కోసం ప్రత్యేకంగా నిత్యకల్యాణ మండపం, యాగశాల, అద్దాల మండపం, అర్చకులు, స్వామి వారి నివేదన ప్రసాదం తయారీ కోసం రామానుజ కూటమిని తీర్చిదిద్దారు. ఇందులోనే ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించే యాలీ స్తంభాలను మనోహరంగా తీర్చిదిద్దారు. ఇందులో సింహం కింద ఏనుగు శిల్పాలు, యాలి కింద సింహం, తీర్చిదిద్దారు.
ఈశాన్యంలో: నిత్యకల్యాణ మండపం,
ఆగ్నేయంలో: రామానుజ కూటమి
నైరుతిలో: యాగశాల
వాయవ్యంలో: అద్దాలమండపం
రెండో ప్రాకార మండపం
ప్రధానాలయం తర్వాత అత్యంత శిల్ప సంపద కలిగిన రెండో ప్రాకారం భక్తులకు ఆధ్యాత్మిక భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. అప్పటి వరకు స్వామి దర్శనం కోసం క్యూలైన్‌లో నిలబడ్డ అలసటను పూర్తిగా మటుమాయం చేసేలా ఈ ప్రాకారాన్ని తీర్చిదిద్దారు. ప్రధానాలయ నిర్మాణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్డిన ఏడు రాజగోపురాలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పూర్తిగా వైష్ణవ సంప్రదాయాలు, దశావతారాలు, పంచనార సింహ అవతారాలు, శంఖు చక్ర నామాలు ఇలా రాతి కట్టడాలపై భక్తి రస భావాన్ని మేళవించారు. ఏడు రాజగోపురాల ఎత్తు వివిధ అడుగుల్లో తీర్చిదిద్దారు. రెండో ప్రాకార మండపంలో తిరుమాడ వీధుల వైపు 58 యాలి స్తంభాలు, మరో వైపు అష్టభుజి ప్రాకార మండపాన్ని ఆధ్యాత్మిక భక్తి భావం పెంపొందించేలా రూపొందించారు.
పడమరవైపున గల సప్తతల రాజగోపురం ఎత్తు 85 అడుగులు కాగా, గోపుర నిర్మాణానికి వాడిన కృష్ణశిలల బరువు 7,630 టన్నులు, స్వామివారి గర్భాలయంపై గల దివ్య విమానం ఎత్తు 41.10 అడుగుల ఎత్తు, దీనికి వాడిన కృష్ణశిలల బరువు 25,000 టన్నులు. తూర్పు, ఉత్తరం, దక్షిణ దిశలలోని పంచతల రాజగోపురాల ఎత్తు 57 అడుగులు, ఒక్కో రాజగోపురానికి వాడిన రాతి శిలలు మూడు వేల టన్నులు, కాగా పడమర పంచతల రాజగోపురానికి మాత్రం 3,150 టన్నుల రాయిని వాడారు. స్వామివారు ఊరేగింపు సందర్భంగా కొద్ది సేపు సేద దీరడానికి ఏర్పాటు చేసిన వేంచేపు మండపం ఎత్తు 39 అడుగులు కాగా, బ్రహ్మోత్సవ మండపం ఎత్తు 33 అడుగులు. కొండపైన స్వామివారి విష్ణు పుష్కరిణిని 28.09 అడుగుల్లో తీర్చిదిద్దారు. గర్భగుడిలోకే వేళ్లే తూర్పు ద్వారం వద్ద, ప్రధానాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన రెండేసి ఏనుగుల విగ్రహాల ఎత్తు 7.2 అడుగులు కాగా, ద్వారపాలకుల విగ్రహాలను 10.3 అడుగుల ఎత్తులో తయారు చేశారు.
యాదాద్రి భువనగిరి సాయంత్రం గర్భగుడిలో సూర్య కిరణాలు
పడమర రాజగోపురం వేంచేపు మండపం మీదుగా గర్భాలయం తలుపులకు సూర్యకిరణాలు తాకుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రత్యేక దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది.
గిరి ఉగ్రనరసింహ రూపం
యాదాద్రి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే నాలుగు దిక్కులనూ స్వామి చూస్తారు. స్వామి ఎటువైపు చూస్తే అటువైపు తూర్పుదిక్కుగా భావించాల్సి ఉంటుంది. పంచనారసింహ క్షేతంలో జ్వాలా నారసింహస్వామి, యోగనారసింహస్వామి, లక్ష్మీనారసింహస్వామి, గండభేరుండ నారసింహస్వామి నాలుగుదిక్కులు చూస్తుండగా, ఐదవ ఉగ్ర నారసింహస్వామి రూపంగా యాదగిరికొండను కొలుస్తారు.
బంగారు తాపడం పూర్తి
గర్భాలయ ప్రధాన ద్వారాలకు అమర్చనున్న ఇత్తడి రేకులకు బంగారు పూత పూర్తి అయింది. ఈ బంగారు తొడుగులను త్వరలోనే అమర్చనున్నారు. వీటితో పాటు కలశాలను కూడా పూర్తి చేశారు. దివ్య విమానానికి బంగారు తాపడం చేయాల్సి ఉంది. పదహారు కిలోల బంగారంతో తొడుగులు పూర్తి అయ్యాయి. ఉప ఆలయాలకు వెండి తలుపుల కోసం వెయ్యి కిలోల వెండిని పెంబర్తి కళాకారులకు అప్పగించారు. వీటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే రాజగోపుర ద్వారాలకు ఇత్తడి తొడుగులు రానున్నాయి.
ప్రపంచంలో మొదటి రాతి దేవాలయం
యాదాద్రి ప్రధానాలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించాం. సీఎం కేసీఆర్ బడ్జెట్‌తో సంబంధం లేకుండా తరతరాలకూ చెక్కు చెదరని భవ్య ఆలయం నిర్మించాలని సూచించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశీస్సులతో సినిమా రంగం నుంచి ఆర్కిటెక్ట్‌గా మారాను. జీయర్ కుటీరంలో శ్రీశ్రీశ్రీ రామానుజ కూటమి మొదటి ప్రాజెక్టుతో ఈ రంగంలోకి వచ్చాను. ఏడాది పాటు ఒడిశాలోని పద్మశ్రీ ఆనంద పాత్రో వద్ద శిష్యరికం చేశాను. వైటీడీఏ యాదాద్రిలో చేపట్టిన నూతన ఆలయ నిర్మాణానికి డిజైన్‌లు తయారు చేయాలని జీయర్ స్వామి ఆదేశించారు. దీంతో ఒక్కరోజులో ప్లాన్ తయారు చేసి డ్రాయింగ్ వేశాను. సీఎం కేసీఆర్‌కు వాటిని చూపించడంతో ఆయన ఒప్పుకుని పని ప్రారంభించాలని కోరారు. వైష్ణవ సంప్రదాయం, ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం చేపట్టాం. తంజావూర్ దేవాలయం చూసి ప్రేరణ పొందాను. వివిధ దేవాలయాల్లో చూసిన శిల్పరీతుల సమ్మేళనమే ఈ దేవాలయంలో కనిపిస్తుంది. ముఖమండపంలో కాకతీయ సంస్కృతి, బాలపాదం, యాలీ స్తంభాలు ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. బాలపాదం కింద ఏనుగు, యాలి కింద సింహం నోట్లో రాతి గుండు ఉంటాయి. స్థపతులు గణపతి, ముత్తయ్య. సుందర్‌రాజన్‌తోపాటు సివిల్ ఆర్కిటెక్ట్‌లు మధుసూదన్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ సహకరించారు. దేశంలోనే అతిపెద్ద రిటైనింగ్ వాల్ ఉన్న దేవాలయం.
ఇలాంటి దేవాలయ నిర్మాణం మరెక్కడైనా పదేళ్లకు పైగానే పడుతుంది. కానీ ఇక్కడ ప్లాన్ ప్రకారం ఐదేళ్లలో పూర్తి చేశాం. పూర్తి కృష్ణశిలలతో ఈ దేవాలయాన్ని లాకింగ్ విధానం ద్వారా నిర్మించాం. అదనపు గట్టిదనం కోసం డంగు సున్నం జిగట మిశ్రమాన్ని వాడాం. దేవాలయాన్ని వేయి సంవత్సరాల వరకు కదిలించలేరు. చెన్నై శిల్పులు గోపురాన్ని, యాలీ స్తంభాలను ఆళ్లగడ్డ శిల్పులు చెక్కారు. ప్రతిరాతిని స్కానింగ్ చేసి పరిశీలించాం. స్తంభాలలో సుమారు 4,400 వైష్ణవ చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు చూస్తున్న దేవాలయ నిర్మాణం ఐదు సంవత్సరాల క్రితం డిజైన్ చేసిందే. పాత ఆలయంలో మాదిరిగా భక్తుల ప్రవేశం తూర్పు నుంచి మెట్లు దిగి వచ్చేలా ఏర్పాటు చేశాం. మెట్లు దిగేటప్పుడు సుదర్శన చక్రం, శంఖు చక్ర నామాలను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వెళ్తారు. క్యూలైన్లు ఇత్తడితో ఏర్పాటు చేశాం. అంతర్గతంగా సీసీ కెమెరాలు, విద్యుదీకరణ, మురికినీటి పారుదల, మంచినీటి వ్యవస్థ, ఏసీలు రూపొందించాం. స్వామి వారికి నివేదించే ప్రసాదం లిఫ్ట్ ద్వారా ఆలయంలోకి తీసుకు వస్తారు. గర్భాలయ ద్వారం బంగారు తాపడంతోను, ఉపాలయాల ద్వారాలు వెండి తాపడంతోను, మిగతా ద్వారాలను ఇత్తడితో ఏర్పాటు చేస్తున్నాం. దివ్యవిమానం బంగారంతో తాపడం చేయిస్తున్నాం. భక్తులకు దర్శనం కల్పించే లోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాం. బ్రహ్మోత్సవ ఏరియా పెంచాం. మండపాన్ని పూర్తిగా రాతితో నిర్మించాం. పుష్కరిణి మార్చాం. పార్కింగ్, ఫస్ట్ ఎయిడ్, ఆధునిక సౌండ్‌సిస్టమ్, ఎస్కలేటర్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం.
∙ఆనంద్‌సాయి, యాదాద్రి ఆర్కిటెక్ట్
ఆళ్వార్ మండపం
శ్రీ మహావిష్ణువు ప్రియభక్తులైన పన్నిద్దరాళ్వార్ల మండపాన్ని నిర్మించారు. పాత దేవాలయంలో ఆండాళ్ అమ్మవారి ఆలయం పక్కన చిన్న ఉపాలయంలో కూర్చుని ఉన్న ఆళ్వార్‌లను నూతన ఆలయంలోని స్తంభాలపై నిలువెత్తు విగ్రహాలుగా చెక్కారు. చినజీయర్ స్వామి సూచనలతో నిలబడి ఉన్న ఆళ్వార్‌ల మూర్తులను రూపొందించారు. ఏ వైష్ణవ ఆలయంలోనూ లేని విధంగా ఆళ్వార్‌ల మూర్తులు స్తంభాలపై నిలబడి ఉండడం యాదాద్రి ఆలయం ప్రత్యేకత. స్వయంభువుల దర్శనానికి వచ్చి వెళ్లే భక్తులకు ప్రధానాలయంలో దర్శనమిచ్చే ఆళ్వార్లను రాతి శిల్పాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
కృష్ణ శిలలతో ఆళ్వార్ విగ్రహాలు
ఆళ్వార్‌ల విగ్రహాలను తీర్చిదిద్దిన స్తంభాలను కాకతీయ కళావైభవం ఉట్టిపడేలా కృష్ణశిలలతో తయారు చేశారు. ప్రతి ఆళ్వార్ విగ్రహాన్ని 16.11 అడుగుల ఎత్తులో రూపొందించారు. కాకతీయ స్తంభాలను 12.03 అడుగుల ఎత్తులో నిలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాల్లో లభించే కృష్ణశిలల ద్వారా ప్రత్యేకంగా ఆళ్వార్ విగ్రహాలు తయారు చేశారు. నిపుణులైన శిల్పులను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా రప్పించారు.
పంచనారసింహ క్షేత్ర స్థల పురాణం
మాతా నృసింహశ్చ పితానృసింహః
భ్రాతా నృసింహశ్చ, సఖా నృసింహః
విద్యనృసింహో ద్రవిణో నృసింహః
స్వామీ నృసింహః సకలం నృసింహః
యాదాద్రి పుణ్యక్షేత్రం స్థల పురాణం ఎంతో మహిమాన్వితం. హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి శ్రీమహా విష్ణువు స్తంభోద్భవుడుగా అవతరించి ఉగ్రనారసింహుడుగా పలు చోట్ల వెలిశాడని ప్రతీతి. అదే క్రమంలో యాదగిరి కొండపై ఐదు అవతారాలలో పంచ నారసింహునిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాడని పురాణాలసారం. ఋష్యశృంగ మహర్షి కుమారుడైన యాదమహర్షి శ్రీ నరసింహమూర్తి ఉగ్రరూపం చూడాలనే కోరికతో ఈ గుహలో తపస్సు చేయగా, క్షేత్ర పాలకుడైన ఆంజనేయుడి సహకారంతో నృసింహుడు ప్రత్యక్షమయ్యాడట. ఇందులో భాగంగా జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్ర నారసింహ, శ్రీలక్ష్మీనారసింహ అవతారాలలో దర్శనమిచ్చాడని చెబుతారు. అలాగే లోక కల్యాణార్థం ఇక్కడే గుహలో వెలసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ముక్తిని ప్రసాదించాలని కోరిన యాదమహర్షి వేడుకోలుకు మెచ్చి, ఈ పంచ రూపాలలో ఇక్కడి గుహలో వెలిశాడని పురాణాలు చెబుతాయి. ఐదు అవతారాలలో జ్వాలా నారసింహుడు, యోగానంద, శ్రీలక్ష్మీ నరసింహుడు కొండ గుహలో వెలసిన మూర్తులు కాగా, గండభేరుండ నరసింహ స్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి ఆలయానికి తూర్పువైపున వెలిశాడు. ఉగ్ర నారసింహస్వామి రూపం మాత్రం యాదగిరి కొండ చుట్టూ ఆవరించి ఉందని భక్తుల అచంచల విశ్వాసం.
క్షేత్ర మహాత్మ్యం
పరమ భక్తాగ్రేసరుడైన యాదమహర్షి తపస్సుకు మెచ్చి ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారసింహుడు మొదట ఉగ్ర రూపంలో వెలిశాడు. అలాగే జ్వాలా, గండభేరుండ, యోగానంద రూపాలతో ఇక్కడ వెలియడంతో పంచనారసింహ క్షేత్రంగా విరాజిల్లుతోంది. జ్వాలానరసింహ స్వామి రెండు శిలా ఫలకాల మధ్య దీర్ఘమైన శ్రీచూర్ణ రేఖలా భక్తులకు దర్శనమిస్తున్నారు. గ్రహ బాధలు, శారీరక, మానసిక ఈతి బాధలు గలవారు మండల దీక్ష (నలభై రోజులు) ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. దీక్షతో మండల ప్రదక్షిణలు చేసి కొలిచిన వారి బాధలను స్వామి వారు తొలగిస్తారని భక్తుల నమ్మకం.
పూర్వజన్మ సుకృతం
దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవడం నా పూర్వజన్మ సుకృతం. గడచిన ముప్పయి ఐదేళ్లుగా చేసిన సేవ, ఈ ఐదేళ్ల దేవాలయ పునర్నిర్మాణ సేవతో సమానం. తెలంగాణ ప్రభుత్వం, వైటీడీఏ ఈ కార్యక్రమాన్ని నాకు అప్పగించడంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. ప్రస్తుతం చేపట్టిన నవీన నిర్మాణంతో యాదాద్రి ప్రపంచస్థాయి దేవాలయంగా చరిత్రలో నిలిచిపోతుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీస్సులతో ఆలయ నిర్మాణానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్‌చైర్మన్ కిషన్‌రావు, ఆర్ట్‌డైరెక్టర్ ఆనంద్‌సాయి, స్థపతి సలహాదారు సుందరరాజన్, దేవస్థానం ఈవో గీతారెడ్డి సహకారం మహోన్నతమైనది. నిర్మాణంలో పాల్గొన్న టీటీడీ శిల్పకళా విద్యార్థులు, శిల్పి కాంట్రాక్టరు అందరూ శ్రమించారు. భక్తులకు ఎలాంటి దేవాలయం కావాలో అలాంటి దేవాలయాన్ని నిర్మించగలిగామనే సంతృప్తితో ఉన్నారు.