Type Here to Get Search Results !

సంధులు


సంధి
తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :పూర్వస్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : . ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

2. ఎవరక్కడ - ఎవరు + అక్కడ ( ఉకార సంధి )

ఇకపోతే ఇక్కడ అనేది పరపదం.ఇది ఇ అనే హ్రస్వక్షరంతో మొదలయింది.ఇదే పరస్వరం.

ఇట్లా ఈ పూర్వస్వరం పరస్వరం రెండూ కలిసేచోట సంధి ఏర్పడి పూర్వస్వరం పోయింది.పరస్వరం ఒక్కటే మిగిలింది.

అతడిక్కడ

అతడు+ఇక్కడ (పూర్వపదం+పరపదం)

అతడ్+ఉ+ఇక్కడ (పూర్వస్వరం ఉ)

అతడ్+ఇక్కడ (పూర్వస్వరం లోపించింది)

అతడ్+ఇక్కడ (పరస్వరం మిగిలింది)

అతడి+క్కడ (పరస్వరం, పూర్వస్వరం స్థానంలో చేరింది)

అతడిక్కడ (పదాలు రెండూ పరస్వరంతో ఒకే పదంగా మారాయి)

ఇదే సంధి ప్రాథమిక సూత్రం.

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును.

ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చింది.

రాముడు + అతడు = రాముడతడు అయినది.

సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

పూర్వ పర వర్ణాలు రెండు పూర్తిగా కలిసిపోవడాన్ని సంధి అంటారు.

మరికొన్ని ఉదాహరణలు:

1.రామ+అయ్య=రామయ్య, 2.మేన+అత్త=మేనత్త.

వర్ణాలబట్టి సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.

భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1. తెలుగు సంధులు , 2.సంస్కృత సంధులు.

తెలుగు సంధులు అచ్చు సంధులు :


అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు.దెేవాలయము

ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.



యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా: వెల+ఆలు=వెలయాలు.



ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు .



ఉకార సంధి: ఉత్తునకు సంధి నిత్యం

ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.



ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.

ఉదా: ఏమి+ఏమి=ఏమేమి./ చివర + చివర= చిట్టచివర. కడ + కడ = కట్టకడ


హల్లు సంధులు :
గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వలు బహుళముగానగు.

ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె (ఈ సంధి ప్రవృత్తి, అప్రవృత్తి, వైకల్పికం, అన్యవిధము అను నాలుగు ఉదాహరణములు కలిగి ఉండును)

ఉదా:నాల్కలుసాచు-నాల్కలు+చాచు



సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు

ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు



పుంప్వాదేశ సంధి: కర్మధారయము నందు మువర్ణకంబునకు పుం-పు లగు

ఉదా: సరసము+మాట=సరసపుమాట

ముత్యము+చిప్ప=ముత్యపుచిప్ప



ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.



నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఉదా: సొగసు+తనము=సొగసుందనము



పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.

ఉదా: భయము+పడె=భయపడె



త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.

త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు పరంబుగనగు.

ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్ఛికంబబబైన దీర్ఘంనకు హ్రస్వంబగు

ఉదా: అక్కడ = ఆ+కడ; ఇక్కడ 'ఆ' అనునది .త్రికము, 'క' అనునది అసంయుక్త హల్లు. కనుక ద్విరుక్తంబు వచ్చి

ఆ+క్కడ ఐనది. ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు 'ఆ' దీర్ఘం కాస్త హ్రస్వంబై 'అ' అవుతుంది = అక్కడ



ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.

ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.



బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.

ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.



ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.

ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.



సంస్కృత సంధులు


+ సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.

*సవర్ణదీర్ఘ సంధి: (అ/ఇ/ఉ/ఋ)కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: దేవ+ఆలయము=దేవాలయము భాను+ఉదయము=భానూదయము (భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది.)

*గుణ సంధి: అకారమునకు (ఇ/ఉ/ఋ) పరంబగునపుడు క్రమముగా (ఏ/ఓ/ఆర్)గా ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము దేవ+ఇంద్రుడు=దేవేంద్రుడు గుణ+ఉన్నతుడు=గుణోన్నతుడు

*యణాదేశ సంధి:(ఇ/ఉ/ఋ)కు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా (య/వ/ర)గా ఆదేశముగా వచ్చును.

ఉదా: అతి+అంతము=అత్యంతము

*వృద్ధి సంధి: అకారమునకు (ఏ/ఐ)కు పరమగునపుడు ఐ కారమును, (ఓ/ఔ)కు పరమగునపుడు ఔ కారమును వచ్చును.

ఉదా: ఏక+ఏక=ఏకైక అష్ట+ఐశ్వర్యములు=అష్టైశ్వర్యములు

*అనునాసిక సంధి:(క/చ/ట/త/ప)కు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.

ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము

*జస్త్వ సంధి: వర్గ ప్రథమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.

ఉదా: వాక్+ఈశ=వాగీశ.

*శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.

ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.

*ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.

ఉదా: తత్+టీక=తట్టీక.

*ఛత్వ సంధి: (క/చ/ట/త/ప)కు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.

==

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.



Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom