Type Here to Get Search Results !

గురువారానికి వుండే విశిష్టత ఏమిటి?

గురువారానికి వుండే విశిష్టత ఏమిటి?

సద్గురు సాయినాథుల వారికి పూర్వము గురువారానికి అధిష్టాన దైవము ఎవరు ?

ప్రత్యేకముగా సాయినాథులవారు గురువారమును ఎంచుకోవటంలో అంతరార్థము ఏమిటి ?

వార అధిష్టాన దేవతల గురించి శ్రీ మన్మహాదేవుల వారు ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.

ఆదివారమునకు శ్రీ మన్మహాదేవులవారు అధిష్టానము. ఈ రోజున ప్రణవార్చన చాలా విశేషము. అంటే ఓంకార సంపుటీకరణతో చేసే అర్చన, అభిషేక, ఆరాధనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సోమవారమునకు శివుని మాయ, మంగళవారమునకు స్కంద, బుధవారమునకు విష్ణు, గురువారమునకు బ్రహ్మ మరియు విఘ్నేశ్వర, శుక్రవారమునకు ఇంద్ర, శనివారమునకు యమధర్మరాజు అధిష్టాన దేవతలు. నవగ్రహములు ఆవిర్భవించిన తర్వాత ఆయా గ్రహములకు ఆధిపత్యము ఇవ్వటము జరిగింది.

సద్గురువుల ఆవిర్భావము అయ్యాక గురువారము శ్రీ సాయినాథ, అదే విధంగా వెంకటేశ్వర ఆవిర్భావం అయ్యాక శనివారము శ్రీ వెంకటేశ్వర అర్చన, ఆరాధనలు చేస్తున్నాము. ఏ నూతన కార్యం ప్రారంభించటానికి అయినా, గురువారము చాలా మంచిది. ఆ రోజు ప్రారంభం చేసిన కార్యం దిగ్విజయాన్ని చేకూరుస్తుంది. ఆ వారఫలము చేత కేవలము సాయినాథుల వారి అనుగ్రహమే కాకుండా, శ్రీ సరస్వతి సమేత బ్రహ్మదేవ, శ్రీ సిద్ది బుద్ది సమేత గణనాథుల వారి అనుగ్రహము కూడా కలుగుతుంది.

అన్ని వారాలలో సాయినాథులవారికి గురువారము ప్రత్యేకము. అంటే, కలియుగంలో ఎవరైతే సద్గురువులను ఆశ్రయించి, వారి అనుజ్ఞ తీసుకొని నూతన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటారో, వారికందరికీ బ్రహ్మదేవులవారి అనుగ్రహంతో మంచి బుద్ది, బ్రహ్మశక్తి అయిన సరస్వతి అనుగ్రహంతో మంచి ప్రవర్తన, గణనాథులవారి అనుగ్రహంతో మంచి వ్యక్తులతో స్నేహము అనే ఫలితములు కలుగుతాయి. తద్వారా ప్రారంభించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

శ్రీ సద్గురు సాయినాథులవారు గురువారాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవటానికి అనేక విషయాలు కారణములుగా వుంటాయి. వాటిలో పైన చెప్పినది కూడా ఒక కారణము. సద్గురువుల అనుగ్రహము వలన కలిపురుషుని ప్రభావము అధికంగా వుండే ఈ కలియుగంలో కూడా మన్యుష్యులందరికీ మంచి బుద్ది, మంచి ప్రవర్తన, మంచి వ్యక్తులతో స్నేహము అనే మూడు ముఖ్యమైన మంచి గుణములు చేకూరు గాక ! అదే విధంగా ఈ లోకంలో వుండే గురువులందరూ, సద్గురువుల లాగా భక్తులందరికీ శుభ ఫలితములు చేకూర్చెదరు గాక ! 




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom