తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము - ఎందుకు?
తామర పూవు భారత దేశ జాతీయ పుష్పముగా గుర్తింపు పొందినది. ఈ గుర్తింపు సరైనటువంటిదే. కొద్ది కాలము క్రితము వరకు కూడా భారత దేశపు చెరువులు, కొలనులు ఎన్నో రంగు రంగుల తామర పుష్పములతో నిండి ఉండేవి.
తామర పూవుని ప్రత్యెకమైనదిగా పరిగణించుట ఎందుకు?
తామర పూవు సత్యము పవిత్రత మరియు సుందరత్వానికి ప్రతీక. భగవంతుని స్వభావము కూడా సత్యం శివం సుందరమూ. కనుక అతని వివిధ భాగాలు పద్మముతో పోల్చబడతాయి. మన వేదాలు, ఇతిహాసాలు తామర పూవు అందాలని స్తుతించుతాయి. చిత్రకళ శాస్త్రములు కూడా తామర పూవుని వివిధ అలంకారయుత చిత్రాలుగా చిత్రీకరిస్తుంటాయి. చాలా మంది తామర పూవు లేదా దానికి సంబంధించిన పేర్లను కలిగి ఉంటారు. సంపదకు అధి దేవత ఐన లక్ష్మీ దేవి ఒక తామర పూవు పైన ఆసీనమై మరొక తామర పూవుని తన హస్తముతో పట్టుకొని ఉంటుంది.
తామర పూవు ఉదయించే సూర్యునితో పాటు విచ్చుకొని రాత్రికి ముడుచుకొని పోతుంది. అదే విధంగా మన బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికాసము, వృద్ధి చెందుతాయి. తామర పూవు బురద గుంటల్లో కూడా పెరుగుతుంది. దాని పరిసరాలు ఏ విధముగా ఉన్నప్పటికీ తాను మాత్రము కళంకము లేకుండా అందంగా ఉంటుంది. మనము కూడా బాహ్య పరిస్థితులు ఏ రకముగా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యము చెదరకుండా ఉండాలని, ఉండగలగటానికి పాటుపడాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నీళ్ళలోనే ఉన్నప్పటికీ తామర ఆకుకి తడి అంటుకోదు. జ్ఞాని దుఃఖాలతోను మార్పులతోనూ కూడుకొన్న ప్రపంచములో ఉన్నప్పటికీ వాటికి చలించకుండా ఆత్మానందములోనె లీనమై ఉంటాదనడానికి ప్రతీకగా ఈ విషయము నిలుస్తుంది. భగవద్గీత లోని ఒక శ్లోకము ద్వారా ఈ విషయము తెలియజేయ బడింది.
బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే నసపాపేన పద్మ పాత్ర మివాంభసా
భగవంతుడికి అర్పించి ఫలాపేక్ష వదిలి, ఎవరు కర్మలు చేస్తారో, తామరాకుకి నీరు లాగ వారికి పాపము అంటుకోదు.
దీనివలన జనానికి ఏదైతే సహజ లక్షణమో అది సాధకులందరికీ ఆధ్యాత్మ అన్వేషకులకి భక్తులకి ఆచరించ వలసిన క్రమ శిక్షణ అవుతుందని మనము తెలుసుకొన్నాము.
యోగ శాస్త్ర ప్రకారము మన దేహాలు శక్తి కేంద్రాలయిన కొన్ని చక్రాలను కలిగి ఉన్నాయి. ప్రతి చక్రము నియమిత దళముల పద్మమును కల్గి ఉంటుంది. ఉదాహరణకు శిరోభాగమున గల సహస్ర చక్రము, యోగి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు వికసిస్తుంది. దీనిని వెయ్యి దళములు గల పద్మముతో సూచిస్తారు. అంతే కాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనము సిఫారసు చేయబడింది.
విష్ణు భగవానుని నాభి నుంచీ ఆవిర్భవించిన తామర పూవు నుండి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికై ఉద్భవించాడు. ఆ విధముగా తామరపూవు సృష్టి కర్తకీ మరియు పరమాత్మకు గల సంబంధానికి చిహ్నంగా నిలుస్తున్నది. ఇది బ్రహ్మదేవుని నివాస స్థానమైన బ్రహ్మలోకానికి కూడా చిహ్నము.
శుభ సూచకమైన స్వస్తిక్ గుర్తు కూడా తామర పూవు నుంచే వెలువడినట్లు చెప్పబడుతుంది.
తామర భారత జాతీయ పుష్పముగా ఎందుకు ఎన్నుకోబడినదో, భారతీయులకి ఎందుకది అంత ప్రత్యేకమైనదో మనము పై విషయాల ద్వారా చక్కగా తెలుసుకున్నాము.