మూజువాణి ఓటు అంటే ఏమిటి?
పేరే చెబుతున్నట్లుగా ఒక బిల్లు లేదా తీర్మానం పైన తమ అభిప్రాయాన్ని ‘అవును’ లేదా ‘కాదు’ అని మూకుమ్మడిగా అరిచి చెప్పేదే మూజువాణి ఓటు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా, అప్రజాస్వామికంగా కనిపించినా ప్రజాస్వామ్యం పేరుతో చెలామణిలో ఉన్న అన్ని దేశాల్లోనూ అమలులో ఉంది.
ఒక బిల్లు పైన గానీ తీర్మానం పైన గానీ చట్ట సభల్లో ఓటింగు కోరే పద్ధతులు ప్రధానంగా మూడు రకాలు. మూడింటిలో అత్యంత తేలికయినది మూజువాణి ఓటు.
అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో శబ్దం తీవ్రతను బట్టి అవునా కాదా అని స్పీకర్ నిర్ణయించుకుంటారని చెబుతారు. కానీ ఇండియాలో ఇది స్పష్టంగా నిర్వచించినట్లు లేదు. పెద్దగా వివాదాస్పదం కానీ బిల్లులు లేదా తీర్మానాలు, సాధారణంగా ఎక్కువమంది అనుకూలంగా ఉన్నారని భావించే బిల్లులు లేదా తీర్మానాలు మూజువాణి ఓటుకు పెడతారు. ఓటు ఎటువైపు మొగ్గిందీ నిర్ణయించుకునే విచక్షణాధికారం స్పీకర్ దే.
ఈ రెండు పద్ధతుల్లో కాకుండా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిలో కూడా ఓటింగు నిర్వహిస్తారు. సభ్యుల సీట్ల దగ్గర వివిధ (Yes, No, Abstain) స్విచ్ లు ఉంటాయి. స్పీకర్ ఆదేశించిన సమయంలో కొద్ది సేపు తమ తమ నిర్ణయానికి అనుగుణంగా స్విచ్ లను నొక్కి పెడతారు. అవన్నీ ఒక బోర్డుపైన ప్రత్యక్షం అవుతాయి. ప్రతి సభ్యుడు ఎటువైపు ఓటు వేసింది ఆ బోర్డుపైన కనిపిస్తుంది. ఆ బోర్డును ఫోటో తీసి మూడు రకాల ఓట్లు లెక్కిస్తారు. ఆ విధంగా ఫలితాన్ని నిర్ణయిస్తారు. ఇది సుదీర్ఘమైన పద్ధతి.
మూజువాణి ఓటు కంటే డివిజన్ ఓటింగ్ కాస్త కష్టం. ఈ రెండింటి కంటే ఎలక్ట్రానిక్ లేదా మెకానికల్ ఓటింగ్ మరింత కష్టం. సమయం పడుతుంది. ఈ విధంగా సమయం తీసుకోకుండా ఉండడానికీ, సాధారణంగా ఏకాభిప్రాయం లేదా ఎక్కువమంది ఏకీభవిస్తున్నారు అనుకున్న బిల్లులపై స్పీకర్ మూజువాణి ఓటు పాటిస్తారు.
సభలో గందరగోళం నెలకొన్న పరిస్ధితుల్లో కూడా స్పీకర్ మూజువాణి ఓటును ఆశ్రయించవచ్చు. ఒక బిల్లును ఆమోదించడమో, తిరస్కరించడమో చేయాల్సిన తప్పనిసరి పరిస్ధితి ఉండవచ్చు. కానీ కొందరు సభ్యుల నుండి తగిన సహకారం ఉండకపోవచ్చు. ఈ సందర్భాల్లో కూడా స్పీకర్ మూజువాణి ఓటును ఆశ్రయించవచ్చు.
పాలకులకు మరో అవసరం కూడా వస్తుంది. అత్యంత వివాదాస్పద బిల్లుల విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులు తాము ఎటువైపు ఓటు వేసిందీ జనానికి తెలియకూడదని భావించినప్పుడు కూడా మూజువాణి ఓటుకు మొగ్గు చూపుతారు. తద్వారా ప్రజల నుండి ఛీత్కారాలు, తిరస్కారాలు ఎదురు కాకూడదని సభ్యులు కోరుకుంటారు. అంటే ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలనే మోసగించడం అన్నమాట.
ఇవేవీ కాకుండా జనాన్ని తప్పుదారి పట్టించేందుకు కూడా మూజువాణి ఓటును ఆశ్రయిస్తారు. ఉద్దేశ్యపూర్వకంగా తమ సభ్యుల చేతనే పాలక పక్షాలు గొడవ చేయిస్తారు. లేదా ప్రతిపక్షంలోని ఒకటి రెండు పార్టీలు పాలకపక్షంతో కుమ్మక్కయ్యి గలభా సృష్టిస్తారు. ఆ గలభాను సాకుగా చూపుతూ మూజువాణి ఓటుతో బిల్లును గట్టెక్కించుకుంటారు.
ప్రజలకు అనుకూలమైన బిల్లులను చర్చించకుండా ఆమోదం పొందకుండా చేయడానికి కూడా గలభా సృష్టిస్తారు. ఈ గలాభా సాకు చూపి వివిధ బిల్లులను ప్రవేశపెట్టకుండా వాయిదా వేస్తూ గడుపుతారు. ఈ వాయిదాలను, గలాభాలను ఆయా ప్రచారాల్లో అస్త్రాలుగా వాడుకోవడం మనకు తెలిసిన విషయమే. ఉదాహరణకి మహిళా రిజర్వేషన్ బిల్లు. గందరగోళం మధ్యనే అనేక ప్రజా వ్యతిరేక బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకునే పాలకులు మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రం ఇప్పటికీ ఆమోదించలేదు.
కాబట్టి మూజువాణి ఓటు అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి. దాదాపు ఏకాభిప్రాయం ఉన్న బిల్లుల ఆమోదానికి అది ఉపయోగపడుతుంది. అత్యంత వివాదాస్పదం అయిన బిల్లులకూ ఉపయోగపడుతుంది. ఈ రెండు అంశాలకు రిఫరెన్స్ ప్రజలే. బిల్లు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం. కానీ ఆమోదించాలి. అప్పుడు మూజువాణి ఓటు ఉపయోగపడుతుంది. బిల్లు ప్రజలకు అత్యంత అవసరం; కానీ పాలకులకి అది ఇష్టం లేదు. అప్పుడూ మూజువాణి ఓటు ఉపయోగపడుతుంది.
భారత పార్లమెంటు, అసెంబ్లీలు అనేకసార్లు అనేక బిల్లులను మూజువాణి ఓటు పద్ధతిలో ఆమోదించి చట్టాలు చేశారు. తెలంగాణ కంటే ముఖ్యమైన అనేక బిల్లులను, లక్షల కోట్ల రూపాయల ఖర్చులు పెట్టే బిల్లులను ఈ పద్ధతిలో ఆమోదించారు. పాలకవర్గాలకు ప్రజలను మోసం చేయడానికి తయారు చేసుకున్న తేలికపాటి ఓటింగ్ పద్ధతి మూజువాణి ఓటింగు.