జ్ఞాపకశక్తి అంటే ఏమిటి?
నిత్యజీవితంలో జరిగే సంఘటనలను మనం ఎలా గుర్తుంచుకుంటామనేదానికి రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది, మనం ఏదన్నా నేర్చుకున్నా లేదా అనుభవించినా మన దేహంలోని నాడులు స్పందిస్తాయి. ఈ నాడీ స్పందనలు మెదడులోని న్యూరోనుల మీద తమ ప్రభావం చూపుతాయి.
ఈ విధంగా మెదడు సంఘటనలను పదిలపరుస్తుంది. రెండో సిద్ధాంతం ప్రకారం నేర్చుకునేటప్పుడు మెదడు మీద శాశ్వతమైన మార్పులు వస్తాయి. అవి జ్ఞాపకశక్తి రూపంలో అలాగే నిలిచిపోతాయి.
మెదడులో ఉన్న న్యూక్లిక్ ఆమ్లం ఆర్. ఎన్. ఎ సంఘటనలను పదిలపరుస్తుందంటారు కొందరు జంతు శాస్త్రజ్ఞులు. మూడేళ్ళ నుండి నలభై ఏళ్ళ వయస్సు వరకూ న్యూరోన్లలో ఉన్న ఆర్. ఎన్. ఎ పరిమాణం పెరుగుతూ ఉంటుందని తెలుసుకున్నారు.
ఈ కాలంలో మనిషి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. న్యూరోన్లలో ఉన్న ఆర్. ఎన్. ఎ పరిమాణం 40 నుండి 55-60 ఏళ్ళ వయస్సు వరకూ స్థిరంగా ఉంటుంది. అంచేత మనిషి జ్ఞాపకశక్తిలో పెద్దగా మార్పులు ఉండవు. ఆ తర్వాత ఆర్. ఎన్. ఎ బలహానపడి, జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది.
ఏ విషయాన్ని అయినా గుర్తుంచుకోవడానికి, మళ్ళీ మళ్ళీ చదివితే లేదా చేస్తేనే ఆ విషయం మనస్సులో స్థిరపడుతుంది. దీనినే జ్ఞాపకం ఉంచుకోవడం అని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు.