ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?
మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.
ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.