అనగనగా ఒక రాజు... ఆ రాజుకి 7 కొడుకులు...?
కథ:
అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు.
చేప చేప ఎందుకు ఎండలేదు? గడ్డిమేటు అడ్డమొచ్చింది.
గడ్డిమేటా... ఎందుకు అడ్డమొచ్చావ్...? ఆవు మెయ్యలేదు.
ఆవా ఎందుకు మెయ్యలేదు...? గొల్లవాడు మేపలేదు.
గొల్లవాడా... ఎందుకు మేపలేదు...? అమ్మ అన్నం పెట్టలేదు.
అమ్మా...ఎందుకు అన్నం పెట్టలేదు...? పిల్లవాడు ఏడిచాడు.
పిల్లవాడా... ఎందుకు ఏడిచావు...? చీమ కుట్టింది.
చీమా ఎందుకు కుట్టావ్... నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా... అన్నది.
రాజుగారు అంటే మనిషి. ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త ధాతువులు. వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట. 7 చేపలు అనగా మనల్ని పీడించే సప్త వ్యసనాలు (కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (ధనమును దుబారాగా ఖర్చుచేయుట).
ఎండగట్టటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది. ఎండపెట్టాము అంటే వ్యసనాల్ని జయించామని అర్ధం. సాధన చేసి మనిషి తనలోని వ్యసనాలను జయించవచ్చు.
ఒక చేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలిన వాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది. కామాన్ని జయించడము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు. ఇక్కడ కామము అంటే కోరిక... అది ఎలాంటి కోరిక అయినా కావచ్చును. మోక్షాన్ని పొందాలన్నది చాలా ఉత్కృష్టమైనది. అయిననూ అది కూడా కొరికే కనుక కామాన్ని జయించుట కుదరని పని. కోరిక ఎండితే కానీ మోక్షము రాదు. కోరిక లేక బంధము తొలగుటయే కదా మోక్షము.
చేప ఎండక పోవటానికి కారణము గడ్డిమేటు. గడ్డిమేటు అజ్ఞానానికి ప్రతీక. మన అజ్ఞానము ఎంత అంటే.. గడ్డి మేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పట్టి పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు. సమస్త జ్ఞానము కలిగినా అహంకారము (నేనున్నానన్న భావన) తొలగుట కష్టము. కనుక అజ్ఞానమును గడ్డిమేటుతో పోల్చారు.
గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము. వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. ఆవులచే మేయబడినా, అగ్నిచే దగ్దము చేయబడినా గడ్డిమేటు తొలగింపబడుతుంది. "జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం" అని భగవద్గీత చెప్పుచున్నది. జ్ఞానమనే అగ్ని చేత మాత్రమే అజ్ఞానము తొలగింపబడుతుంది.
ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు. సద్గురువుచే జ్ఞానము బోధింపబడలేదు కనుగ అజ్ఞానము తొలగలేదు అని అర్థము. సద్గురువు ద్వారానే జ్ఞానము అందింపబడాలి. అప్పుడు మాత్రమే అజ్ఞానము తొలగింపబడి జ్ఞానము కలుగుతుంది.
"కృష్ణం వందే జగద్గురుం" అనగా జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.
గొల్లవాడు ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ ఇచ్చిన అన్నం తిని, ఆవులను మేపటం అన్నది గోవులు మేపే వాళ్ళ నిత్యకృత్యం. అంటే జగన్మాతచే సద్గురువు పంపబడలేదు అని అర్థము. జగన్మాత ఆజ్ఞ లేనిదే సద్గురువును దర్శించుటకాని, ఉపదేశము పొందుటకాని జరుగదు అని తెలుసుకొనవలెను.
ఇంకా జ్ఞానమును పొందే సమయము రాలేదు అని అర్థము. దైవానుగ్రహము కలుగలేదు అని అర్థము.
అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు. పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు, అనుగ్రహము కోసము పరితపించటము వేరు.
జగత్తంతటికి తల్లి కనుక జ్ఞానము కావాలి అని పరితపించే వారికన్నా, దైవమే కావాలి అని పరితపించేవారిని మొదట అనుగ్రహిస్తుంది జగన్మాత.
అంటే అమ్మ ఆజ్ఞ అవలేదు అని అర్థము. పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది. చీమ అంటే సంసారము. సంసారము అంటే కుటుంబము ఒక్కటే కాదు. మనల్ని అంటుకొని ఉన్న సమస్త భావములు కూడా సంసారమే. సంసార, ఈతి బాధలచే దుఃఖము చెంది దైవము కొరకు పరితపించటమే చీమ కుట్టి ఏడవటము.
చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే. కానీ సంసారము లేకుండా ఎలా అన్న అజ్ఞానంలో కావాలని దాని ఎడల అనురక్తి కలగటమే బంగారు పుట్ట.
చివరకు అనురక్తి తొలగి సంసార బాధల నుండి తనను రక్షింపమని దైవము కొరకు జీవుడు పరితపించును.
కథ సారాంశము:
సప్తధాతువులతో కూడిన మనిషి సాధన చేసి సప్త వ్యసనములలో 6 వ్యసనములు జయించిననూ 7వది అయిన కామమును జయించుట కష్టము. అజ్ఞానము తొలగనిదే కామము జయింపబడదు. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును. జ్ఞానమును ఒక్క సద్గురువు మాత్రమే అందిపగలడు. అట్టి సద్గురువు జీవితమున దైవానుగ్రహమున మాత్రమే లభించగలడు. సంసారమున చిక్కి బాధపడుతున్న జీవుడు దైవము కొరకు పరితపించి, ఆర్తితో తపన చెందుతున్నప్పుడు మాత్రమే దైవానుగ్రహమునకు పాత్రుడు కాగలడు. దైవముచేత పంపబడినవాడే సద్గురువు. అతడు జ్ఞానమును అందించి అజ్ఞానమును తొలగించి జీవుని ఉద్దరించి దైవమును చేర్చును.
కనుక సద్గురువు యొక్క ఆవశ్యకత జీవితమున ఎంతైనా ఉన్నది.