Type Here to Get Search Results !

ప్రయాగ & గయ - Prayaga & Gaya

గయ:
ప్రయాగ, కాశీ, గయ అనే ఈ మూడు క్షేత్రాలను కలిపి ‘త్రిస్థలాలు’ అంటారు. వీటిని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, వీటిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని ప్రతీతి.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖండం..

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌ 


అనగా.. ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవి.


గయ మహత్యం
ఆధ్యాత్మిక వైభవాన్నే కాకుండా ప్రాచీన చరిత్రనూ స్వంతం చెసుకున్న గయ క్షేత్రప్రస్తావన
మహాభారత, రామాయణాలతో పాటు వాయు, గరుడ, వరాహ, కూర్మ, పద్మ, నారదీయ పురాణాల్లో కూడా ఉంది. గయాసురుడి పేరు మీద ఈ క్షేత్రానికి ‘గయ’ అనే పేరు ఏర్పడినట్లు పురాణాలు,
స్థలపురాణం వెల్లడిస్తున్నాయి. ‘గయ’ త్రిస్థలాల్లో ఒకటిగా కీర్తించబడింది.

అత్యంత పవిత్రక్షేత్రంగా కీర్తించబడిన గయక్షేత్రం పితృదేవతారాధనకు, పిండ ప్రదానాలకు ప్రసిద్ధిచెందింది. గయలో భరద్వాజ మహర్షిముందుగా పిండ ప్రదానం చేసినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. వనవాసకాలంలో శ్రీరాముడు ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లు చెప్పబడుతోంది.


స్థల పురాణం:
పూర్వం ఈ ప్రాంత్రంలో ‘గయుడు’ అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికే గయాసురుడు అని
వ్యవహారం. రాక్షసుడే అయినా గయాసురుడు గొప్ప దైవభక్తుడు. అటువంటి గయాసురుడు ఒకసారి విష్ణువును గురించి ఘోరతపస్సు చేసి తనను తాకినవారికి మోక్షం లభించేటట్లు వరం పొందాడు. వరాన్ని పొందిన గయాసురుడు తన శరీరాన్ని కొన్ని యోజనాలు పెంచి జీవించసాగాడు. దీనితో ప్రతివారు గయుడి శరీరాన్ని తాకి మోక్షం పొందసాగారు. ఫలితంగా స్వర్గానికి, నరకానికి వచ్చేవారే లేకుండా పోయారు. ఇంద్రుడికి, యమధర్మరాజుకు పనీపాటా లేకుండా పోయింది. దీనితో వీరిద్దరూ భయపడి విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. సృష్టికి విరుద్ధంగా జరుగుతున్న ఈ విషయాన్ని గురించి త్రిమూర్తులు కలిసి పరిపరి విధాలుగా అలోచించి, చివరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. దాని ప్రకారం బ్రహ్మదేవుడు గయాసురుడు వద్దకు వెళ్లాడు. "గయాసురా! నేను లోకకళ్యాణం కోసం ఒక గొప్ప యాగం చేయదలిచాను. ఆ యాగం చేసేందుకు అనువైన ప్రదేశం ఎక్కడా భూమండలంలో కనిపించలేదు. నా యాగానికి
అనువైన స్థలం, యజ్ఞ జ్వాలల వేడిని తట్టుకునే ప్రదేశం నీ శరీరమే. కనుక నీవు అంగీకరిస్తే నీ శరీరాన్ని యజ్ఞకుండంగా మార్చుకుని యజ్ఞం చేస్తాను" అని బ్రహ్మ దేవుడు గయాసురుని అడిగాడు.

అందుకు గయాసురుడు అంగీకరించి తన శరీరాన్ని పెంచి ఉత్తర దిశగా తలను వుంచి పడుకున్నాడు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేసేందుకు సిద్దమయ్యాడు. సకల దేవతలు, మహర్షులు అందరూ ఈ ప్రాంతానికి చేరుకోగా బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడం ప్రారంభించాడు. యజ్ఞం వేడికి గయాసురుడి తల కదలడం ప్రారంభించింది. దీనితో బ్రహ్మదేవుడు “మరీచి శాపంవల్ల దేవవ్రత శిలగా మారింది కదా! ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై ఉంచండి" అని ఆదేశించాడు. 

దేవతలు ఆ శిలను తెచ్చి గయాసురుడి తలపై ఉంచినా తల కదులూతునే ఉంది. ఫలితంగా
బ్రహ్మదేవుడు విష్ణువును పిలిచి, ఆ శిలపై నిలుచుని ఉండమని కోరాడు. విష్ణువు ఆ శిలపై నిలుచున్నాడు. ఫలితంగా గయాసురుడి శరీరం కదలడం ఆగిపోయింది. బ్రహ్మదేవుడు చేస్తున్న యాగం వేడిని, తనను భరిస్తున్న గయాసురుడిని చూసి విష్ణువు కు జాలి కలిగి, ‘గయాసురా! ఏదైనా వరాన్ని కోరుకో!’ అని అడిగాడు. అందుకు, “దేవా! ఈ పవిత్రమైన యజ్ఞం వల్లనూ, నీ పాద ధూళి సోకడం వల్లనూ నా జన్మ ధన్యమైపోయింది. నా తలపై వుంచిన శిల బరువుకు ఎలా
అయినా నేను భూమిలో కూరుకుపోతాను. ప్రజలు ఎవరూ ఇకమీదట నన్ను చూడలేరు. అయినా
ఫర్వాలేదు. నా తలపై వుంచిన శిలమీద మీ పాదాలను శాశ్వతంగా ఉంచే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ పాదాలను దర్శించుకున్న వారికీ, ఈ క్షేత్రంలోనూ, మరెక్కడైనా
నన్ను తలుచుకుంటూ పిండ ప్రదానాలు, పిత్రుదేవతల పూజలుచేస్తే వారి వంశం అభివృద్ధి చెందేటట్లుగా వరాన్ని ప్రసాదించండి" అని గయాసురుడు వేడుకున్నాడు. గయాసురుడు కోరుకున్న వరాన్ని విష్ణువు ప్రసాదించాడు. ఈ విధంగా గయ పితృదేవతల ఆరాధనకు ప్రత్యేకతను పొందినట్లు తెలుస్తోంది.

గయ మూడు నదుల సంగమ తీరంలో వుంది. ఈ క్షేత్రంలో ఫల్గుణీ, మధుర, శ్వేత అనే మూడు నదులు సంగమిస్తూ ఉండడం వలన ఈ క్షేతం ప్రయాగతో సమానమైన క్షేత్రంగా చెప్పబడుతూ వుంది. ఈ నదుల్లో ఫల్గుణీనది ముఖ్యమైంది. ప్రస్తుతం ఎండిపోయిన ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్తారు. పిండ ప్రదానాలు చేసే సమయంలో ఈ నదిలోనే చెలమలను త్రవ్వించి అందులో నీటిని తెప్పిస్తారు. దీనిని బట్టి ఇప్పటికీ ఫల్గుణీనది అంతర్వాహినిగా
ప్రవహిస్తూ ఉందని చెప్పవచ్చు. 

విష్ణుపద మందిరం:
ఫల్గుణీ నదీతీరంలోనే విష్ణుపద మందిరం కనిపిస్తుంది. ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలను కలిగిన ఈ ఆలయంలో కొలువుదీరిన దేవుడు శ్రీమహావిష్ణువు. ఈయనకే  గదాధరుడు అని పేరు. స్వామి చతుర్భుజాలను కలిగి శంఖు, చక్ర, గద, వరదహస్తాలతో దర్శనమిస్తాడు. గదను ఆయుధంగా ధరించి గదాధర స్వామిగా పూజ అందుకుంటున్నాడు. 

ఈ ఆలయ ముఖమండపంలో మనకు పెద్ద పాదాలు దర్శనమిస్తాయి. సుమారు ఒకటిన్నర
అడుగుల పొడవు, అర్థ అడగు వెడల్పు ఉన్న ఈ పాదాలు గయాసురుడి తలమీద వుంచిన శిలపై నిలబడిన విష్ణుమూర్తి పాదాలుగా చెబుతారు. 

ఈ ఆలయంలో ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. దీనిని “అక్షయవటం" అని పిలుస్తారు. పూర్వం సీతాదేవి ఈ చెట్టుకు చిరకాలం అక్షయవటంగా వర్థిల్లమని వరాన్ని ప్రసాదించిందట. 

మంగళగౌరి ఆలయం:
ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో ఉంది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది.

గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడి, శక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి. గయలో అమ్మవారి తొడ భాగం పడింది.

గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా ఉంటుంది.  ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయి.  గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా ఉంటుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. 

బుద్ధగయ:
గయ నుండి బుద్ధగయ సుమారు 12 కి.మీ. ఉంటుంది. సిధ్ధార్ధుడు జ్ఞానోదయం పొందిన రావిచెట్టు ఇక్కడే ఉంది. ఈ బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన తరువాతనే సిద్ధార్థుడు బుద్ధుడుగా మారాడు. ఈ రావిచెట్టుకింద ధ్యానం చేయడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ మ్యూజియంలో బుద్ధుని జ్ఞానోదయ ఉదంతంపై నిర్మించిన డాక్యుమెంట్‌ తప్పక చూడాల్సిందే. 170 అడుగుల ఎత్తున నిర్మించిన మందిరంలోని బుద్ధభగవానుడు జీవకళ ఉట్టిపడేలా దర్శనమిస్తాడు. బౌద్ధులకు అతి పవిత్ర క్షేత్రం ఈ బుద్ధ గయ. ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలు బహు సుందరంగా ఉంటాయి.


అలహాబాద్ (ప్రయాగ) : 
మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి ప్రయాగకు బయలుదేరాము. సుమారు 9 గంటలకు ప్రయాగ చేరుకున్నాం. వారణాసికి దాదాపు 135 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రయాగ పుణ్యక్షేత్రం ఉంది.

గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమే ప్రయాగ. గంగానది శివుడిని తాకి పునీతమైతే, యమునా నది కృష్ణయ్య లీలలను నింపుకుంది. చల్లని సరస్వతీ నది అంతర్వాహినిగా ఈ సంగమ ప్రదేశంలో కలుస్తుంది. ఈ జీవనదుల్లో ప్రవహించే నీటితో దాదాపు ఉత్తర భారతం అంతా సస్యశ్యామలంగా విరాజిల్లుతుంది. 

ప్రయాగ మహత్యం: బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలోనే అనేక యజ్ఞాలు చేశాడట. అందుకే ఈ ప్రదేశానికి ప్రయాగ అనే పేరు వచ్చిందట.

ప్రయాగ అనగా 
ప్ర = ప్రకృష్ట (అనేక)
యాగ = యజ్ఞాలు జరిగిన క్షేత్రం

సముద్రగుప్తుడు కూడా ప్రయాగలో 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా యజ్ఞాలు నిర్వహించాడట.

ప్రయాగలో అసంఖ్యాకంగా తీర్థాలు నిత్య నివాసం ఉంటాయి. ఇక మాఘమాసంలో అయితే లెక్కకే అందనన్ని తీర్థాలు ప్రయాగ తీర్ధంలో కొలువై ఉంటాయట. స్వయంగా బ్రహ్మదేవుడు సైతం నిరంతరం ఈ తీర్థ స్మరణ చేస్తూ ఉంటాడట. ఇక్కడ చనిపోయిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందట. జన్మ జన్మాంతరాలలో సంచయమైన పాపం, ప్రయాగ తీర్థ స్నానం వల్ల పోతుందట.

స్కాంద పురాణాంతర్గత కాశీ ఖండం..

ప్రయాగం వపనం కుర్యాత్ గయాయాం పిండపాతనమ్‌
దానం దధ్యాత్కురుక్షేత్రే వారాణస్యాం తను త్యజేత్‌ 

అనగా.. ప్రయాగలో శిరోముండనం, కురుక్షేత్రంలో దానం, గయలో పిండప్రదానం, కాశీలో మరణం విశిష్టమైనవి. అందుకే స్నానానికి ముందు ఇక్కడ (ప్రయాగలో) శిరోముండనం చేయించుకుంటారు.

సంగమ స్థలం విస్తీర్ణం సుమారుగా 5 యోజనాలు ఉంటుంది. సంగమ ప్రాంతం గంగా యమునల ప్రవాహం కారణంగా మూడు భాగాలుగా ఉంటుంది. గంగకు ఉత్తరాన ఉన్న స్థలాన్ని గంగాపాఠ్ లేదా ఆహ్వనీయాగ్నికుండం అని, ఈ రెండు నదుల మధ్యన ఉన్న ప్రదేశాన్ని (గంగకు దక్షిణాన, యమునకు ఉత్తరాన ఉన్న భాగం దోఆబ (ద్వాబా) లేదా గార్హాపత్యాగ్ని కుండం అని, యమునకు దక్షిణాన ఉన్న స్థలాన్ని యమునాపాఠ్ లేదా దక్షిణాగ్ని కుండం అని అంటారు. ఈ మూడు ప్రాంతాలలో శుచిగా, నియమాలతో ఒక్కొక్కరోజు చొప్పున గడిపితే, ఆయా క్షేత్రాలలో అగ్ని (త్రేతాగ్నులు) ఉపాసన చేసిన ఫలితం (యజ్ఞ ఫలం) దక్కుతుందని అగ్ని పురాణంలో చెప్పబడింది.

ఇక్కడ ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో మాఘ మేళా, 12 సంవత్సరాలకి ఒకసారి కుంభ మేళా, 144 సంవత్సరాలకి ఒకసారి మహా కుంభ మేళా జరుగుతాయి. ఈ మేళాలు నిర్వహించడానికి వెనుక ఒక పురాణగాధ ఉంది. దేవాసురులు సాగర మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ సమయంలో అమృతం కోసం దేవతలకీ, అసురులకీ మధ్య జరిగిన ఘర్షణలో అమృతభాండం నుండి అమృతం తొణికి కొన్ని చుక్కలు నాసిక్, ఉజ్జయిని, ఋషీకేశ్ లలో పడ్డాయట. కానీ, ప్రయాగలోని ఈ త్రివేణీ సంగమంలో అయితే అమృత భాండమే పడిందట. అందుకనే ఈ సంగమ ప్రదేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

వేణీ దానం:
త్రివేణీ సంగమంలో ఆచరించాల్సిన ప్రత్యేక పూజ ఈ వేణీ దానం. సుమంగళులైన స్త్రీలు తమ భర్తకు అర్చన చేసి, తను తెలిసీ తెలియక చేసిన తప్పులన్నిటికి క్షమాపణకోరి, అతని చేత కొంత జుట్టు కత్తిరింపజేసి, ఆ జుట్టును త్రివేణీ సంగమంలో వదులుతారు. సాధారణంగా కత్తిరించిన జుట్టు నీటిపై తేలుతుంది. కానీ ఇక్కడ జుట్టు మునుగుతుంది. ప్రయాగలో వేణీ దానం చేసిన స్త్రీలు నిత్య పసుపు కుంకుమలతో ఉండి, సుమంగళులుగానే మరణిస్తారట. ఈ వేణీ దానం తంతు అంతా భార్యను భర్త ఒడిలో కూర్చోపెట్టి చేయిస్తారు. 

కాశీ యాత్ర లో భాగంగా మనం ఇంటికి తీసుకెళ్లే గంగాజలం త్రివేణీ సంగమం నుండే తీసుకెళ్లాలి. కాబట్టి గంగాజలం నింపుకోడానికి ఖాళీ డబ్బాలు (బాటిల్స్) తీసుకెళ్లడం మర్చిపోకండి. 


ప్రయాగలో దర్శించవలసిన ఆలయాలు, ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటి వివరాలు... 

పాతాళపుర మందిర్ :
త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట ఒకటి ఉంది. కోట లోపలికి ప్రవేశం నిషిద్ధం. కానీ ఈ కోటలో ఉన్న పాతాళపుర మందిర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళవచ్చు. ఫోటోలు మాత్రం తీయనివ్వరు. కోట అంతా ఆర్మీ వాళ్ళ నిరంతర గస్తీతో కట్టు దిట్టంగా ఉంటుంది.

పాతాళపుర మందిర్ సుమారుగా 84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా ఉంటుంది. దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం ఉంది. గయలో కురుక్షేత్రంలో చనిపోయిన తమ బంధుజనానికి పాండవులు శ్రార్ధ కర్మలు నిర్వహించారట. ఇంకా ఈ ఆలయంలో వేద వ్యాసుడు, వాల్మీకి, సనక సనందులు, ఇంకా అనేక ఋషులు, దేవతల విగ్రహాలు ఉన్నాయి.

అక్షయవట్ : ఇక్కడే అతి పురాతనం అయిన వట వృక్షం ఒకటి ఉంది. మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే ఉండేదట. అక్బర్ కోట కట్టించినప్పుడు స్ధలం ఎత్తు పెంచడంతో ప్రస్తుతం ఇవి భూగర్భంలోకి వెళ్లాయి. ఈ వటవృక్షానికి ఉన్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలట. ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి, చెట్టు మొదళ్ళను కౌగలించుకోమంటారు.

యముడు, దండపాణి, భైరవుడు, ప్రయాగ రాజేశ్వరి, గంగామాత, మృత్యుంజయుడు, సూర్యదేవుడు, సరస్వతి దేవి, జాంబవంతుడు, ఇంకా అనేక దేవీదేవతలు కొలువై ఉన్నారు. 

శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి, ఈ వట వృక్షం కిందనే కూర్చున్నాడట. ఇక్కడే తన తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడట. భరతుడు తన అన్నను వెతుక్కుంటూ వచ్చినప్పుడు, ఇక్కడ ఆగాడని తెలుసుకుని, ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లుగా ఒక విగ్రహం ఉంటుంది. 

ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వం ఈ చెట్టు మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకునేవారట.

ఈ కోటలోనే మన దేశంలో ప్రసిద్ధి చెందిన అశోక స్తంభం ఉంది. దీన్ని కౌశాంభి నుండి తెచ్చి, ఇక్కడ స్ధాపించారట.


బడే హనుమాన్ మందిర్ :
పాతాళపుర మందిర్ కి సమీపంలోనే ఉంటుంది ఈ ఆలయం. రామ రావణ యుధ్ధానంతరం ఆంజనేయస్వామి కొంచెం సేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారట. అందుకనే ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకున్న భంగిమలో ఉంటుంది. ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని చాలా ప్రయత్నాలు చేశారట. విగ్రహాన్ని తవ్వేకొద్దీ భూమిలో గుంటలాగా ఏర్పడి, విగ్రహం ఇంకా స్ధిరంగా అయిపోయిందట. ఇప్పటికీ విగ్రహం ఆ గుంటలోనే ఉంటుంది. వర్షాకాలంలో గంగానది పొంగితే, గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందట. అప్పుడు ఆంజనేయస్వామి గంగలో స్నానం చేస్తున్నట్టుగా అనిపిస్తుందట. 

స్వామి ఆవిర్భావానికి మరో కధ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం కనౌజ్ ప్రాంతంలో సంతానం లేని గొప్ప ధనవంతుడు వింధ్యాచలం వెళ్లి పెద్ద హనుమాన్ విగ్రహాన్ని తయారు చేయించి, స్వామికి స్నానం చేయించాలని భావించాడట. ఈ విగ్రహానికి వివిధ పవిత్ర క్షేత్రాలలో స్నానం చేయిస్తూ, త్రివేణీ సంగమంలో కూడా స్నానం చేయించి, ఆ రాత్రి అక్కడే నిద్రించాడట. రాత్రి కలలో విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలనే భావన రావడంతో, ఉదయం లేవగానే కనౌజ్ కు బయలు దేరి వెళ్ళిపోయాడట. ఇంటికి చేరగానే భార్య గర్భం దాల్చిందని తెలిసి, బడే హనుమాన్ స్వామి అనుగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకోగా, కొంత కాలానికి కొడుకు పుట్టాడట.


బడే హనుమాన్ ఇక్కడే నీటిలో మునిగి ఇసుకలో కూరుకు పోయాడట. ఒక రోజు వ్యాఘ్ర చర్మాంబరధారి అయిన బాలగిరి స్వామీజీ త్రివేణీ సంగమంలో స్నానం చేసి, తన త్రిశూలాన్ని నేలమీద గుచ్చగా, అక్కడ బడే హనుమాన్ విగ్రహం కనిపించిందట. నెమ్మదిగా ఇసుక, మట్టి తీయించి విగ్రహం బయటపడేట్లు చేసి, స్వామి అనుగ్రహం కోసం అక్కడే తపస్సు చేశారట. దీనితో బడే హనుమాన్ కీర్తి జనంలో బాగా వ్యాపించిందని చెప్తారు.

శంకర విమాన మండపం :
జగద్గురువులయిన ఆదిశంకరాచార్యుల వారు, కుమార స్వామి స్వరూపం అయిన కుమరిల భట్టు అనే విద్వాంసుడిని తన అద్వైత తత్వ జ్ఞానంతో ఓడించిన ప్రదేశంలో ఆయన విజయానికి గుర్తుగా ఒక విజయ స్తంభాన్ని స్థాపించాలని, కంచి పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు సంకల్పించి నిర్మించిన కట్టడమే ఈ శంకర విమాన మండపం లేదా శంకర మఠం. 

ఈ మండప నిర్మాణం ద్రవిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో కామాక్షీ దేవి, ఆదిశంకరాచార్యులు, కుమారిల భట్టు విగ్రహాలతో పాటు అనేక దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ యోగశాస్త్ర బద్దంగా 1008 లింగాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఇంకా 108 విష్ణాలయాలు, అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఈ ఆలయంలో కొలువై ఉన్నాయి. బడే హనుమాన్ మందిర్ కి సమీపంలోనే ఉంటుంది ఈ 4 అంతస్థుల విమాన మండపం.

మాధవేశ్వరీ శక్తి పీఠం :
అష్ఠాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఈ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం తప్పక దర్శించాల్సిన ఆలయం. మాధవేశ్వరీ దేవిని అలోపీ దేవిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు పడినట్టు దేవీభాగవతం చెబుతుంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులుగా ఒక నలుచదరం పీఠం ఉండి, దానిపైన ఒక  వస్త్రంతో హుండీ వేలాడతీసి ఉంటుంది. హుండీ క్రిందుగా ఒక ఉయ్యాల కట్టి ఉంటుంది. భక్తులు తమ కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచే మొక్కుతారు.

దీనికి ప్రక్కగా అమ్మవారి దివ్యమంగళ రూపంతో ఉండే పాలరాతి విగ్రహంతో పాటూ, శివుడు సతీదేవిని భుజం పైన వేసుకుని ఉగ్రతాండవం చేస్తున్నట్టు ఉండే ప్రతిమ చెక్కబడి ఉంది. ఈ ఆలయంలో శివుడు కూడా మహా లింగ రూపుడై కొలువుతీరాడు. ఈ ఆలయ ఆవరణలోనే శతాబ్దాల చరిత్ర ఉన్న ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం క్రిందనే ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు కొలువు తీరి ఉన్నారు. వీరిని అర్చిస్తే సమస్త గ్రహ దోషాలూ నశిస్తాయని నమ్మకం. ఇక్కడే ఉన్న మరో ఉపాలయం రామ్ జానకీ మందిరం. ఈ మందిరంలోని సీతారాముల పాలరాతి విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి.

భరద్వాజ ఆశ్రమం :
రామాయణం ప్రకారం, వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ భరద్వాజ మహాముని ఆశ్రమానికే వచ్చాడు. ఇక్కడే మూడు రాత్రులు ఉండి, భరద్వాజ మహర్షి సూచనతో సుమారు 131 కి.మీ.ల దూరంలో ఉన్న చిత్రకూట్ కి వెళ్ళారు. ఈ భరద్వాజుని ఆశ్రమంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. సాక్షాత్తూ భరద్వాజుడు అర్చించిన శివలింగం ఉంది. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు శ్రీరాముడు కూడా ఈ లింగాన్ని అర్చించాడట. ఈ ఆశ్రమ సందర్శన ఎంతో మానసిక సంతృప్తిని ఇస్తుంది. పూర్వం గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలోనే ప్రవహిస్తూ ఉండేదట. అక్బరు కాలంలో నిర్మిచిన బక్షి, బేని ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారిందట. 

ఆనంద్ భవన్ :
ఈ భవనం లోనే మన దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బాల్యం గడిచింది. ఇందిరా గాంధీ జన్మించింది కూడా ఇక్కడే. మన జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ఈ భవనం ఒక సాక్షిభూతం. గాంధీగారు అలహాబాద్ వస్తే ఈ భవనంలోనే ఉండేవారట. ఇందిరాగాంధీ వివాహం కూడా ఈ భవనంలోనే జరిగిందట. ప్రస్తుతం ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ ఉంది. కొంత భాగం ఆల్ ఇండియా కాంగ్రెస్ వినియోగిస్తుంది. కొంత భాగంలో మ్యూజియం నిర్వహిస్తున్నారు. ఉదయం 9-30 నుండి సాయంత్రం 5-30 వరకు మ్యూజియం తెరిచి ఉంటుంది. ప్రతీ సోమవారం మరియు జాతీయ సెలవు దినాలలో మ్యూజియం ఉండదు. 

నాగ వాసుకీ దేవాలయం :
ఈ నాగ వాసుకీ దేవాలయం అతి పురాతనమైన ఆలయం. వాసుకిని కశ్యప మహాముని పుత్రుడుగా చెప్తారు. మానసాదేవిని వాసుకికి సోదరిగా చెప్తారు. నాగులకి రాజు ఈ వాసుకి. ఈ వాసుకీ నాగ రాజే క్షీర సాగర మధనంలో మంధర పర్వతానికి తాడులాగా చుట్టబడ్డాడు. వాసుకీ నాగరాజుని అర్చిస్తే సమస్త నాగదోషాలు తొలగిపోతాయట.

మన్ కామేశ్వర్ మహా దేవ్ :
ప్రయాగలోని ప్రాచీన ఆలయాలలో మన్ కామేశ్వర్ ఆలయం ఒకటి. సాక్షాత్తూ శ్రీరాముడు తన చేతులతో ప్రతిష్టించి పుజించిన లింగం ఈ మన్ కామేశ్వరుడు. ఇక్కడ స్వామిని మనం కోరికలు కొరవలసిన అవసరం లేదట. మన మనస్సులోని ఆంతర్యం గ్రహించి నెరవేర్చగలడు కాబట్టే మన్ కామేశ్వరుడయ్యాడు. ఇక్కడ శివునికిచ్చే హారతి చాలా బాగుంటుంది. 

వేణీ మాధవుడు :
పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి ఈ వేణీ మాధవుడు. ప్రయాగలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఈ వేణీ మాధవుణ్ణి దర్శించకుంటే ఆ స్నానఫలం పొందరని తన రామచరితమానసంలో తులసీదాసు చెప్పాడు. ఈ ఆలయం ప్రయాగలోని దారాగంజ్ ప్రాంతంలో పవిత్ర యమునా నది తీరంలో సరస్వతీ ఘాట్ కు దగ్గరగా ఉంది. అంటే త్రివేణీ సంగమంలో యమునా నది సంగమించక ముందు ఈ ఆలయమే యమునా నది ఒడ్డున ఉన్న చివరి ఆలయం. త్రివేణీ  సంగమ స్థానం నుండి ఈ ఆలయం 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ ఆలయంలో మనకు లక్ష్మీదేవి, నారాయణుని విగ్రహాలు కనిపిస్తాయి కాబట్టి ఈ ఆలయాన్ని లక్ష్మీనారాయణ దేవాలయం అని కూడా అంటారు. పద్మ పురాణం ప్రకారం ప్రయాగ క్షేత్రానికి ఈ వేణీమాధవుడే అధిదేవత. ఈ ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. ఇవి త్రేతాయుగం నాటివని చెప్తారు. 

సీతా మడి :
అలహబాద్ - వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత, రహదారి నుండి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సీతామడి వస్తుంది. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశమే సీతామడి. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజసిద్ధంగా ఉండి, చూపరులను కట్టి పడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది. ఇక్కడ సీతాదేవి ఆలయం, ఆంజనేయ ఆలయం ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయం సొరంగమార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది.

వింధ్యాచలేశ్వరి :
సీతామడి నుండి రెండుగంటలు ప్రయాణం చేస్తే, వింధ్యాచలం అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ వింధ్యాచలేశ్వరి అమ్మవారు కొలువు తీరి ఉంది. పురాణం ప్రకారం, శుంభ నిశుంభులనే  రాక్షసులను సంహరించిన తర్వాత కాళీమాత ఇక్కడ వింధ్యాచలేశ్వరిగా వెలిసిందట. ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని తాకొచ్చు.

ముగింపు:
ప్రయాగని తీర్థరాజం అంటారు. అనగా అన్ని తీర్ధాలకు రాజు అని అర్ధం. ప్రయాగ పౌరాణికంగానే కాదు.. ప్రకృతి అందాలలోనూ విశిష్ఠమైనదే. అందుకే ప్రయాగ వైభవానికి ముగ్ధుడైన అక్బర్ తను కొత్తగా స్ధాపించిన మతం దీన్-ఇ-ఇలాహీ పేరు కలసి వచ్చేటట్లుగా అలహాబాద్ అని మార్చాడు. అప్పటి నుండి ప్రయాగ అలహాబాద్ గా కూడా పిలవబడుతుంది.

మేము తెల్లవారు ఝామున 4 గంటలకు కాశీ నుండి ప్రయాగకు బయలుదేరితే, తిరిగి రాత్రి 12 గంటల ప్రాంతంలో కాశీ చేరుకున్నాం.

Credits:-

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom