గొబ్బిగౌరి వ్రతం
భోగి రోజు కన్నెపిల్లలు చేసుకునే గొబ్బిగౌరి వ్రతం కొన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉంది. ఇది కూడా భోగిరోజు చేసే వ్రతమే. ఇందుకు ఇంట్లో మండపాన్ని నిర్మిస్తారు. దాన్ని పళ్లు, కూరగాయలు, చెరుకుగడలు, పూలతో అలంకరిస్తారు. దాని మధ్యలో కొత్తబియ్యం పోసి బంకమట్టితో చేసిన గౌరీదేవి ప్రతిమను ఉంచుతారు. పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా పెడతారు. కొందరు దాన్లో కూరగాయలు కలిపి వండుతారు. తర్వాత గౌరమ్మను నిష్ఠగా పూజిస్తారు. మంగళారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవం చేస్తారు. మర్నాడు, అంటే సంక్రాంతి రోజు ఉదయమే సుప్రభాతంతో గౌరీదేవిని తిరిగి మేల్కొలుపుతారు.
ఈ వ్రతం మూడు, నాలుగు, ఆరు రోజులు జరుపుకునేవాళ్లూ ఉన్నారు. ప్రతిరోజూ సాయంకాలం వేళ ముత్తయిదువులను పిలిచి తాంబూలం అందించి వాళ్ల ఆశీర్వచనాలు అందుకుంటారు. ముగింపురోజు సాయంత్రం పూజచేసి ఉద్యాపన చెబుతారు. అలంకరించిన కూరగాయలను కూరగా చేసి తింటారు. అదే గొబ్బికూర. తర్వాత గౌరీదేవి ప్రతిమను, పూజకు వాడిన పువ్వులను నదిలోకానీ, చెరువులోకానీ నిమజ్జనం చేస్తారు.