కార్తీకమాసము
కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.
హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రథమైనది.
స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.
కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో, ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్యప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. ‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలు ప్రశస్తమైనవి.
----------------------------------------
కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుంది కనుక ఈమాసానికి కార్తీక మాసం అని పేరు.
కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు కూడా ఉంది.
కౌముది అంటే వెన్నెల.
ఈ మాసంలో చంద్రుడి నుంచి వచ్చే వెన్నల అమృతబిందువులను వర్షిద్తుంది.
సంవత్సరంలో 12 నెలల్లో దేవతలను ఎక్కువగా పూజించడానికి కార్తీక మాసం శేయస్కరం.
ఈ మాసంలో శివకేశవులిద్దరిని కలిపి ఆరాధించాలి.
కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయం చదవడం మంచిది.
ఆచరించవలసినవి :
ఈ నెలలో కార్తీక స్నానం,
కార్తీక దీపం,ఉపవాసం చాలా ముఖ్యమైనవి.
రోజూ తెల్లవారు జామునే దగ్గరలో ఉన్న నది, చెరువు, తటాకం లోనో లేదా బావి దగ్గరో తలస్నానం చేయాలి.
ఈ స్నానం సూర్యోదయానికి కంటె ముందే ముగియాలి.
ఇంకా చెప్పాలంటే నక్షత్రాలు వెళ్ళకముందే స్నానం చేయాలి.
ఇలా చేసే స్నానం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన|ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ||
అనే మంత్రం చెప్పి తలస్నానం చేయాలి.
ఈ కార్తీక స్నానం కాయిక, వాచిక, శారీరిక దోషాలను తొలగిస్తుంది.
స్నానం తరువాత శివుడిని బిల్వదళాల (మారేడు ఆకులు) తోనూ, విష్ణువును తులసిదళాలతోనూ పూజించాలి.
అలాగే ఈ నెలలో తుమ్మి పూలతో శివుణ్ని, అవిసె పూలతో విష్ణువును పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం (సూర్యోదయానికి ముందు), సాయంకాలం ఇంటి గడపల దగ్గర, తులసి చెట్టు దగ్గర "ఆవునెయ్యితో" దీపారాధన తప్పనిసరిగా చేయాలి.
ఈ మాసంలో చేసే దీపారాధనకు చాలా ప్రాముఖ్యం ఉంది.
కార్తీక మాసం మొత్తం ఏకభుక్తం (ఒక పూట మాత్రమే భోజనం చేయడం) ఉండడం, పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం చేత పుణ్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం రక్షింపబడుతుంది.
పగలంతా ఉపవాసం చేయలేనివారు అల్పాహారం తీసుకోవచ్చు
(బ్రహ్మచారులు (పెళ్ళి కానివారు), 80 సంవత్సరములు పైబడినవారు, ఆనారోగ్యంతో బాధపడేవారు, కాయకష్టం చేసేవారు (శారీరకశ్రమతో పని చేసేవారు, బలహీనులు) ఈ ఉపవాసం చేయనవసరంలేదు).
ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి లాంటి పర్వదినాలలో అయినా ఆచరించడం ఉత్తమం.
ఈ మాసం మొత్తం బ్రహ్మచర్యాన్నిపాటించాలి,
వంకాయ, ఉల్లిపాయ, వెలుల్లి మొదలైన వంటలు, మాంసాహారాలు, బిర్యానీలు, బయట అమ్మె వంటకాలు, చిరుతిళ్ళు, మసాలాపదార్ధాలు తినడం నిషిద్ధం. ఉపవాసం పక్కన పెట్టేసినా, అందరూ ఆచరించదగ్గవి ఆహారనియమాలు పాటించడం, ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ముగించడం, రోజు దీపం వెలిగించడం. ఈ రెండు చేసినా, అతిత్వరలో జీవితంలో పెనుమార్పు కనిపిస్తుంది.
- స్వస్తి