అయ్యప్ప మాలలోని అంతరార్థం!
శివకేశవుల భక్తులందరినీ ఈడేర్చవచ్చినవాడే అయ్యప్ప! `అయ్యా`అన్నా`అప్పా` అన్నా ఆదుకునేవాడే ఈ హరిహరసుతుడు. కార్తీకమాసం దగ్గరపడుతోందంటే చాలు శబరిమలను చేరేందుకు 41 రోజుల దీక్షను ధరించాలని ఉవ్విల్లూరుతుంటారు భక్తులు. కేవలం 18 మెట్లను ఎక్కి శబరిగిరీశుని చూసేందుకు పట్టే దీక్ష కాదు ఇది. భౌతిక సుఖాలను కాదనుకుని, ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి, స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం! మాలధారణలో ఉన్న కొన్న నియమాలు, వాటి వెనుక ఉన్న అంతరార్థం…
ప్రాతఃకాల స్నానం: ఎంత ఆలస్యంగా లేచే వీలుంటుందా అని ఆలోచిస్తాము చలికాలంలో! అలాంటిది సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని చన్నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తోంది అయ్యప్పదీక్ష. దీనివల్ల రెండు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని అలవర్చుకోవడం. రెండు- శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్తప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీరు ఒక్కసారిగా మీద పడగానే మనలోని రక్తప్రసరణ మందగిస్తుంది. వెంటనే ఎండ తగలగానే రక్తప్రసరణ వేగాన్ని అందుకుంటుంది. అప్పటివరకూ మందగించిన రక్తప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు పరిహరింపబడతాయి.
క్షవరము లేకపోవడం: దీక్షలో ఉన్నన్నాళ్లూ స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. ఈ నియమం వల్ల ఒకటీ, రెండూ కాదు మూడు లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- శరీరం పట్ల నిర్లిప్తత! శరీరాన్ని గారాబంగా చూసుకుని, దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించినరోజున దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యతను ఇస్తాం. దాన్ని గుర్తుచేసేదే ఈ నియమం! రెండు- చలికాలం సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను తీర్చుకుని, పల్చటి వస్త్రాలను ధరించి, కటిక నేలల మీద నిదురించే స్వాములకు చలి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. మూడు- దీక్ష సమయంలో స్త్రీ సాంగత్యం నిషిద్ధం. ఆ విషయంలో ఎలాంటి ప్రలోభాలకూ తావులేకుండా, భౌతికమైన ఆకర్షణను తగ్గించేందుకు ఈ నియమం దోహదపడుతుంది.
నల్లని వస్త్రధారణ: తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే, నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తుంది. పైగా కాషాయంలాగానే నలుపు కూడా వైరాగ్యానికి ప్రతీక! దీక్ష కొనసాగినన్నాళ్లూ తాము స్వాములుగా ఉంటామనీ, వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామనీ సూచించే ఈ నలుపు రంగు వస్త్రాలను అయ్యప్పలు ధరిస్తారు.
పాదరక్షలు నిషిద్ధము: ఈ రోజుల్లో పాదరక్షలు లేకుండా బయటకు అడుగుపెట్టడం అసాధ్యం. మనిషి స్థాయిని కూడా పాదరక్షలను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు. కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్టజాతకంగా భావిస్తారు. `సుకుమారమైన పాదాలు`, `పాదాలు కందిపోకుండా`… లాంటి వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ శబరిమల పర్వతాన్నే కాదు ఈ జీవితాన్ని కూడా అధిరోహించాలంటే ఒకోసారి కఠినత్వం అవసరపడుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేము. అన్ని కష్టాలనూ తట్టుకుని, అన్ని అడ్డంకులనూ దాటుకునేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగా, సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. గరుకు నేల మీద నడిచే అలవాటుని చేసుకుంటే పాదాలే చెప్పులుగా మారి రాటుతేలిపోతాయి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా శ్రమించే గుణానికి శిక్షణే ఈ నియమం!
మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలు ఉన్నాయి. మితాహారం, మత్తుపదార్థాల నిషిద్ధత, కటికనేల మీద నిదురించడం… అన్నీ కూడా వారి ఆధ్యాత్మిక పురోగతికీ, భౌతిక దృఢత్వానికీ నిర్దేశించినవే! అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు, ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు, మళ్లీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు.