మన సంస్కృతి - సంప్రదాయాలు
ముగ్గులు :
తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు చేకూరుస్తారు.
వేపపువ్వు, చెరుకుముక్కలు, బెల్లం, చింతపండు, అరటి పండు కలిపిన ఉగాది పచ్చడి ఎంత శ్రద్ధతో తయారు చేస్తోందో చిట్టితల్లి ! వ్యక్తి జీవితంలో సుఖదుఃఖాలకు ప్రతీక అయిన తీపి చేదుల వేపపువ్వు పచ్చడి ప్రసాదం తీసుకోకుండా ఉగాదినాడు ఏ పని చేయకూడదు.
బొమ్మల కొలువు :
ఏడాది పొడుగునా అల్మారాలలో దాగిన రంగురంగుల దేవతల బొమ్మలు, జంతువుల బొమ్మలు, దొరబొమ్మలు, దేశభక్తుల బొమ్మలు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి కి, మరి కొన్నిచోట్ల దసరా కి ప్రత్యక్షమై ధూప దీపనైవేద్యాలు అందుకుంటూ కొలువు తీరుతాయి.
ప్రభలు :
మరొక తెలుగు సంప్రదాయం ప్రభలు. ఎంత ఎత్తు ప్రభ అయితే అంత గొప్ప. కోటప్పకొండ తిరణాలకి వందలాది రంగు రంగుల ప్రభలు శోభ చేకూర్చుతాయి.
గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని కోటప్పకొండ ప్రసిద్ధమైన శైవక్షేత్రం. మహాశివరాత్రి కి చాలా పెద్ద ఎత్తున తిరునాళ్లు జరుగుతాయి. లక్షలాది భక్తులు ఆనాడు అక్కడ ఉత్సవాలకు హాజరవుతారు. ముఖ్యంగా చూడవలసింది ప్రభల ప్రదర్శన. వందలాదిగా ప్రభలు ఆ ఉత్సవాలలో పాల్గొంటాయి. అవికాక ఇంకా కోలాటం, వీరంగం, హరికథ లు మొదలైనవి ఉంటాయి. తల నీలాలు మొక్కుబడులకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి. శివరాత్రికి రుద్రాభిషేకం, సహస్రనామార్చనలు జరుగుతాయి. ఇక్కడి శివుడిని కోటీశ్వరుడు అంటారు. ఆ పేరే తెలుగులో కోటప్ప అయింది.
బుర్ర కథ :
ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. అది సంగీతం, నృత్యం, నాటకం. ఈ మూడింటి మేలుకలయిక. బుర్రకథలో నవరసాలూ పలుకుతాయి. ముఖ్యంగా వీర, కరుణరసాలను బాగా ఒప్పించే ప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథల ; ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. బుర్రకథ అనగానే ' నాజర్ ' గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు ఎందరెందరో ఏకలవ్య శిష్యులు. బుర్రకథనే జీవనాధారం చేసుకొని బ్రతుకుతున్నారు. నాజర్ పల్నాటి యుద్ధం. బొబ్బిలియుద్ధం బహుళ ప్రచారం పొందినవి.
బుర్రకథ ప్రాచీనమైన తెలుగు జానపద కళ. అయితే అది నిలుచుని చిందులు వేస్తూనే చెప్పనక్కర లేదు. కూర్చుని కూడా బుర్రకథ చెప్పి శ్రోతలను రంజింపజేయవచ్చు.
తండాల నృత్యం :
లంబాడీలు, సుగాలీలు, బంజారాలు అని వివిధ నామాలతో పిలువబడే ఆదిమ జాతివారు నాగరిక సమాజానికి దగ్గరగా పల్లెలలో, పట్టణాలలో నివసిస్తున్నా తమ కట్టు, బొట్టు, మాట, పాట, ఆట, ఆచార వ్యవహారాలను సంస్కృతిని వందలాది ఏళ్ళుగా నిలుపుకుంటూ వస్తున్నారు. వీరు తండాలుగా జీవిస్తారు. వీరి సామూహిక నృత్యం నేత్రపర్వంగా ఉంటుంది.
యక్ష గానం :
యక్షగాన పరిణామ చరిత్ర అతి విచిత్రమైనది. రచనలో, ప్రదర్శనలో, తరతరాలకు మార్పుచెందుతూ వచ్చినది. మొదట యాత్రా స్థలాలు, కామందులు లోగిళ్ళు తదుపరి పల్లెపట్టుల రచ్చసావిడి, రాచదేవిడీలు యక్షగాన ప్రదర్శనల కథిస్థానములైనవి. వర్తమానమున అప్పటికప్పుడు ఏ వూరి మొగనో, యే కోవెల వాకిటనో, యే సంపన్న గృహస్థు ఇంటి ముందటనో, తాటాతూటముగా నిర్మింపబడిన కమ్మల పందిరి కింద, కళ్ళాపుజల్లిన కటికనేలయే దాని రంగస్థలము.
పగటివేష కళాకారులకు రంగస్థలంతో పనిలేదు. పాత్రోచితము. రసోచితము, ప్రాంతీయోచితమైన వేష భాషలతో, నృత్య గానాలతో పట్టపగలు వేషాలు వేసుకుని హావ భావ నటనలు చిలికిస్తూ, రాగమేళ తాళాలతో, పండిత పామరులను మెప్పించడం పగటివేష కళాకారులకు వెన్నతో పెట్టిన విద్య. వీరు ఊరూరా తిరుగుతూ ప్రదర్శించే ఈ రకాలైన ప్రక్రియలలో యక్షగానం ఒకటి.
తప్పెట గుళ్ళు :
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీ కృష్ణగాథలను గానం చేస్తారు.
డెల్టా జిల్లాలకు కాల్వలే అందం. పొలాలకు జలాల నివ్వడమేకాక సరకుల రవాణాకు కూడా ఎంతో ఉపయోగం.
జంగం దేవరలు :
తలపైన ఫణిచక్రం కలిగిన కిరీటం, నుదుట విభూతి రేఖలు, చంకలో జోలె, ఒక చేతిలో ఇత్తడి గంట, మరో చేతిలో కర్ర జంగం దేవర ఆహార్యం ; ఉంటుంది. సంక్రాంతి రోజుల్లో బుడబుక్కలవాడు అర్థరాత్రి వచ్చి బుడబుక్కని వాయిస్తూ వెళ్ళగానే వేకువ ఝామున శంఖం ఊదుతూ, గంటను మ్రోగిస్తూ - శివుని కీర్తిస్తూ జంగం దేవర ఊరంతా కలియతిరుగుతూ, ప్రతి ఇంటి ముందు ఆగి గృహస్థులను దీవిస్తూ ముందుకు కదులుతాడు.
ఎడ్ల పందాలు :
తెలుగు పల్లెలలో ఎడ్ల బలాబలాలను పరీక్షించే బండ లాగుడు పందాలు సర్వ సామాన్యం. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎన్.టి.రామారావు గారికి కూడా ఈ పందాలు మహా ఇష్టం.
కోడి పందాలు :
ఇప్పుడు జంతు హింసగా వీటిని నిషేధించారుగాని, ఒకప్పుడు సంక్రాంతి కి ఊరూరా కోడి పందాలు తప్పనిసరిగా జరిగేవి. పల్నాటి యుద్ధానికి ఒక కారణం కోడి పందెమే.
పులి వేషం :
సర్కారు జిల్లాలలో దసరా పండుగకు, తెలంగాణాలో పీర్ల పండుగకు పులి వేషం కడతారు డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ, పులి ఇతర జంతువులను ఎలా ఒడుపుగా వేటాడుతుందో చక్కగా ప్రదర్శిస్తారు ఈ కళాకారులు. ఈ వేషం వేయడంలో విజయవాడకు చెందిన శ్రీ గర్రె అప్పారావు, విజయనగరానికి చెందిన శ్రీ పైడి గురువులు సిద్ధహస్తులు.
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో విజయదశమి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున కృష్ణానది లో తెప్పోత్సవం జరుగుతుంది. హంస ఆకారంలో తెప్పను రమణీయంగా అలంకరిస్తారు. దానిలో అమ్మవారిని వుంచి నదిలో ఊరేగిస్తారు. ఒడ్డును చేరిన వేలాది భక్తులకు అది కన్నుల పండుగ.
హరి దాసులు :
ఒకచేత చిడతలు, మరొకచేత తంబురా మీటుతూ, ఇంటింటి ముంగిట ఆగి " ఏ తీరుగ నను దయ చూచెదవో. . . . . . " అంటూ ఏదో కీర్తన పాడుతూ హరిలో రంగహరి అని కదిలే హరిదాసులు ధనుర్మాస రాయబారులు. చక్కని ఎర్ర రంగు పంచె కట్టుకొని, ఛాతీ మీద, భుజాలపై, నుదిటి మీద విష్ణు నమాలను పెట్టుకొని అపర నారౌల వలె అగుపించే హరిదసులు వారి కీర్తనలు సంక్రాంతి సమయంలో పల్లెకు కొత్త శోభను తెస్తాయి.
గోరింటాకు :
కాళ్లకు పారాణి ఎలాగో చేతులకు గోరింటాకు అలాగ. గోరింటాకు శోభముందు నేటి గోళ్ల రంగులు దిగదుడుపే.
డప్పు :
పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం డప్పు నృత్యం. ఈ నృత్యం ముందు మెల్లగా ప్రారంభమై రాను రాను పదవిన్యాసంతో పాటు వాద్యం కూడా ఉధృతమై, ఉత్తేజం కలిగిస్తుంది. ఆంధ్రదేశంలోని అన్ని పల్లె ప్రాంతాలలోను డప్పు ఉనికి మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది.
చెమ్మ చెక్క :
చెమ్మచెక్క - చేరడేసి మొగ్గ. . . . అంటూ ఆడే ఇలాంటి పడుచు పిల్లల్ని చూసే కవి తిలక్ నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని అంటాడు.
గంగిరెద్దులు :
డు డు బసవన్న - గంగిరెద్దుధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఆడించడంలో ఎన్నో వింత పోకడలున్నాయి.
చెడుగుడు :
ఉత్తరాదివారు కబడ్డీ అంటారు. తెలుగు వారు చెడుగుడు అంటారు. ఏ పేరుతో ఆడినా అందరికీ ఆసక్తి కలిగిస్తుంది ఈ ఆట.
మొహరం పండుగ :
మృతవీరులు - హసన్, హుస్సేన్ సంస్మరణార్థం మొహరం మాసంలో పది రోజులు జరిపే పండుగ మొహరం. ఏభై సంవత్సరాల క్రితం నగరంలో మొహరం ఊరేగింపు చూడడం ఒక గొప్ప అనుభవం. నానాటికి ఈ విషాద గర్భిత ఉత్సవం ఆచరించుకునే తీరులో మార్పులు వస్తున్నట్టు గమనించవచ్చు. ఈ పండుగనే పీర్ల పండుగ గా తెలుగులో వ్యవహరిస్తారు. ఈ పండుగ సందర్భంగా సున్నీ తెగవారు ఆకుపచ్చ దుస్తులు, షియా తెగవారు నల్లని వస్త్రాలను ధరిస్తారు. స్త్రీలు సంతాప సూచకంగా ఆభరణాలు ధరించరు. తల వెంట్రుకలు కూడా ముడవరు. చేతి గాజులు తొలగిస్తారు.
హిందువుల పండుగలు :
ఉగాది :
ఉగాది తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకరముగా తొలి పండుగ. ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ద పాడ్యమి రోజు వస్తుంది.
గారెలు అనగానే ప్రతీ తెలుగు వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరు శనగ పప్పు పచ్చడి తో గాని, శనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.గారెలలో మరికొన్ని రకాలు కూడా కలవు. అవి మినప గారెలు, పెసర గారెలు, చెక్క గారెలు, శనగ గారెలు.
సంక్రాంతి :
సంక్రాంతి, లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. "భినత్వంలో ఏకత్వం" అనే వాక్యానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది,. పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.
భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు మూమూలుగానే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరవలసిందే. బుడబుక్కలవారు, పగటివేషధారులు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే - అంటే ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు తప్పవు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు.
భోగి :
ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువు లో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.
మకర సంక్రాంతి:
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సాకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.
సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు...
కనుమ :
మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ పందాలను నిషేధించింది. అంతే కాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర్‌సంక్రాంతి లేదా లోరీ ని మాత్రమే జరుపుకుంటారు.
కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర దేశాన ఆనవాయితీగా వస్తూంది. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం.
శ్రీరామ నవమి :
శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పందుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరవాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా ఛైత్ర శుద్ధ నవమినాడే జరిగినదని ప్రజల విశ్వాసము. ఈ చైత్ర శుద్దనవమి నాడు అంధ్రప్రదేశ్ లో గల భద్రాఛలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
వినాయక చవితి :
హిందువుల పండుగలలో అతి ముఖ్యమైనది వినాయక చవితి. దీన్ని ఔత్తరాహులు గణేశ్ చతుర్థి అంటారు. తలపెట్టిన పనులు విఘ్నరహితంగా నెరవేరాలని కోరుతూ వినాయకుడిని ఆనాడు పూజిస్తారు. అన్ని రకాల పత్రి, పువ్వులు, ఫలాలు, పూజాద్రవ్యాలు, వినాయకునికి ఇష్టమైన కుడుములు ఆనాటి పిండి వంటలలో ముఖ్యభాగం. పూజానంతరం వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిపై చల్లుకుంటే తప్ప పండుగ పూర్తికాదు. పూజ చెయ్యకుండా ఆ రాత్రి చవితి చంద్రుడిని చూడరాదని కట్టడి.
దసరా:
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీఠంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజు న చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జామ్మీ ఆకుల పూజా చేయటం రివాజు
దీపావళి :
భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు. వానిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల,మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు,ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం,నూతన వస్త్రాల రెపరెపలు,పిండివంటల ఘుమఘుమలు,బాణసంచా చప్పుళ్ళు...ఈ దివ్య దీపావళి సోయగాలు!
వేజండ్ల వారి సౌజన్యంతోభిన్నత్వంలో ఏకత్వాన్ని సృజించే ఈ దీపావళి కోటి కాంతుల రవళి- విరిసే చైతన్య దీప్తుల జావళి. కొత్త ఆశలతో , ఆశయాలతో ఈ దీపావళి మానవ జీవితంలో పారమార్థిక వెలుగు రేఖ లను పూయిస్తుందని హైందవజాతి ప్రగాఢ విశ్వాసం.
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.
పూర్వం మన పల్లెటూళ్ళలో ఏ ఉత్సవం జరిగినా, తిరునాళ్ళు జరిగినా బుట్ట బొమ్మలు ప్రత్యక్షమయ్యేవి. ఈ బుట్టబొమ్మలు ధరించిన కళాకారులు వాద్యాలకు అనుగుణంగా లయాన్వితంగా నాట్యం చేస్తారు. క్రమంగా ఈ కళ అంతరించి పోతున్నది.
కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం కంటె అందమైన దృశ్యం ఉండదు.సాధారణంగా తెలుగువారి ప్రవర్తనలో కన్పించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాల్లనీ తెలుగుదనాలంటారు. ఊదాహరణకు: ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నాసరే, తెలుగువారు తినడానికి ఊరగాయలకొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలోకానీ, దేశంలోకానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు, తమ ఊరగాయల్ని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనాసరే, తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
తలపాగా మరియు పైపంచ(ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి.తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .