కావ్య విభాగములు, సంక్షిప్త కథ
రామాయణ మహాకావ్యము ఏడు కాండములు (భాగములు) గా విభజింప బడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి ఆరు కాండలు, మొత్తం 24వేల శ్లోకములు (శతకోటి అక్షరములని కూడా చెబుతారు).ఏడవ కాండము అయిన ఉత్తర కాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కణుపు అని అర్ధము. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండములోను ఉప భాగములు "సర్గ"లు.
బాల కాండము (77 సర్గలు) : కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
అయోధ్య కాండము (119 సర్గలు) : కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము
అరణ్య కాండము (75 సర్గలు) : వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
కిష్కింధ కాండము (67 సర్గలు) : రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
సుందర కాండము (68 సర్గలు) : హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
యుధ్ధ కాండము (131 సర్గలు) : సాగరమునకు వారధి నిర్మించుట, యుద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
ఇక్కడ ఒక్కొక్క కాండము కథ మాత్రము సంక్షిప్తముగా ఇవ్వబడినది. ఆయా కాండములకు సంబంధించిన ప్రత్యేక వ్యాసాలలో మరింత విస్తారంగా చెప్పబడింది.