Type Here to Get Search Results !

రామాయణము ప్రాముఖ్యం - Ramayana is Important

రామాయణము ప్రాముఖ్యం

24,000 శ్లోకాలతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మము ల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.


వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్త్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి వాల్మీకి ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.


కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్

పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:

రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారములో నున్నవి. మచ్చుకు కొన్ని.


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.

దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా

పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్

గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్

రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్

రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు)అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'ర' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యమ్ రామనామ వరాననే

వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కథ


క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం

మహర్షి వాల్మీకి ఆదికవియే గాక వేదాంతి. దార్శనికుడు. తపస్వి. ప్రజలకు మార్గ దర్శకుడు. సంస్కర్త. కార్యాచరణ వేత్త.


ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు.


కఃను అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కః చ వీర్యవాన్


ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ సత్యవాక్యో దృఢ వ్రతః


ఈ కాలం లో, ఈ లోకంలో గుణవంతుడు, యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగల్గిన వాడు, ధర్మవంతుడు, చేసిన మేలు మరువని వాడు, ఎల్లప్పుడు సత్యమునే పలికేవాడు, అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడయిన ఉన్నడా..? ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు.


అవియే కాక అన్ని భూతములయందు దయ కలవాడు, విద్వాంసుడు, సమర్ధుడు, ప్రియదర్శనుడు, కోపాన్ని జయించినవాడు, అసూయలేనివాడు... అలా 16 గుణములు చెప్పి అవన్ని ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మికి మహర్షి అడుగుతాడు.


అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు.


మహర్షీ, మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవము. ఇక మామూలు మనుష్యులు సంగతి చెప్పనేల..!


కానీ అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెపుతాను అని ఈ విధముగా చెప్పనారంభించెను.


ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః


నియతాత్మా మహావీర్యో ధ్యుతిమాన్ ధృతిమాన్ వశీ.


ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అపారమైన శక్తి కలవాడు, సంకల్పశక్తి కలవాడు, ఇంద్రియములను జయించినవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, ఐశ్వర్యవంతుడు, శత్రువుని నిగ్రహించ గల్గిన వాడు, ఈ ప్రపంచాన్ని అంతటిని పొషించగల్గిన వాడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు, హిమవత్ పర్వతమంత ధైర్యం ఉన్నవాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువయా అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభిచెను.


సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మికి మహర్షికి చెప్పెను. అప్పుడు వాల్మికి మహర్షి అమితానందభరుతుడయ్యెను. పటిక బెల్లం తిన్నవాని నోటికి తీపి ఎలా నిలిచి వుంటుందో అలా ఆయన హృదయమంత రామాయణం నిండిపోయెను.


ఆ మరునాడు ఆయన తన శిష్యుడు భరద్వాజునితో తమసా నదీ తీరమున వెళ్ళుచుండగా ఒక వేటగాడు క్రౌంచ పక్షుల జంటలో మగ పక్షిని బాణముతో కొట్టెను. అప్పుడది విలవిలలాడుచు అసువులు వీడెను. ఆ దృశ్యమును జూచి, వాల్మీకి ముని హృదయము ద్రవించెను. మనస్సు ఆర్ద్రమయ్యెను. శోకాకులుడైన ఆయన నోట ఈ మాటలు వెలువడెను.


మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:

యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్

"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"


శోక పరితప్త హృదయముతో ఆయన ఉచ్ఛరించిన ఈ మాటలు ఛందో బద్ధముగా నున్న మొదటి శ్లోకమని, అది రామాయణం వినుటవలన తటస్థించెనని సంస్కృత సాహిత్య చరిత్రలో నమ్మకము. ఆప్పుడు బ్రహ్మ దేవుడు వాల్మీకికి ఆ శ్లోక విశిష్టతను తెలిపి, శ్రీ రామ చరిత్రను కావ్య రూపమున రచింపుమని ప్రేరేపించెను. లోకములయందు పర్వతములు, నదులు ఉన్నంత కాలము ఆ రామాయణ కావ్యము ప్రకాశించునని దీవించెను.


యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే

తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.

రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్

ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్




Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom