భక్తుడే భగవంతుడని చెప్పడానికి ఏ దీక్ష ప్రారంభమయింది ?
దీక్ష చేపట్టగానే నేను అన్న భావన నశిస్తుంది. ఈ దేహానికి ఉన్న పేరు, ఈ దేహం ధరించే దుస్తులు, తినే ఆహారం, శారీరక సౌఖ్యాలు, ఆచార వ్యవహారాలూ, దినచర్య.... అన్నీ ఒకే ఒక్క దీక్షతో మారిపోతాయి. అందుకే దీక్ష పట్టగానే ఆ వ్యక్తికి పేరు అంతర్థానమై 'స్వామి' గానే పిలవబడుతుంటాడు.
మమకారాన్ని విడిచిపెట్టి, స్వామి ఆకారాన్ని మనసులో ప్రతిష్టించుకోవడం ఏ క్షణాన మొదలవుతుందో అప్పుడే మానవుడు మాధవునిగా పరివర్తించడం మొదలవుతుంది. ఈ పరిణామక్రమం పూర్తి అయితే అప్పుడు భక్తునికీ భగవంతునికీ తేడా ఉండదు. అబేధ్యమే...ఈ సత్యాన్ని చాటిచెప్పడానికే అయ్యప్పదీక్ష ప్రారంభమైంది.
కులమతబేధాలులేని, తరమత బేధాలు లేని ఓ ఆధ్యాత్మిక ప్రపంచమే శబరిమలై. రెండున్నరమాసాల పాటు దేశంయావత్తు, మరీ ముఖ్యంగా దక్షిణభారతం శరణుఘోషతో మారుమ్రోగిపోతుంటోంది. ప్రతిరోజు సుమారు ఐదారులక్షల మంది అయ్యప్ప భక్తులు పంపానదితీరం నుండి ఐదు కిలోమీటర్ల దూరం ఎత్తైన కొండ ప్రాంతంలో ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు.
అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే, పంపానది నుంచి సుమారు, 4,135 అడుగుల ఎత్తులో ఉన్న సన్నిధానంకు చేరాల్సిందే. ఈ మార్గమే మనోదౌర్భాల్యాలనీ , శారీరక సౌఖ్యాలనీ మండించి బూడిద చేయగల దైవమార్గం. ఈ మార్గంలో ఎదురయ్యే కష్టాలే ఆ హరిహరసుతుడు పెట్టే పరీక్షలు. వీటిలో నెగ్గితే మోక్షమార్గం కళ్లెదుట కనబడుతుంది.