Type Here to Get Search Results !

శ్రీ దేవీ భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,
శ్రీ దేవీ భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన
బ్రహ్మలోకానికి పైనసర్వలోకం విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపమంటారు. అక్కడే శ్రీదేవి తేజరిల్లుతూ ఉంటుంది. సమస్తలోకాలకన్న అధికమైనది కావడం వల్లనే మణిద్వీపాన్ని సర్వలోకమని అంటారు. పరాంబికాదేవి దానిని తన సంకల్ప మాత్రంచేత సృష్టించింది. ఈ సృష్టికిపూర్వం మూల ప్రకృతీదేవి ఈ మణిద్వీపాన్ని తనకు ఆవాసస్థానంగా ఏర్పరచుకుంది. మణిద్వీపం కైలాసం కన్నా మిన్నగా, వైకుంఠంకంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్ఠంగా భాసిల్లుతూ ఉంటుంది. అందుకే దానిని సర్వలోకమంటారు. ఈజగత్రయంలో దానిని అధిగమించిన సుందరతర నగరం వేరొకటి లేదు. అది భువన త్రయానికి ఛత్రంలా అమరి ఉంది. సంసార సంతాపాన్ని నాశనం చేస్తూ అది బ్రహ్మాండాలు అన్నిటికి చల్లని నీడను ప్రసాదిస్తూ ఉంటుంది. గాంబీర్య, వైశాల్యాలలో సమమైన యోజనాలు కలది. మణిద్వీపానికి నాల్గువైపులా అమృతసాగరం భాసిల్లుతూ ఉంటుంది. ఆ సాగరంలో వాయుస్పర్శకు ఉవ్వెత్తుగ లేస్తూ శీతలతరంగాలూ, రతనాల సైకత ప్రదేశాలూ, దక్షిణావర్త శంఖాలూ, అనేక వర్ణాలుకల చేపలూ కనుల పండుగ చేస్తూ ఉంటాయి. అక్కడ అసంఖ్యాక తరంగాల సంచలనం వల్ల చల్లటి నీటితుంపరలూ, తెక్కేల తెక్కుతో అటూ ఇటూ సంచరించే పడవలూ ఆ ప్రదేశాన్ని శోభాయమానం చేస్తుంటాయి. సుదీర్ఘమైన ఆ తీరాలలో నయనానందకరమైన రత్నవృక్ష పంక్తులు రాజిల్లుతూ ఉన్నాయి.

ఆ ప్రదేశానికి ఆవలిభాగంలో నిర్మించబడిన సప్త యోజనాల విస్తీర్ణంకల దృఢమైన లోహమయ ప్రాకారం ఉంది. నానాశస్త్రాస్త్రాలను ధరించి పోరడంలో యుద్ధ విశారదులైన రక్షకభటులు నాలుగు ద్వారాలతో ద్వారపాలకులై కాపలా కాస్తూ ఉంటారు. ప్రతి ద్వారంలోనుఊ వందలాది భటులుంటారు. అక్కడ శ్రీదేవీభక్తులు గణాలుగానివసిస్తారు. వారు సర్వదా జగదీశ్వరి దివ్య సందర్శనార్థం విచ్చేస్తూంటారు. వారు తమ దివ్య వాహనాలపై వస్తూపోతూంటారు. వారి అసంఖ్యాక విమానాదుల గంటల చప్పుళ్ళూ వారి గుర్రాల సకిలింఉలూ, వాటి డెక్కల టక టక ధ్వనులూ దిక్కులు పిక్కటిల్లేలా మారుమ్రోగుతుంటాయి. అక్కడి దేవీ జనాదులు వేత్ర పాణులై 'గోల చేయకండి' అంటూ దేవ సేవకులను దండిస్తూ ఉంటారు. ఆ మహాకోలాహల మధ్యభాగంలో ఎవరు ఏ చప్పుడు చేసినా తెలియరాదు, ఒకరిమాట వేరొకరికి తెలియరాదు. అక్కడ అడుగడుక్కీ స్వచ్ఛశీతల, మధుర జల సంభరిత సరోవరాలున్నాయి. అచ్చోటనే రత్నమయ వృక్ష సంభరితమైన ఉద్యానవనాలున్నాయి.

ఆ స్థానందాటి పురోగమించగా లోపలిభాగంలో కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంది. ఆ కాంస్యప్రాకారం అంబరాన్ని చుంబించునట్టిదిగా ఉంది. లోహమయ ప్రాకారాన్ని అధిగమించి కాంస్య ప్రాకారం శతాధిక లోహమయ ప్రకారం కన్నమిన్నయై మహత్తరమైనది. దాని గోపుర ద్వారాలు మహోన్నతమైనవి. సమస్త తరుజాతులూ అక్కడ ఉన్నాయి. ఆ తరుశాఖలకు సర్వదా కొంగ్రొత్త చిగుళ్ళను, కమ్మటి సువానలీను నానావర్ణాలుకల పుష్ప గుచ్చాలును, మధుర ఫలాలూ విలసిల్లుతూంటాయి. పనస, వకుళ, లోధ్ర, కర్ణికార, శింశుప, దేవదారు, కాంచనార, చూతనమేరు, లికుచ, హింగులైలా, లవంగ, కట్ఫల, పాటల, ముచుకుంద, ఫలినీ, జఘనేఫల, తాల, తమాల, సాల, కంకోల, నాగభద్ర, పుణ్నాగపీలు, సాల్వక, కర్బూరాశ్వకర్ణ, హస్తికర్ణ, తాలపర్ణ, దాడిమి గణిక, బంధుజీవక, జంబీర, కురండక, చాంపేయ, బంధుజీవన, కనక, ద్రుమ, కాలాగురు, చందన, ఖర్జూర, యూధికా, తాలపర్ణీక్షు, క్షీరవృక్ష, ఖదిర, బింబా, భల్లాత్క, రుచక, కుటజ, బిల్వ, తులసి, మల్లికాది తరువులూ గల మనోహర వనాలూ ఉన్నాయి. ఈ రీతిగా అక్కడ నానావిధ వృక్షాలూ, వనోపవనాలూ, అనేక శతాల సంఖ్యలో దిగుడు బావులూ మహాసుందరంగా భాసిల్లుతూంటాయి. ఆ తరుశాఖలపై ఆసీనులై కోయిలలు కుహూనాదాలు చేయగా గండు తుమ్మెదలు ఝంకార నాదాలు చేయ ఆ నాదాలు శ్రవణ మనోహరంగా ఉంటాయి. ఆ తరువులు సాంద్ర శీతలచ్ఛాయను ప్రసాదిస్తూంటాయి. వివిధపక్షి సముదాయానికి ఆ తరు సమూహాలు నివాసయోగ్యంగా ఉన్నాయి. అనేక రసాల ప్రవహించు నదీతీర ప్రదేశాలు అక్కడ నయనానందకరంగా ఉంటాయి.

చిలుకలూ, గోర్వంకలూ, పావురాలూ, రాజహంసలూ ఆదిగాగల పక్షిపక్ష సంజాత వాయువుల వల్ల అక్కడి తరుశాఖలు కంపిస్తూంటాయి. అట్టి తరు సమూహాలు విరజిమ్మే సుగంధ పవనాల వల్ల అక్కడి వనాలలో పరిమళాలు గుబాళిస్తూంటాయి. ఆ వనాలలోని హరిణీ సమూహాలు బిత్తరి గంతులతో ఇటూ అటూ పరిభ్రమిస్తూంటాయి. అచ్చోట నర్తిస్తూ కేకారవాలు చేసే మనోహర మయూరనాదాలు దశదిశలూ వ్యాపిస్తూంటాయి. అట్టి మణిద్వీపంలో మధుర నాదాలు ప్రతిధ్వనించ మధువును స్రవింపజేసే తరుసమూహాలు అలరారుతుంటాయి.

ఆ కాంస్య ప్రాకారం దాటగా లోపలివైపు తామ్రప్రాకారం ఉంది. చతురస్రాకారంగా ఉన్న అది చత్యంఉరస్రాకారంగా సప్తయోజనాల ఔన్నత్యం కలిగి అది భాసిల్లుతూ ఉంటుంది. కాంస్య తామ్ర ప్రాకారాల మధ్యలో కల్ప వనాలున్నాయి. తరు వికసిత పుష్పాలు సువర్ణ పుష్ప సమంగా భాసిల్లుతూ ఉంటాయి. వాటి పత్రాలు సువర్ణ పత్రాలుగా బీజఫలాలు రత్నాలవలె, సొంపుకూరుస్తూ ఉంటాయి. ఆ తరు బహిర్గత సుగంధం దశయోజన పర్యంతం వ్యాపిస్తూ ఉంటుంది. ఆ కల్పవనంలో వసంతేశుడు కొలువై అహోరాత్రులు వసంత శోభలను వ్యాపింప జేస్తూంటాడు. అతడు పుష్పచ్ఛత్ర ఛాయలో పుష్ప సింహాసనంపై ఆసీనుడై ఉంటాడు. పుష్పాభరణాలను దాల్చిన అతడు పుష్ప మధువును పానంచేసి మత్తెక్కి ఉంటాడు. మధుశ్రీ మాధవశ్రీలు ఇర్వురూ అతని భార్యలు. సదా మందస్మిత వదనారవిందాలతో అలరారే భారలతోకూడి వసంతుడు పూల బంతులతో క్రీడిస్తూంటాడు. మధుధారలు ప్రవహించునట్టి ఆ కల్పక వనం అపారానందాన్ని అందజేస్తూ ఉంటుంది. అక్కడి సుగంధాలు దశయోజన పర్యంతం వ్యాపించి ఉంటాయి. సుగంధ సంభరితమైన ఆ వనాలలో గాన లాలసలైన గంధర్వ కామినీజన గాఢాలింగనాలలో గంధర్వ యువకులు సయ్యాటలాడుతూ ఉంటారు. మత్తకోయిలల కలకలరావాలతో వసంత శ్రీ శోభలతో ఆ దివ్యవనం కముకుల కామోద్రేకాన్ని వర్ధిల్లజేస్తూ ఉంటుంది.

తామ్ర ప్రాకారాన్ని అధిగమించగా లోపలివైపు సీస ప్రాకారం ఉన్నది. సప్తయోజనాల ఎత్తులో అది అలరారుతూ ఉంటుంది. తామ్రసీస ప్రాకారాల మధ్యభాగంలో సంతాన వాటిక ఉంది. అచ్చట దశ యోజన పర్యంతం వ్యాపిస్తూ ఉంటుంది. మధుర రస సంభరితాలై అక్కడి ఫలాలు ఉంటాయి. సంతాన వాటికకు గ్రీష్మ ఋతువు నాయకుడు, శుక్రశ్రీ శుచిశ్రీలు అతని భార్యలు. సంసార తాపభీతలై వారు ఆ తరువలు మొదట శాంతిగ విశ్రమిస్తూంటారు. అక్కడే గణనాతీతంగా అమర, సిద్ధ గణాలు ఉంటాయి. శరీరాలకు గంధాలు పూసుకొని సుమమాలలను గళసీమలో అలంకరించుకుని తాళవృంతాలను చేబూని నవ విలాసినులు సమూహాలుగా ఒయ్యారాన్ని ఒలకబోస్తూంటారు. అచ్చటి ప్రాణులు శీతల జలాలను పానం చేస్తూంటారు.

సీసపు ప్రాకారాన్ని దాటి పురోగమించగా గోచరమయ్యేది ఇత్తడి ప్రాకారము. అది సప్తయోజనాలు ఔన్నత్యం కలిగి విరాజిల్లుతూ ఉంటుంది. సీసపు - ఇత్తడి ప్రాకారాల మధ్య ప్రదేశంలో హరిచందన తరువనాలున్నాయి. మేఘవాహనుడైన వర్షఋతువు దానికి అధిపతి, తటిల్లతలవలె అతని నయనాలు పింగళ వర్ణంలో భాసిల్లుతూ ఉంతాయి. అతడు మేఘ సమూహాలే కవచంగా కలవాడు. వజ్ర సదృశంగా గర్జిస్తూ ఇంద్రచాపధారియై కడవపోతగా సర్వే సర్వత్రా వర్షిస్తూ స్వగణపరివేష్టితుడై ఉంటాడు. నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబాదుల నితంతి, భ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార మదవిహ్వల ఈ పన్నెండుగురు వర్షఋతు నాయకునకు మదమత్తలైన ద్వాదశ శక్తులు, ఈ ప్రదేశమంతా నవపల్లవ సంభరిత తరుపంక్తులతో, లేలేత తీగెలతో, పచ్చని పైరులతో కనుల విందు చేస్తూ ఉంటుంది. నిర్విరామ ప్రవాహవేగంతో అక్కడి నదీనదాలు హృదయానందాన్ని వర్ధిల్లజేస్తూంటాయి. సరస్సులలోని కలుష జలాలు సయితంరాగౌల అంతరంగాలవలె విశుద్ధంగా ఉంటాయి. శ్రీదేవీ మహోత్సవాలు చేసుకునే సిద్ధులూ, దేవతలూ  అక్కడ వసిస్తూంటారు. వారు విలాసినులైన తమ పత్నులతో విహరిస్తూంటారు.

ఆ ఇత్తడి ప్రాకారం దాటగా లోపలగా సప్త యోజనాల ఔన్నత్యం కలిగి పంచలోహమయ ప్రాకారం తేజరిల్లుతూంటుంది. ఇత్తడి-పంచలోమయ ప్రాకారాలకు మధ్య భాగంలో మందారవనం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మందార తరువులు సుందర పుష్పాలతో పల్లవాలతో నయనానందకరంగా ఉంటాయి. ఎట్టిరోగమూలేని శరదృతువు దానికి అధిష్ఠాతకాగా ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అనేవారు అతని భార్యలు సిద్ధులు అచ్చోట తమ పత్నులతో నివసిస్తూంటారు.

ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా లోపలవైపు సప్తయోజనాల ఎత్తు కలిగి మహోన్నత శిఖరాలతో రజిత ప్రాకారం తళతళలాడిపోతూంటుంది. అక్కడి పారిజాత తరువులు నవ్యపుష్ప గుచ్ఛాలతో సుగంధాలను వెదజల్లగా తత్పరిమళం దశయోజన పర్యంతం వ్యాపిస్తూ దేవీ పూజలు చేసేవారి ఆనందాన్ని వర్ధిల్లజేస్తూంటుంది. మహోజ్జ్వలైన హేమంత ఋతువు దానికి అధిపతి, అతదు తన గణాలతో, ఆయుధాలతో అనురాగవతుల మనస్సులను పరవశింపజేస్తూంటాడు. సహశ్శ్రీ సహస్యశ్రీలు అతని భార్యలు. దేవీ వ్రతాలను ఆచరించునట్టి సిద్ధులు అక్కడ నివసిస్తూ ఉంటారు.

ఆ రజిత ప్రాకారం దాతి పురోగమించగా లోపలి ప్రదేశంలో సప్తయోజనాల ఔన్నత్యం కల సువర్ణమయ ప్రాకారం తేజరిల్లిపోతూ ఉంటుంది. రజిత-సువర్ణమయ ప్రాకారాల మధ్య పుష్పపల్లవ శోభితమైన కదంబవనం ఉంది. ఆ తరువుల నుండి కదంబ మధ్యం అసంఖ్యాక ధారలతో స్రవిస్తూ ఉంటుంది. ఆ రసధారలను స్వేచ్ఛగా పానం చేయడం వల్ల ఆత్మానందం కలుగుతుంది. ఆ ప్రాకారానికి శిశిర ఋతువు అధిపతికాగా, అతడు తన పత్నులైన తపశ్శ్రీ, తపస్యశ్రీలతో గూడి ఆనందిస్తూంటాడు. ఆ స్థానంలో మహాసిద్ధులైన వారు నానా గణాలతో హావభావ విలాసయుక్తులై దేవీ ప్రీత్యర్థం దానాలు చేయ సంసిద్ధంగా ఉంటారు. వారు తమ అర్థాంగులతో కాపురాలు చేస్తూ సుఖభోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఉంటారు.

సువర్ణమయ ప్రాకారాన్ని దాటి ముందుకు వెళ్ళగా లోపలివైపు ఏడు యోజనాల ఎత్తులో పుష్పరాగమణి ప్రాకారం కంటపడుతుంది. ఎర్రటి కుంకుమలా అది భాసిల్లుతూ ఉంటుంది. అక్కడి పృథివీ, వనోపవనాలూ అన్నిటి కన్నీ పుష్పరాగమణి మాయలే. అక్కడ ఉండే రత్నవృక్షాలూ పుష్పరాగపుచెట్ల పాదులూ సొంపుగా ఉంటాయి. అచ్చోటనే రత్నప్రాకారం ఉంది. అందలి తరు, పక్షి, వనభూమ్యాదులన్నీ రత్నమయాలై మండప, స్తంభ, సరోవర, కమలాదులన్నిటికన్నీ రత్నమయాలే. ఈ రత్న ప్రాకారం ఇతరేతర ప్రాకారాలన్నిటినీ మించి లక్షరెట్లు అధికంగా భాసిల్లిపోతూ ఉంటుంది. బ్రహ్మాండంలోని దిక్పతులైన ఇంద్రాదులు, వరాయుధాలు ధరించి దిక్పాల సమష్ట్యాత్మ రూపంలో ప్రకాశిస్తూంటారు. 

దానికి తూర్పుగా మహోన్నత శిఖరాలతో అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూ ఉంటుంది. అక్కడ మహేంద్రుడు రాజిల్లుతూ ఉంటాడు. స్వేగసీమలోని శోభకన్న మిన్నయైన అత్యధిక శోభకానవస్తుంది. అక్కడ వేలాది ఇంద్రుల ప్రకాశం కల మహేంద్రుడు వజ్రహస్తుడై దేవసైన్య పరివేష్టితుడై భాసిల్లుతూంటాడు. దేవాంగనలతో కూడి ఇంద్రాణి కూడ అక్కడే విరాజిల్లుతూంటుంది. దానికి ఆగ్నేయ భాగంలో అగ్నిమయ పట్టణ మనదగిన అగ్నిపురం తేజరిల్లిపోతూంటుంది. అగ్నిభట్టారకుడు అక్కడే తన భార్యలైన స్వాహా, స్వధా దేవ్యులతో నిజవాహన భూషణ, దేవగణ పరివేష్టితుడై ప్రకాశిస్తూంటాడు. దక్షిణ దిగ్భాగంలో యముని నగరం ఉంది. అక్కడ యముడు దండపాణియై చిత్రగుప్తాదులతో, తనశక్తితో నివసిస్తూ ఉంటాడు. నైరృతదిశలో రాక్షసులుంటారు. వారిచే పరివేష్టితుడై నిజశక్తి యుక్తుడై నిరృతి భాసిల్లుతూంటాడు. పశ్చిమదిశలో పాశధరుడై వరుణదేవుడు ప్రతాపశాలియై గోచరిస్తాడు. వారుణీ మదమత్తయైన తన పత్నితో మహా మత్సాన్ని అధిరోహించి జలజంతువులతో విహరిస్తూంటాడు. అతడా లోకంలో తన భార్యతో కూడి రతి క్రీడల తేలి ఆనందిస్తూంటాడు. వాయువ్యదిశలో వాయులోకంలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. వాయుసాధనం ద్వారా సిద్ధులైన యోగి జన పరివేష్టితుడై ధ్వజహస్తుడై, విశాలాక్షుడై మృగవాహనుడై మరుద్గణ సేవితుడై తన శక్తితో కూడి ఆ మహాత్ముడు విరాజిల్లుతూంటాడు.

ఉత్తర దిశలో యక్షలోకం ప్రకాశిస్తూంటుంది. అక్కడ వృద్ధి-బుద్ధి అనే పేర్లు గల శక్తులతో యక్షేశుడు భాసిల్లుతూ ఉంటాడు. ధనపతి అయిన అతడు నవనిధులకూ అధిపతి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికంథరుడు, మణిభూషుడు, మణిమాలాధారి, మణికార్ముకుడు, ఆదిగాగల యక్షసేనానులతో కుబేరుడు తన శక్తితో విశేష సంపన్నుడై తేజరిల్లుతూ ఉంటాడు. దానికి ఈశాన్య భాగంలో మహారుద్రలోకం తేజరిల్లుతూ ఉంటుంది. అమూల్య రత్న నిర్మితమైన అందులో మహారుద్రుడు స్వయంగా భాసిల్లుతూంటాడు. మహోగ్రుడై, దీప్తనయనుడైమూపున అమ్ములపొదిని దాల్చినవాడై, వామహస్తాన ధనువును ధరించి అనేకమంది రుద్రులతో కూడి ఉంటాడు. వారును వరాయుధ ధనుర్ధారులై ఉంటారు. వారి వికృత భయంకర వదనాల నుండి నిప్పులు కురుస్తూంటాయి. వారిలో కొందరు దశభుజులు, మరికొందరు శతభుజులు, ఇంకా కొందరు సహస్ర భుజులు, దశపాదాలతో, దశగ్రీవాలతో నేత్రత్రయంతో కొందరు ఉంటారు. భీకర రూపులైన వారిలో కొందరు పృధ్విమీద, మరికొందరు అంతరిక్షంలోనూ పరిభ్రమిస్తూంటారు. రుద్రాధ్యాయంలో వర్ణించిన రుద్రులచే, మాతలచే, నానాశక్తులచే, డామర్యాది గణాలచే, వీరభద్రాదులచే పరివేష్టితుడై మహారుద్ర భగవానుడు తేజరిల్లుతూంటాడు. ముండమాలాధరుడు, నాగకంకణుడు, నాగకంటుడు, వ్యాఘ్రచర్మధారీ, గజచర్మాన్ని ఉత్తరీయంగా ధరించినవాడూ, చితాభస్మధారీ ప్రమథగణ పరివేష్టితుడూ, డమరుకనాదాలను దశదిశలా ప్రతి ధ్వనింపజేయగలవాడూ, మహాట్టహాస, స్ఫోట శబ్దాలతో నభాన్ని భయపెట్టినట్టివాడూ, భూత సంఘాలతో కూడిన వాడూ, భూతావాసుడూ అయిన మహేశ్వరుడు ఈశానాది అధిపతికావడం వల్ల ఈశానాది అధిపతి కావడం వల్ల ఈశానుడనబడతాడు. అష్ట మూర్తియు, మహారుద్రుడూ అయి అతడు భాసిల్లుతూంటాడు.

పుష్యరాగమణుల ప్రాకారానికి ఆవలి భాగంలో లోపల కుంకుమ సమ అరుణవర్ణంతో పద్మరాగ మణి ప్రాకారం భాసిల్లుతూంటుంది. అక్కడి భూభాగం కూడ ఎర్రగానే ఉంటుంది. ఆ ప్రకారం దశయోజనాల ఔన్నత్యం కలిగి ఉంటుంది. దానికి గోపుర ద్వారాలున్నాయి. అక్కడ పద్మరాగమణి సంభరిత ప్రకాశంతో అసంఖ్యాక మండపాలున్నాయి. వాటి నడుమ వివిధాయుధ, రత్నభూషణ ధారులైన వీరులూ, చతుష్షష్టి కళలూ ఉన్నాయి. ఆ మహావీరులకు వేర్వేరుగా నాయకులూ ఉన్నారు. ప్రత్యేక లోకాలూ ఉన్నాయి. ఆ లోకాలన్నీ పద్మరాగమణి నిర్మితాలే. ఆయా లోకాలలోని వారు ఆయా వస్త్ర వాహనాదులను ధరిస్తారు. వారి నామాలు పింగళాక్షి, విశాలాక్షి సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహా, స్వధా, అభిఖ్య, మాయ, సంజ్ఞ, వసుంధర, లోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశేశ్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ఆరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్య, మాత, సతి, హంసి, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లొంబోష్ఠి, ఊర్థ్వకేశి, బహు, శీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మదనాతుర, అనంగ, అనంగమథన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచి, వ్రత, ఉదార, వాగీశి అనే అరువది నాలుగు కళలూ శక్తులనబడతాయి. వారందరికీ నిప్పులు కక్కునట్టి మహోజ్జ్వలమైన జిహ్వలున్నాయి. వారి అనేక ముఖాల నుండి అగ్ని జ్వాలలు బహిర్గతమవుతుంటాయి. "మనం ఈ సమస్త జలాలనూ పానం చేసివేద్దాము. సమస్తాగ్నినీ చల్లార్చి వేద్దాము. వాయువునంతటినీ స్తంభింప జేసివేద్దాము. సర్వజగాలనూ భక్షించి వేద్దాము", అని జేవురించిన నేత్రాలతో వారు అరుస్తూంటారు. ధనుర్బాణ పాణులై వారందరూ కయ్యానికి కాలు దువ్వుతుంటారు. వారి దంత తాడనం వల్ల పుట్టిన కఠోరశబ్దాలకు శ్రవణాలు బదహిరీ భూతమవుతూంటాయి. ఆ మహావీరులందరికీ ఊర్ధ్వ కేశాలున్నాయి. లక్ష బ్రహ్మాండాలను నాశనం చేయగల శక్తి అందులో ప్రతిశక్తికీ ఉంది. అట్టి నూర్ల అక్షౌహిణీ సైన్యాలున్నాయి. ఈ విశ్వంలో వాటికి అసాధ్యమైన దేదీలేదు. ఆ ప్రాకారంలోనే రణసామాగ్రి అంతా భద్రపరచబడి ఉంది. అచ్చోట రథాశ్వ గజశస్త్రాదులు గణనాతీతంగా ఉన్నాయి.

ఆ పద్మరాగ మణిప్రాకారాన్ని దాటి పురోగమించగా లోపలి ప్రదేశంలో గోమేధిక మణి నిర్మిత ప్రాకారం అలరారుతూ ఉంటుంది. అది దశయోజనాలు ఔన్నత్యం కలిగి రాజిల్లుతూ ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా అది తేజస్సులను విరజిమ్ముతూ ఉంటుంది. దాని మధ్య భాగమందలి భూమీ, అక్కడ ఉండేవారు ఆ వర్ణంతోనే ఉంటారు. అక్కడి భవనాలూ గోమేధిక మణికాంతులను ప్రసరింపజేస్తూంటాయి. అక్కడ నివసించే పక్షి, వృక్ష, స్తంభ, సరోవరాదులన్నిటికన్నీ కుంకుమ సమ అరుణ వర్ణంతో గోమేధికమణి నిర్మితమై ఉంటాయి. ఆ ప్రాకార మధ్య భాగంలో ముప్ఫై రెండు శ్రీదేవీ శక్తులుంటాయి. గోమేధికాభరణ ధారులైన ఆ శక్తులు వివిధ శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూంటారు. ఆ ప్రాకారంలో 32లోకాలున్నాయి. ప్రతిలోక శక్తికీ దశసంఖ్యలో అక్షౌహిణీ సైన్యాలున్నాయి. ఆ ప్రాకారంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో, నిరంతర చక్రధారిణులై సదా స్వర్గవాసులచే ఆరాధింపబడుతూంటారు. క్రోధోద్రిక్తలైనవారు "ఛేదించండి, భేదించండి, వండండి, కాల్చండి" అని అంటూ నిరంతర యుద్ధోత్సాహంతో సంసిద్ధంగా ఉంటారు. ప్రతీ మహాశక్తి సన్నిధిలోనూ దశాక్షౌహిణీ సైన్యాలుంటాయి. అందలి ప్రతీశక్తి అగణిత బ్రహ్మాండాలనైనా నాశనం చేయగలదు. అట్టి మహాసైన్యాలను వర్ణించగలమా? అక్కడ ఉన్న రథ వాహినులకు లెక్కయేలేదు. వారందరికందరూ శ్రీదేవికై యుద్ధం చేయ సన్నద్ధులై ఉంటారు. పాపహారకాలైనా వారి నామాలివి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహూ, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, బుద్ధిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతి, దండిని, ముండిని, సేందుఖండ, శిఖండిని, శుంభ, నిశుంభమథిని, మహిషాసురమరద్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థశరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని, మాయాదేవి వీరేక్రుద్ధులయైతే సమస్త బ్రహ్మాండాలనూ నాశనం చేయగలరు. ఎట్టి స్థితిలోనూ వీరు అపజయాన్ని అంగీకరించరు.

గోమేధిక ప్రాకారాన్ని దాటి ముందుకు వెడితే లోపలి భాగంలో వజ్రాల ప్రాకారం ప్రకాశిస్తూ ఉంటుంది. అదీ దశయోజనాల ఔన్నత్యం కలిగి గోపుర ద్వారాలతో శృంఖలాబద్ధమైన కవాటాలతో శోభిల్లుతూంటుంది. నవతరువులతో అలరారే ఆ ప్రదేశమంతా వజ్రమయమే. అక్కడి వీధులూ, లతలూ, తరువులూ, పక్షులూ, అన్నిటికన్నీ వజ్రమయాలే. వాపీకూపతటాకాదులన్నిటికన్నీ వజ్రమయాలే. అక్కడే త్రిభువనేశ్వరీదేవి దాసీజనం నివసిస్తూంటారు. ప్రతీదాసీ అసంఖ్యాక దాసీగణం ద్వారా సగర్వంగా సేవలందుకుంటూంటారు. వారిలో కొందరు తాళవృంతాలను ధరించీ, మరికొందరూ పానపాత్రలు చేబూనీ ఇంకా కొందరు తాంబూల పాత్రలను గైకొనీ ఉంటారు. కొందరు ఛత్రచామరాలనూ, నానాంబరాలనూ, సుమాలనూ, నిలువుటద్దాలనూ, కుంకుమానులేపనాలనూ, కాటుక, సింధూర, పానపాత్రలనూ ధరించి ఉంటారు. చిత్రలేఖనంలో కొందరూ, ఆభరణ నిర్మాణంలో కొందరూ నిపుణులు, మరికొందరు శ్రీదేవి పాదసేవనంలో తన్మయులవూతూంటారు, కొందరు సర్వాంగాలలోనూ ఆభరణాలను ధరిస్తారు. కొందరు పుష్ప మాలలనూ, పుష్పాభరణాలనూ ధరింపజేస్తారు. ఈరీతిగా అక్కడ రమణులు విలాసవతులై, చతురులై రాసికెక్కుతారు. వారందరికందరూ శ్రీదేవీ సేవకై నడుములు బిగించి ఉంటారు. శ్రీదేవీ కరుణారసదృష్టి ముందు జగత్రయాన్ని సైతం తుచ్ఛంగా భావిస్తారు. శ్రీదేవీ చరణ సేవాతత్పరలు, శృంగార మదగర్వితలు అయిన వారి నామాలివి. అనంగరూప, అనంగమదన, సుందరి మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల, వీరందరికందరూ తటిల్లతలవంటి శరీరాంగాలతో, రవళించే మొలనూలి గంటలతో, మధురనాదాలు చేసే కాలి అందెలతో అటూ ఇటూ ఒయ్యారాలు ఒలకబోస్తూ పరిభ్రమిస్తూంటారు. విద్యుల్లతలను బోలు శరీరాంగాలు కల నారీమణులు కొందరు వేత్రపాణులై సర్వకార్యాలనూ సమర్థవంతంగా చేయగలిగిన చతురులై ఇటూ అటూ పరుగులు తీస్తూంటారు. ఆ ప్రాకారానికి అష్టదిశలలోనూ వారి భవనాలున్నాయి. ఆ భవనాలలో వారి అగణితాయుధ, వాహనాదులు శోభిల్లుతూంటాయి.

ఆ వజ్ర ప్రాకారం దాటి పురోగమించగా లోపలి వైపున వైడూర్య ప్రాకారం తేజరిల్లుతూన్నది. అది కూడ దశయోజనాల ఔన్నత్యం కలిగి గోపుర ద్వారాలతో భాసిల్లిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్నభూమీ, మార్గాలూ, వాపీకూపతటాకాదులూ, నదీ తీరాలూ, సైకత స్థానాలూ అన్నిటికనీ వైడూర్యమయాలే. అక్కడి అష్టదిశలలో బ్రాహ్మీ ఆదిగాగల దేవీమండాలాలు ఉన్నాయి. నిజగణాలతో వారందరూ కొలువుతీరి ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలోని మాతలందరికీ వీరే సమిష్టిగా ప్రతిరూపాలుగా వ్యవహరింపబడతారు. బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, అనేవారలు సప్తమాతృకలుగా ఖ్యాతిగాంచారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంటుంది. బ్రహ్మరుద్రారి దేవతలకు సమమైన రూపచేష్టలు కలిగి వీరు శుభాలను చేకూరుస్తూంటారు. స్వసైన్యాలతో తేజరిల్లుతూంటారు. ఈ ప్రాకారానికి చతుర్ద్వారాలలో నిత్యం మహేశ్వరీదేవి దివ్య వాహనాలు చక్కగా అలంకరింపబడి జాగరూకలై ఉంటాయి. అచట అసంఖ్యాకంగా గజాశ్వ, సింహ, గరుడ, వృషభ, మయూర, హంస, పల్లకీలు, మొదలైనవి వాహనాలుగా సావధానంగా ఉంటాయి. అట్లే రథాలు కూడ అగణితంగా ఉన్నాయి. ఆయా వాహనాలకు రెండువైపులా పార్శ్వ రక్షకులున్నారు. అరదాల టెక్కాలు గగనతలాన్ని చుంబిస్తూన్నాయి. నానావిధ ధ్వజపతాక శోభితాలై గణనాతీతంగా వాద్య విశేషాలతో విమానాలు అలరారుతూన్నాయి.
ఆ వైడూర్య ప్రాకారాన్ని దాటి ముందుకు వెళ్ళగా దశయోజనాల ఎత్తుగల ఇంద్రనీల మణి ప్రాకారం తేజరిల్లుతూ ఉంటుంది. అక్కడి వాపీకూప తటాకాదులన్నీ ఇంద్రనీల మణి నిర్మితాలే. అనేక యోజనాల వెడల్పుతో ఓ పద్మం భాసిల్లుతూ ఉంటుంది. అది షోడశదళాలతో సుదర్శన చక్ర సన్నిభంగా ప్రకాశిస్తూంటుంది. అక్కడే పదహారు శక్తులుంటాయి. విశ్వవార్తలను తెలియజేయ గలవారువారే.

ముక్తాలమణి ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా లోపలి భాగంలో మరకతమణి ప్రాకారం అలరారుతూంటుంది. అది కూడా పదియోజనాలు ఔన్నత్యం కలిగి ఉంటుంది. అక్కడ భోగభాగ్యాలకు లోటే ఉండదు. అందలి అసంఖ్యాక భవనాలు మరకతమణి నిర్మితాలే. రాశీభూత కాంతులతో విరాజిల్లే అక్కడ గల ష్ట్కోణాలలో గల దేవతల నామాలు, తూర్పుకోణంలో గాయత్రీ యుక్త బ్రహ్మదేవుడు కమండలు, అక్షమాల, దండ, అభయ, ఆయుధాలు దాల్చి విరాజిల్లుతూంటాడు. అట్టి ఆయుధాలనే ధరించి పరదేవత అయిన గాయత్రి ప్రకాశిస్తూంటుంది. సమస్త వేద, వివివ్ధ శాస్త్రస్మృతి, పురాణాదులు మూర్తిమంతాలై నివసిస్తూంటాయి. బ్రహ్మ స్వరూపలూ, గాయత్రీ స్వరూపులూ, వ్యాహృతి స్వరూపలూ, గాయత్రీ స్వరూపులూ, వ్యాహృతి స్వరూపులూ, అక్కడ నివసిస్తూంటారు. నైరృత కోణంలో శంఖ, చక్ర గదా పద్మ ధారులై సావిత్రీ, విష్ణువులూ నివసిస్తారు. మత్స్య కూర్మాదిగాగల విష్ణుమూర్తులూ, సావిత్రీ స్వరూపులూ అందరూ అక్కడే ఉంటారు. వాయుకోణంలో పరశువు అక్షమాల అభయవరాలుదాల్చి మహారుద్రుడు భాసిల్లుతూంటాడు. దక్షిణామూర్త్యాది రుద్ర విగ్రహాలు కూడ శ్రీగౌరీ స్వరూపులు అక్కడ విలసిల్లుతూంటారు. అక్కడ అరువది నాలుగు ఆగమాలూ, శేషించిన ఆగమాలూ రూపుదాల్చి తేజరిల్లుతూ ఉంటాయి. అగ్నికోణంలో రత్నకుంభ, మకర కుండలధారియై, ధనపతి కుబేరు ప్రకాశిస్తూంటాడు. అతడు పాశాంకుశ, ధనుర్బాణధరుడై శృంగాదిరసాలు మూర్తిమంతాలై కొలువుతెరి ప్రకాశిస్తూంటాయి. ఈశాన్య కోణంలో పుష్టితో పాశాంకుశాలు దాల్చి విఘ్నహరుడైన విఘ్నేశుడు నిత్యం వీరవేషంతో అలరారుతూంటాడు. గణపతి సంబంధమైన విభూతి సర్వస్యం అక్కడ సంపదలతో తులతూగుతూంటుంది. అక్కడ ప్రతి బ్రహ్మాండమందలి బ్రహ్మాదుల సమిష్టి రూపులయిన బ్రహ్మాదులు అందరూ ఆ జగదీశ్వరిని నిత్యం సేవిస్తూంటారు.

మరకతమణి ప్రాకారాన్ని అధిగమించి పురోగమించిగా లోపలివైపున పదియోజనాల ఎత్తులో కుంకుమ సమంగా ఎర్రనైన పగడాల ప్రాకారం భాసిల్లిపోతూంటుంది. అందలి మధ్యభాగంలోని భవనాలన్నీ పగడాల వలె ఎర్రగ మిరుమిట్లు గొలుపుతూంటాయి. అక్కడ పంచభూతాల స్వామినులు ఐదుగురు హృల్లేఖ, గగన రక్త, కరాళిక, మహోచ్ఛుహ్మలనేవారు పంచభూతాలవంటి కాంతిగలవారు వరాభయ పాశాంకుశాలు ధరిమ్హి వివిధాభరణ భూహితలై శ్రీదేవి వంటి వేష ఆభరణాలు గలిగి నవ యౌవ్వనంతో గర్వించి ఉంటారు.

ప్రవాళ ప్రాకారాన్ని అధిగమించగా అనేక యోజనాల వైశాల్యం కల నవరత్న ప్రాకారం ఉంది. అందు అమ్నాయ దేవతల భవనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అక్కడి తటాక సఓవరాదులనంటికన్నీ నవరత్న మయాలే. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు ప్రకాశిస్తూంటాయి. పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, భువనేశ్వరి, క్రోధభువనేస్వరి, త్రిపుట, అశారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, వీరేకాక, కాళ్, తార, షోడశ, భైరవి, మాతంగి ఆదిగాగల దశ మహావిద్యలూ అక్కడ రూపు దాల్చి ప్రకాశిస్తూ ఉంటాయి. తమ తమ ఆవరణ దేవతలతో దేవీ రూపాలన్నీ ఆభరణాలు ధరించి సూర్యకాంతులతో విరాజిల్లుతూ ఉంటారు. ఆ కాంతులు కోటి సూర్యుల కాంతిని అధిగమించి ఉంటుంది. సప్తకోటి మహా మంత్రాలు రూపుదాల్చి అక్కడే శోభిల్లుతూంటాయి. నవరత్న ప్రాకారం దాటి పురోగమించగా స్రీకరమైన చింతామణి గృహం మహోజ్జ్వల ప్రభలను విరిజిమ్ముతూంటుంది. అందలి ప్రతి ప్రతి వస్తువూ చింతామణి నిర్మితమైనదే. సూర్యకాంత చంద్రకాంత మణులతోనూ, ప్రకాశమాన మణులతోనూ నిర్మితమైన అసంఖ్యాక మణిస్తంభాలు వేలకొలదీ అక్కడ ఒప్పారుతూంటాయి. ఆ ప్రభల మధ్యభాగంలో ఏ వస్తువూ కానరాదు.

చింతామణుల మధ్యభాగంలో శ్రీదేవి దివ్యమందిరం విరాజిల్లుతూంటుంది. ఆ దివ్య భవనానికి సహస్రమణి  స్తంభాలూ నాలుగు మండపాలూ శోభను చేకూరుతున్నాయి. అందులో క్రమంలో శృంగార, ముక్తి, జ్ఞాన ఏకాంత మండపాలున్నాయి. అక్కడెన్నియో మణివేదికలున్నాయి. అక్కడి వాతావరణం ధూపసువానలను వెదజల్లుతూంటుంది. ఆ నాల్గు మండపాలలోనూ కోటి ప్రభాకర ప్రభలు విరజిమ్ముతూంటాయి. వాటికి నల్దిశలలోనూ కాశ్మీర వనాలు నయనానందకరంగా ఉంటాయి. మల్లెపూదోటలూ, కంద పుష్పవనాలూ అచ్చతి వాతావరణ సర్వస్వాన్నీ పరిమళ భరితం చేస్తూంటాయి. ఆ వనాలలోని అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపజేస్తూంటాయి. రత్న సోపాన పరంపరలు గల మహాపద్మ వనాలు అక్కడ తేజరిల్లుతూంటాయి. ఆ పద్మాలలో అమృత సమంగా మధువులు జాలువారుతూంటాయి. "ఝం ఝం" నాదాలతో భ్రమరాలు తియ్యాటి మధువును పానం చేస్తూంటాయి. అక్కడ హమ కారండవాది పక్షిసంతతులు విహరిస్తూంటాయి. ఆ దివ్య వనంలోని సుగంధాలు దశ దిశలలోనూ సువానలు వెదజల్లుతూంటాయి. ఆ పరిమళ తరంగ వ్యాప్తమై మణిద్వీపం సువాసితమై ఉంటుంది. శృంగార మంటప మధ్యభాగంలో దేవతలు మధుర మనోహర శ్రవణానందకర సుందర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. అక్కడ అమరులందరూ సభాసదులై ఉంటారు. జగజ్జనని వారి మధ్య సింహాసనంపై విరాజిల్లుతూంటుంది. ఆ శ్రీదేవి ముక్తి మండపంలో ఉండి విశ్వంలోని పరభక్తులకు ముక్తి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞాన మండపం నుండి జ్ఞాన ప్రకాశాన్ని వెదజల్లుతూ విధేయాత్ములకు పరమ జ్ఞానదానంచేస్తూ ఉంటుంది. నాల్గవ మంటపమందు దేవి తన మంత్రిణులతో కొలువుండి విశ్వరక్షణ గురించి చర్చిస్తుంది.

చింతామణి గృహంలో శక్తి తత్త్వాత్మకాలైన దశ సోపానాలతో దివ్యప్రభలను వెదజల్లునట్టి ఓ పర్యంకం శోభిల్లుతూంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర్లు దానికి కోళ్లుగా అమరి ఉంటారు. ఆ నాలుగు పాదాలపై ఫలకంగా సదాశివదేవుడు అలరారుతూంటాడు. దానిపై త్రిభువనేశ్వరుడు హిరణ్య బాహువులతో హరిణ, పరశు, వరద, అభయ ముద్రలు దాల్చి తేజరిల్లిపోతూంటాడు. సర్వేశ్వరుడైన ఆ మహాదేవుడు పదహారేళ్ళ ఉందరుదు, కోటిసూర్య ప్రభలతో, కోటి చంద్రుల శీతలత్వంతో శుద్ధ స్ఫటిక సమంగా వెలుగుతూ కరుణాసదృష్టులతో ప్రకాశిస్తూ ఉంటాడు.ఆ భువనేశ్వరునకు వామభాగంలో నవరత్న ఖచితమైన మొలనూలుతో వైడూర్య ఖచితమైన తప్తహాటక నిర్మితమైన కరకంకణాలు ప్రకాశిస్తూంటాయి. మేలిమి బంగారంతో నిర్మించబడ్డ శ్రీచక్రాకారంగల తాటంక ప్రభల ముందు వదనమండలంపై విరాజిల్లగా ఆ జగజ్జనని ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె వదన మండల ప్రభల ముందు చంద్రబింబకాంతులు వెలవెలబోతున్నాయి. చక్కగా పండిన దొండపండువంటిది కాదు. దానిని మించిన అధరంతో ఫాలసీమలో కుంకుమ కస్తూరీ తిలక సౌభాగ్యంతో దివ్యప్రభలు వ్దజల్లునట్టి ముఖ మండలంతో శ్రీదేవి శోభిల్లుతూన్నది. సూర్యచంద్ర బింబకాంతులను మించిన దివ్య చూడామణి శిరోభూషణంగా కలదీ, ఉదయ శుక్ర సమ స్వచ్ఛకాంతులు విరజిమ్మునాసాభరణ భాసితము, జాతి ముత్యాల గుత్తులతో శోభిల్లునట్టి చింతాకు పతకము వ్రేలాడునట్టి గళసీమ శోభిల్లునట్టిదీ కర్పూర, కుంకుమ, సుగంధాలు అలదిన చనుదోయి కలదె, చిత్రవిచిత్రాభరణాలను ధరించినదీ శంఖసమ కంథరం కలదీ, ఎర్రగా పండిన దానిమ్మ పండ్ల గింజల వంటి దంతపంక్తి కలదీ, అమూల్య రత్నస్థగిత మకుటాన్ని శిరస్సుపై ధరించినదీ మత్తిల్లిన గండు తుమ్మెదలు మూగిన ముంగురులతో శోభిల్లు ముఖ కమలం కలదీ, కళంక, క్షీణత్వాలు లేకుండా దివ్యశోభలాడు శరత్ చంద్ర చంద్రునివంటి ముఖబింబం కలదీ గంగానది సుడిగుండ సమమై భసిల్లు నాభిదేశం కలదీ మాణిక్యథగత బంగారు టుంగరాలచే అలంకరింపబడిన కమలదళ సమ సుందర దివ్యనేత్ర త్రయంతో తేజరిల్లునదీ, మెరుగు పెట్టబడిన మహారాగ, పద్మరాగ మణుల బోలునట్టి నిర్మలమై, మహోజ్జ్వలమైన సమస్తమైన కళలూ విరజిమ్ము నైసర్గిక లావణ్య శోభగలదీ నినదించు రతనాల కింకిణీలు, కంకణాదులూ కలదీ, గళసీమలో మణుల ముత్యాల హారాలూ, తళతళలాడే సువర్ణ పతకాలు కలదీ, ధగధగ మెరిసే రతనపుటుంగరాల కాంతులు చిమ్ము కరకమలాలు కలదీ అయిన ఆ దేవి రవికపై పొదుగబడిన వివిధ రతనాల కాంతులు ప్రకాశిస్తున్నాయి. వాడిపోని చక్కటి మల్లెపూల వాసనలు వెదజల్లు కొప్పులో ముడిచిన మల్లెదండలచుట్టూ మూగే తుమ్మెదల బారుకలదీ, శ్రీదేవి తన ఉన్నతమై, నిబిడమై, సువృత్తమైన కుచభారంతో ఈషదలసత్వమంది యున్నది. ఆ శివాని తన హస్త చతుహ్టయంలో పాశాంకుశ వరాభయాలు దాల్చి విరాజిల్లిపోతూన్నది. శుభశ్రీలు నిండారిన శృగార వేషంతో తేజరిల్లుతూన్నది. సుకుమారాంగాలు కలకోమలి అయిన  ఆమె అందాలకందాల రాఇ. అవ్యాజ కరుణా వరుణాలయురాలైన ఆమె కరుణా రసదృష్టులు కలది,నవరసాలను ప్రసరించునట్టి కచ్ఛపీవీణా మధురనాదం కలది, అనేకానేకచోట్ల రవీందుల కాంతుల నధిగమించి సహజప్రకాశంతో ఇచ్ఛ జ్ఞాన, క్రియాశక్తి యుక్తమై తేజరిల్లుతూంటుంది.

అక్కడ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేత, స్మృతి, లక్ష్మి అనేవారలు రూపుదాల్చి ప్రకాశిస్తూంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ర్ధి, అఘోర, మంగళ, నవ, అనే పీఠ శక్తులు నిత్యం పరాంబికను సేవిస్తూంటారు. ఆ మహాదేవికి ఇరుపార్శ్వాలలోను శంఖ, పద్మ నామక నిధులు సదా నిండి ఉంటాయి. నవరత్నాలూ, కాంచనమూ ప్రవహించ స్రవంతులు అక్కడ ప్రకాశిస్తూంటాయి. అక్కడి పెన్నిధుల నుండి సప్తధాతుమయ స్రవంతుల్ సదా ప్రవహిస్తుంటాయి. అవన్నీ చివరకు అమృతసాగరంలో లీనమైపోతాయి. ఈ విధంగా సర్వభువనేశ్వరి అయిన కామేవరి మహాదేవునికి వామభాగంలో ప్రకాశిస్తూ ఉంటుంది. మహాశక్తి సమ్యుతుడై ఉండడం వల్లనే మహా దేవుడు సర్వశక్తి సంపన్నుడై సర్వకార్యాలనూ నెరవేరుతూంటాడు.

చింతామణి గృహప్రమాణాన్ని తెలుసుకొండి. శతయోజన వైశాల్యం కలిగిన చింతామణి మందిరానికి ఉత్తరంగా ఉన్న ప్రాకారం, ప్రాక్ దిగ్భాగంలో ఉన్నదానికన్నమిన్నగా రెండింతలు ఎత్తు కలిగి ఉంది. మహాకాశంలో అది నిరాధారంగా భాసిల్లుతూంటుంది. నిరంతరం అది సంకోచ వ్యాకోచాలు పొందుతూంటుంది. సమస్త ప్రాకారాలలోని ప్రకాశంకన్న మిన్నగా చింతామణి సదనం ప్రకాశిస్తూంటుంది. సృష్టారంభంలో కార్యవశాన అది విప్పిన వస్త్రసమంగా వ్యాకోచించి ప్రళయవేళ సంకోచిస్తూంటుంది. ఆ చింతామని మందిరంలో మహోఅజ్జ్వలంగా భాసించునట్టి శ్రీదేవి ధగధగ మెరిసిపోతూ ఉంటుంది. ప్రతిబ్రహ్మాండంలోని దవదానవ, మానవ, నాగలోకాలలోని ఉపాసకులూ, ఇతరేతర లోకోపాసకులూ కూడ శ్రీదేవీ దివ్య సన్నిధానికి చేరుకుంటారు. శ్రీదేవీ పూజా పరాయణులూ, దేవీ పుణ్యక్షేత్రాలలో తమ ప్రాణులను వదిలి పెడితే, వారందరికందరూ శ్రీదేవీ నిత్యపుణ్య మహోత్సవాలు జరుగునట్టి స్థానాలు చేరుకుంటారు. ఆ జనని సన్నిధిలో ఘృతకుల్య, మధుకుల్య, దధికుల్య, దుగ్ధకుల్య నామక, స్రవంతులు ప్రవహిస్తూంటాయి. ఆ నదులన్నీ అధికంగా అమృతరస ప్రవాహాలే. జంబూ, ఆమ్ర, ద్రాక్ష, ఇక్షురసాలు ప్రవహించునట్టి నదులు అగణితంగా ఉన్నాయి. అభీష్టాలను నేవేర్చునట్టి వృక్షాలూ, అనేక వాపీకూపాలూ ఉన్నాయి. ఆ జలాలనుపానం చేసినవారి అభీష్టాలూ నెరవేరుతాయి. ఈ విషయంలో సంశయం ఎంతమాత్రం లేదు. ఆ జాలాలను పానం చేసినవారికి ఏనాటికి వార్ధక్యం కానీ, వెంట్రుకలు నెరిసిపోవడం కానీ జరగదు. అక్కడ యువకులు సహస్ర సూర్యప్రభలతో భాసిల్లుతూ తమ పత్నులతో స్వేచ్ఛగా సవిలాసంగా విహరిస్తూంటారు. వారందరూ శ్రీభువనేవరెదవిని సేవిస్తూంటారు. ఆస్థానం చేరిన వారికి కామక్రోధమద మాత్సర్యాలు కానీ మానసిక క్లేశాలు కానీ కలుగవు. వారిలో కొందరు సారూప్య ముక్తినీ, మరికొందరు సాలోక్యముక్తినె, ఇంకా కొందరూ సామీప్యముక్తినీ, శేషించిన వారు సార్ష్టిముక్తినీ పొంది ఉంటారు. ప్రతిబ్రహ్మాండంలోని ఆయా దేవతలందరూ జగన్మాతనుచేరి సమిష్టిగా సేవలు చేస్తూంటారు. సప్తకోటి మహామంత్రులూ అక్కడ రూపుదాల్చి అంజలి బద్ధలై మహాదేవిని ఉపాఇస్స్తూంటార్. అక్కడ మహావిద్యలన్నీ సామ్యావస్తనుపొంది దివ్యకారణ బ్రహ్మరూపిణి, మాయాశబల విగ్రహ అయిన శివా భగవతిని ఉపాసిస్తూంటాయి.

మెరుపు సూర్యచంద్రాగ్నులూ వీటి కాంతులనీ కలిసినా మణిద్వీపకాంతిలో కోటి, కోట్యంశకు కూడ సరికావు. అక్కడ వైడూర్య మణికాంతులొకచోట మరకతమణి శోభలు వేరొకచోట విద్యుత్ ప్రభలు ఇంకొక చోట మధ్యాహ్న మార్తాండ ప్రభలు వేరొకచోట, విద్యుత్ సూర్యకాంతులు, మరొకప్రదేశంలోనూ ఇంద్రనీల, మాణిక్య ఇంధూరకాంతి సమూహాలు ఓ ప్రదేశంలోనూ, వజ్రాలరాసుల కాంతులు ఓ ప్రదేశంలోనూ, వేరొలచోదావానల ప్రభలూ ఇంకొకచో తప్తకాంచనచ్ఛ్టలూ, సూర్యకాంత చంద్రకాంత శిలల ప్రకాశాలూ ఓ స్థానంలో రత్న శిఖరాల రత్నప్రాకార గోపురాలూ, రత్నఫల పత్రాలూ గల తరుసంతతులూ ప్రకాశిస్తూంటాయి. కొన్ని స్థానాలలో క్రీడించే మయూర సమూహాలూ కపోతాల మధురనాదాలూ, నవరాగా లొలొకించే పికకలరవాలూ శ్రవణానందకరమైన చిలుకల పలుకులూ కలిగి అచ్చటి కొన్ని స్థానాలున్నాయి. స్వచ్చమై, మధురమైన జలభరిత సరోవరాలు అగణితంగా ఉన్నాయి. ఆ తటాకాలలో వికసించిన రత్న కమలాలు లెక్కించలేనన్ని కోట్ల సంఖ్యలలో నయనానందకరంగా ఉన్నాయి. ఆ తటాకాలకు నల్దిశలలోనూ శతయోజనాల దూరంలో మలయ మారుతం సుగంధ తరంగాలను వీచునట్టి తరు సమూహాలూ అపారంగా ఉన్నాయి. చింతామణుల జ్యోతిఃపుంజాలు అచ్చటి అంబర సర్వస్వాన్నీ ప్రకాశితం చేస్తూంటాయి. మణిద్వీప సర్వస్వం నానావిధ తరు బహిర్గత సుగంధాలతోనూ, వివిధ ధూప వాసనల తోనూ అద్భుతంగా పరిమళిస్తూంటుంది. వివిధ ధూప వాసనలతోనూ అద్భుతంగా పరిమళిస్తూంటుంది. వివిధ మణుల రంధ్ర వినిర్గత రత్న దీపకాంతులు అక్కడి నిలువుటద్దాలపై అపూర్వ శోభలు దింగ్మోహకంగా తేజరిల్లితూంటాయి.


సమస్త సంపదలకూ, సమస్త రస రాజాలకు సంపూర్ణ సర్వజ్ఞత్వానికీ, సకల తేజస్సులకూ, సమస్త పరాక్రమాలకూ, సర్వోత్తమ గుణగణాలకూ దయారస సర్వస్వానికీ మణిద్వీపం పరమావధి మనుష్యానందం అదిగా బ్రహ్మానంద పర్యంతంగా గల సర్వానందాలూ మణిద్వీపంలో నెలకొని ఉంటాయి.

ఫలశ్రుతి
ఏకపర్యాయం ఎ మణిద్వీపాన్ని స్మరించినంత మాత్రాన గతించిన పాపరాసులనీ భస్మమవుతాయి. ప్రాణాలు పోయేటప్పుడు మణిద్వీపాన్ని స్మరించునట్టివాడు దేవీ లోకంలో ప్రవేశిస్తాడు. ఈ ఘట్టాన్ని సంపూర్ణంగా నిత్యం పఠిస్తే భూతప్రేతాది బాధలుండవు. గృహప్రవేశ వేళలో వాస్తుయాగ సమయంలో సప్రయత్నంగా పఠిస్తే శుభ పరంపరలు చేకూరుతాయి.
మంగళం మహత్

మణిద్వీపవాసినికీ జై.

Bottom