ఎవరు ఎవరికి గురువులు.. ఎవరు ఎవరికి ఏం చెప్పారు?
ఈ సృష్టికి మూల విరాట్టుగా భావించే బ్రహ్మ తన కుమారుడైన నారదునికి శ్రీమద్రామాయణ కథ మొత్తాన్ని చెప్పాడు. కొడుకు అయిన కపిలుడు తన తల్లి అయిన దేవహుతికి సాంఖ్య యోగాన్ని వివరించాడు. భర్త అయిన శంకరుడు తన భార్య అయిన పార్వతీదేవికి వేదాంత రహస్యం చెప్పాడు.
బావ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన బావమరిది అయిన అర్జునునికి గీత సారాంశం మొత్తం చెప్పాడు. మరణానికి భయపడని శుకుడు మరణభయంతో ఉన్నటువంటి పరీక్షిత్తునికి ఆధ్యాత్మ విద్యను వివరించాడు.
అలాగే, జగద్గురువైన నారాయణుడు తన శిష్యులైన సన్యాసులందరికీ మోక్షవిద్యను చెప్పాడు. తనకొక్కనికే చెప్పిన మంత్రాన్ని రామానుజుల వారు.. వినబడేంత దూరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వినిపించేలా ఆ మంత్రాన్ని చెప్పాడు. ఇక్కడ వీరు.. వారు అనే తేడాలేకుండా తమకు తెలిసిన విద్యను శిష్యులుగా భావించిన వారికి తెలియజెప్పారు.