శరీరంపై వ్యామోహం.. అజ్ఞానమే మోహానికి కారణమా?
ఈ జగత్తంతా పంచభూతాలలో ఏర్పడింది. పంచభూతాలుగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదింటి చేతనే విశ్వమంతా నిర్మింపబడింది. కుమ్మరివాసి వద్ద కుండలు, ముంతలు, చట్లు, బానలు మొదలైనవి ఉన్నప్పటికీ అవన్నీ మట్టి రూపాంతరాలే అవుతాయి.
అట్లే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోట్ల యొక్క భౌతిక స్వరూపాలను పంచభూతాలతోనే నిర్మించియున్నాడు. కనుకనే ప్రపంచంలోని ఏ వస్తువును విడదీసినా పంచభూతాలే కనబడతాయి. ప్రతి వస్తువు, ప్రతి శరీరము పృథివి జలాదులను పంచభూతాలతోనే ఏర్పడుటను బట్టి వాటిలో ఆసక్తిని రేకెత్తించే విషయము ఏమున్నది ఈ సత్యం తెలిస్తే ఇక మానవుడు విషయ భోగాల పైకి పరిగెత్తడు.
దృష్టాంతానికి మానవ శరీరం పెక్కు అందచందాలతో కూడియున్నప్పటికీ అది మట్టి, నిప్పు, నీళ్ళు మున్నగువానితో ఏర్పడింది కాబట్టి ఇక అట్టి శరీరంపై వ్యామోహం ఎందుకు కలుగుతుంది. అజ్ఞానమే మోహానికి కారణం.
జ్ఞానం కలవాడికి ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకంగానే కనిపిస్తుంది. కనుకనే అతనికి విషయాదులపై ఆసక్తి యుండదు. సత్యాన్ని గుర్తించబడటం బట్టి దృశ్య విషయాలపైకి అతడు పరుగిడడు.
ప్రపంచంలో ఎక్కడ వెతికినా, ఏలోకానికి వెళ్ళినా నిప్పు, నీళ్ళు, మట్టి, గాలి, ఆకాశం తప్ప ఆరవ వస్తువు ఏదీ లేదు. జగత్తులో ఎక్కడ చూచినా, వెతికినా పంచభూతాలు తప్ప ఆరవ మహాభూతంలేదు.
కనుకనే జ్ఞాని విషయాసక్తరహితుడై దృశ్యభోగాలవైపు పరుగిడక. దృష్టిని ఆత్మవైపుకు మరల్చి అదియే సారభూతమైందని గ్రహించి దాన్నే సేవిస్తూంటాడు. ధ్యానిస్తూంటాడు.
కాబట్టి జిజ్ఞాసులు, జన్మను తరింపజేసుకొనువారు పంచభూతమయము లందు విరక్తి కలిగి, ఆత్మ యందు అనురక్తి కలిగి, స్వస్వరూప సాక్షాత్కరానికి తీవ్రతర కృషి సలపాలి.