బ్రహ్మచారిణి దేవి
నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి గా పూజిస్తారు. అమ్మవారు బాల్యావస్థలో శైలపుత్రి గా, యవ్వనంలో బ్రహ్మచారిణి గా, గృహస్థాశ్రమంలో చంద్రఘంట గా వివిధ రూపాలలో దర్శనమిస్తుంది. అమ్మవారి ప్రతి అవతారం స్త్రీ యొక్క వివిధ దశలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
శైలపుత్రి గా జన్మించిన తర్వాత అమ్మవారు శివుని వివాహం చేసుకోవడానికి కఠోర తపస్సు చేసిన విషయం ఇంతకు ముందే చెప్పుకున్నాం.
ఒకసారి హిమవంతుడు తమ నివాసానికి దగ్గరలో, తపస్సులో ఉన్న ఒక తపస్విని, అతని తేజస్సును చూసి ఆ తపస్వికి శుశ్రూష చేయడానికి తన కుమార్తెను పంపుతాడు. శైలపుత్రి ఎంతో భక్తి శ్రద్ధలతో అలసట అనే మాట లేకుండా తపస్వికి శుశ్రూష చేస్తుంది. ప్రసన్నుడైన తపస్వి ఏమి కావాలో కోరుకోమంటాడు. తనకు శివుడు తో వివాహం జరిగేలా వరమివ్వమని కోరుకుంటుంది. శివుణ్ని వివాహం చేసుకోవడం సాధారణ విషయం కాదని దానికి కఠోర తపస్సు చేయవలసి ఉంటుందని అమ్మవారికి దిశానిర్దేశం చేస్తాడు.
శైలిపుత్రి తన చెలికత్తెలు జయ విజయ లతో కలిసి తల్లిదండ్రుల ఆజ్ఞ తీసుకొని తపో భూములకు వెళ్తుంది. మొదటి కొన్ని సంవత్సరాలు ఒక్క పూట భోజనం చేస్తూ తపస్సు చేస్తుంది, తర్వాత పండ్లు తీసుకుంటూ మరికొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది . ఆ పై కేవలం ఆకులు మాత్రమే తీసుకుని మరి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆపై ఆకులు కూడా మానేసి ఘోరమైన తపస్సు మొదలు పెడుతుంది. కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ పంచాగ్ని లో మరి కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఆపై శ్వాస కూడా బంధించి చాలా సంవత్సరాలు శివుని కోసం కఠోరమైన తపస్సు చేస్తుంది.
అమ్మ ను పరీక్షించదలచి, శివుడు సాధువు వేషం ధరించి అమ్మ తపస్సు చేసుకునే ప్రాంతం చేరుకుని, శివనింద చేస్తూ, అమ్మవారితో ఇలా అంటాడు – “ఏం చూసి అతన్ని పెళ్లి చేసుకుంటావు, బస్మం ధరిస్తాడు, చర్మం కట్టుకుంటాడు, నాగులను అభరణాలగా ఒంటికి చుట్టుకుంటాడు, బంధుమిత్రులు ఎవరా అంటే? అఘోరాలు, భూత గణాలు, ప్రేతాలు! నివాసమైనా ఉందా అంటే స్మశానంలో నివసిస్తాడు. అలాంటి వారిని పెళ్లి చేసుకుని ఎక్కడ నివాసం ఉంటావు” అని భయపెట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అప్పుడు అమ్మ, శివుని విరాట్ స్వరూపం స్తుతి చేస్తూ ఆ సాధువు ని అక్కడ నుంచి వెళ్ళిపొమ్మని శాసిస్తుంది. శివుడు ఎంతో సంతోషించి తన నిజరూపంతో దర్శనమిచ్చి వరం కోరుకోమంటాడు. అప్పుడు అమ్మ తనను వివాహం చేసుకోమని అదే తనకు ఇచ్చే వరమని, శివుడుని ప్రార్థిస్తుంది. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి తప్పక వివాహం చేసుకోగలను అని శివుడు వరమిస్తాడు . అమ్మ సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వస్తుంది.
బ్రహ్మ అనగా తపస్సు, చారినీ అనగా ఆచరించేది అని అర్థం. రాజ్య సుఖాలను త్యాగం చేసి, శివుని గురించి ఘోర తపస్సు ఆచరిస్తుంది కనుక అమ్మను బ్రహ్మచారిణి గా పిలుస్తారు. ఆకులు కూడా మానేసి తపస్సు చేసింది కనుక అపర్ణగా కూడా పిలువబడుతుంది.
ఓసారి కుమార్తెను చూడడానికి వచ్చిన మైనాదేవి, క్రుశించిన కూతురిని చూసి “వు“, “మా” అంది.
వు అంటే వద్దు , మా అంటే తల్లి అని అర్థం. ఇంత కఠోరమైన తపస్సు చేయకు తల్లీ అని బాధపడింది. ఉ, మా కలిసి ఉమాదేవిగా కూడా పిలవబడుతుంది.
బ్రహ్మచారిణి దేవి ఉపాసన వల్ల సాధకులకు రెండవ చక్రమైన స్వాధిష్టాన చక్రం ఉత్తేజితం అవుతుంది. బ్రహ్మచారిణి దేవి ఉపాసనతో సాధకులలో త్యాగం ,వైరాగ్యం ,సదాచారం సంయమనం వృద్ధిచెందుతాయి.
బ్రహ్మచారిణి దేవి ఆలయం వారణాసి లో దుర్గా ఘాట్ లో ఉంది. ఈ అవతారంలో అమ్మవారి కుడిచేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది. ఈ స్వరూపంలో అమ్మవారిని పూజించే భక్తులకు జీవితంలో వచ్చే ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోగల మనోబలాన్నీ, శక్తిని ప్రసాదిస్తుంది.
అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ శ్లోకాన్ని భక్తులు పఠిస్తారు.
యా దేవీ సర్వభూతేషు మాఁ బ్రహ్మచారిణీ రూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:।।
దధానా కర పద్మాభ్యామ అక్షమాలా కమణ్డలూ।
దేవీ ప్రసీదతు మఈ బ్రహ్మచారిణ్యనుత్తమా।।
ఓం దేవీ బ్రహ్మచారిణ్యై నమః॥
ధ్యాన మంత్రము:
వన్దే వాఞ్ఛితలాభాయ చన్ద్రార్ధకృతశేఖరామ్।
జపమాలా కమణ్డలు ధరా బ్రహ్మచారిణీ శుభామ్॥
గౌరవర్ణా స్వాధిష్ఠానస్థితా ద్వితీయ దుర్గా త్రినేత్రామ్।
ధవల పరిధానా బ్రహ్మరూపా పుష్పాలఙ్కార భూషితామ్॥
పరమ వన్దనా పల్లవాధరాం కాన్త కపోలా పీన।
పయోధరామ్ కమనీయా లావణయం స్మేరముఖీ నిమ్ననాభి నితమ్బనీమ్॥
స్తోత్రం:
తపశ్చారిణీ త్వంహి తాపత్రయ నివారణీమ్।
బ్రహ్మరూపధరా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహమ్॥
శఙ్కరప్రియా త్వంహి భుక్తి-ముక్తి దాయినీ।
శాన్తిదా జ్ఞానదా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహమ్॥
కవచం:
త్రిపురా మేం హృదయమ్ పాతు లలాటే పాతు శఙ్కరభామినీ।
అర్పణ సదాపాతు నేత్రో, అర్ధరీ చ కపోలో॥
పఞ్చదశీ కణ్ఠే పాతు మధ్యదేశే పాతు మహేశ్వరీ॥
షోడశీ సదాపాతు నాభో గృహో చ పాదయో।
అఙ్గ ప్రత్యఙ్గ సతత పాతు బ్రహ్మచారిణీ॥
***
*** శ్రీ మాత్రే నమః ***