అయ్యప్పస్వామి స్వరూపాలు
శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి విభూషణం స్వామి సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే
నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమమూ ఉంటుంది. తలపై ధరించే చంద్రునిముడిలో శంకరునికి సంబంధించిన మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది.
పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.
అయ్యప్ప దర్శనానికి 40 రోజులు దీక్షను పాటిస్తారు. మన శారీరక, మానసిక వ్యవస్థ భక్తితో చైతన్యం కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. మంత్ర, దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది.
అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్లు గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (13), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది దివి నుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ, భేరి, కాహళ, దుందుభి, తుంబురు, మర్దల, వీణ, వేణు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జజ్జరి, జంత్ర, అనే 18 వాయిద్యాలను మ్రోగించారు.