యుద్ధకాండము
లంకకు దారి ఇవ్వవలసిందిగా సముద్రునిపై కోపిస్తున్న రాముడు
హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు "ఇంతటి క్లిష్టకార్యమును మరెవ్వరు సాధింపలేరు. మా అందరి ప్రాణములను నిలిపిన ఆప్తుడవు నీవు. నీవంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటె నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను" అని హనుమను కౌగిలించుకొనెను . తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయము చూసి, నీలుని నాయకత్వములో బ్రహ్మాండమైన కపిసేన దక్షిణమునకు పయనమై సాగరతీరము చేరుకొన్నది.
అక్కడ లంకలో రావణుడు యుద్ధము విషయమై తనవారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి, సాగరముదాటి, రాముని శరణు జొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయమిచ్చి, కానున్న లంకాధిపతిగా సాగరజలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తికాగా, వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉంది.
రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానర సేనా, రామలక్ష్మణులూ అజేయులు, అసమానులు. కనుక యుద్ధం వినాశనహేతువని కొందరు హెచ్చరించారు. కాని ప్రహస్తుని నాయకత్వములోని రావణ సేనాబలం పరాజయం ఎరుగనిది. ముఖ్యంగా ప్రహస్తుడూ, ఇంద్రజిత్తూ, నికుంభుడూ - వీరిలో ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతేర్చగలరనీ, కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడూ, తనూ యుద్ధానికి రావలసిన అవుసరమే రాదనీ రావణుడి విశ్వాసం.
వానర సైనికులతో పోరాడుతున్న అతికాయుడు
ఇరు పక్షాలవారూ వ్యూహాలు సన్నద్ధం చేసుకొన్నారు. చిట్టచివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది.
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయద్ధంతో భునభోంతరాళాలు కంపిస్తున్నాయి. వానరులచేతిలో రాక్షసవీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంతా విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగబంధాలనుండి విముక్తులను చేశాడు.
మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడూ, అంగదుని చేత వజ్రదంష్ట్రుడూ, నీలునిచేత ప్రహస్తుడూ హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షసగణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడు.అప్పుడు జరిగిన భీకరసంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనుసు చేజారింది. విశ్రాంతి తీసికొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు.
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణునిబాణాలు కుంభకర్ణుని నిలువరించాయు. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులనూ, ఊరువులనూ ఖండించగా వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రక్షసులు కూడా నశించారు.
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు, మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకొన్న జాంబవంతుడు హిమవత్పర్వతాలలో నున్న ఓషధులు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతసమేతంగా ఓషధులను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి, మరల పర్వతాన్ని యధాస్థానంలో ఉంచి వచ్చాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిలా యజ్ఙం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదము పొంది, హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి, యజ్ఙాన్ని భంగం చేసి యద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఐంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది.
రామ రావణ యుద్ధము
ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్రశరధాటికివానర సైన్యము ఛిన్నాభిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు.. అప్పుడు రాముడు తనవారిన ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను" అన్నాడు. రామ రావణ సంగ్రామం ప్రళయకాలాగ్నివలే చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఓషధులను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, "అన్నా! ఈ సాయంసంధ్యలో రావణుడు కడతేరాలి అన్నాడు".
రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు అగస్త్యుడు "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు. రాముడు దానిని మూడు మార్లు జపించాడు. రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింపసాగారు. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. రావణుని తలలు తెగి పడుతున్నా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.
రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు.
అనంతరం సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది.
పట్టాభిషిక్తులైన సీతారాములు, పరిజనసమేతంగా - జీలకర్రగూడెం గ్రామం ఆలయంలో శిల్పం