Type Here to Get Search Results !

త్రినాధ వ్రతకల్పము - Trinadha Vratakalpam

 

త్రినాధ వ్రతకల్పము



భూశుద్ది 

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ద చేసి, అలికి, బియ్యపు పిండితో గాని, రంగుల చూర్ణ ములతో గాని, ముగ్గులు పెట్టి, దైవ స్థాపన నిమిత్త మై ఒక పీటను వేయాలి. పీట మరీ ఎత్తుగా గాని, మరీ పల్లముగా గానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి, కుంకుమతో బొట్టుపెట్టి, వరి పిండి  (బియ్యపు పిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్ర పటమును గాని ఆ పీట పై ఉంచాలి.

ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి ( పసుపును షుమారు అంగుళం సైజులో త్రికొణ ఆకృతిలో ముద్దగా చేసి) దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్ళెంలో గాని, క్రొత్త తుండుగుడ్డ మీదగాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి, అందు పసుపు గణపతి నుంచి అగరు వత్తులు వెలిగించాలి. ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకొవాలి. పారాధన నైఋతి దిశలో చేయవలెను.


దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము

దీపారాధన చెయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని వాడ వచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి ( మధ్యలో) వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డ వత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు) వేసి ముందుగా ఏక హారతిలొ వేసిన వత్తిని అగ్గి పుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డ వత్తి 1 కుంభ వత్తి వెలిగించ వలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను. దీపారాధనకు నువ్వుల నూనెగాని, కొబ్బరి నూనెగాని, ఆవు నెయ్యిగాని వాడ వచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి ఘంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.


ఘంటానాదము

శ్లో ||  ఆగ మార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్ష సామ్

  కుర్యాద్ఘంటార వంతత్ర దేవతా హ్వాహన లాంఛ నమ్

మనము ఆచ మనము చేసినటువంటి పంచ పాత్ర లోని నీళ్లు దేవుని పూజకు విని యోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసుగాని, చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును చెంబునకు కలశారాధన  చేసి ఆ నీళ్లు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.


పూజకు కావలసిన వస్తువులు

తులసీ సహిత విష్ణువు (ఏ వ్రతమును (పూజను) ఆచరించుచున్నామో ఆ దేవుని  యొక్క బొమ్మ( ప్రతిమ ) ( తమ శక్తి కొలది బంగారముతో నైనను, వెండితో నైనను లేక మట్టితో నైనను తిసుకొన వలెను), లేదా చిత్ర పటము, మండపమునకు మామిడి ఆకులు, అరటి మొక్కలు, కొబ్బరి కాయలు, పళ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షింతలు, అగ్గి పెట్టె, అగరు వత్తులు, వస్త్ర, యజ్ఞో పవితములు, తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు)  ప్రత్యేక నివేదన(పిండి వంటలు)


పిమ్మట యజమానులు (పూజ చేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.

1. " ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.

2. " ఓం నారాయణాయ స్వాహా " అనుకుని ఒక సారి

3. " ఓం మాధ వాయ స్వాహా " అనుకుని ఒక సారి జలమును పుచ్చు కోవలెను. తరువాత

4. " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగుకోవాలి.

5. " ఓం విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు, బొటన వ్రేళ్ల తో కళ్లు తుడుచుకోవాలి.

6. " ఓం మధు సూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురు కోవాలి.

7. " ఓం త్రివిక్ర మాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి.

8. " ఓం వామనాయ నమః" 

9. " ఓం శ్రీధ రాయ నమః" ఈ రెండు నామాలు స్మరిస్తూ తల పై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.

10. " ఓం హృషీకేశాయ నమః" ఎడమ చేతితో నీళ్లు చల్లాలి.

11. " ఓం పద్మనాభాయ నమః" పాదాల పై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.

12. " ఓం దామోద రాయ నమః" శిరస్సు పై జలమును ప్రోక్షించుకోవలెను.

13. " ఓం సంకర్షణాయ నమః" చేతి వ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.

14. " ఓం వాసుదేవాయ నమః" వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.

15. " ఓం ప్రద్యుమ్నాయ నమః"

16. " ఓం అనిరుద్దాయ నమః" నేత్రాలు తాకవలెను.

17. " ఓం పురుషోత్తమాయ నమః 

18. " ఓం అధోక్షజాయ నమః" రెండు చెవులూ తాకవలెను.

19. " ఓం నారసింహాయ నమః 

20. " ఓం అచ్యుతాయ నమః" బొడ్డును స్పృశించవలెను.

21. " ఓం జనార్ద నాయ నమః" చేతివ్రేళ్ల తో వక్ష స్థలం, హృదయం తాకవలెను.

22. " ఓం ఉపేంద్రాయ నమః" చేతి కొన తో శిరస్సు తాక వలెను.

23. " ఓం హరయే నమః

24. " ఓం కృష్ణాయ నమః" కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపుర మును కుడి చెతితోను తాకవలెను.

ఆచ మనము వెంటనే సంకల్పము చెప్పుకోవలెను.

ఆచ మనము అయిన తరువాత, కొంచెం నీరు చేతిలో పోసుకుని నేల పై చిలకరించుతూ ఈ శ్లోకము పటించవలెను.

శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః

యేతే షామవిరో ధేన బ్రహ్మకర్మ సమారభే ||


ప్రాణాయామమ్య 

ఓం భూ: - ఓం భువః ఓం సువః - ఓం మహః - ఓం జనః ఓం తపః - ఓగ్o సత్యం - ఓం తత్ సవితుర్వ రేణ్యం భర్గో దెవస్య ధీమ హీధ యోయోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భు వస్సువరోం అని సంకల్పము చెప్పుకొనవలెను.


సంకల్పము 

మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే

ఆద్య బ్రహ్మణః (ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూ ద్వీపేభరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీ శైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీ శైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా గోదార్యో: మధ్య ప్రదేశే (మనం ఏఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొన వలెను), శోభన గృహే ( అద్దె ఇల్లు అయినచో వసతి గృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిధౌ ఆస్మిన్ వర్త మానే వ్యావ హారిక చాంద్ర మానేన సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను), అయనే, ( సంవత్సరమునకు రెండు అయనములు - ఉత్త రాయణము, దక్షిణాయనము. జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణం వరకు దక్షిణాయనం. పూజచేయునపుడు ఏ అయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను) ఋతు:, ( వసంత, గ్రీష్మ, వర్ష మొ|| ఋతువులలో పూజ సమయములో జరుగుచున్న మాసం పేరు) పక్షే, (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము, అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు) తిధౌ, ( ఆరోజు తిధి) వాసరే (ఆరోజు ఏ వార మనదీ చెప్పుకొని) శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురి తక్షయ ద్వారా శ్రీరామా ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్.... గోత్రస్య..... నామధేయః, శ్రీ మత్యః, గోత్రస్య, నామధేయస్య అనియు, స్త్రీ లైనచో శ్రీమతి, గోత్రవతి, నామధేయవతి, శ్రీ మత్యాః, గోత్ర వత్యాః, నామధేయవత్యాః అనియు ( పూజ చేయువారి గోత్రము, నామము చెప్పి) నామధేయస్యః దర్మ పత్నీ సమేతస్య ( పురుషులైనచో) మమ సహ కుటుంబస్య, క్షేమ స్థ్యైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం, పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్ధం సకలవిధ మనోవాంఛాఫల సిద్ద్యర్ధం, శ్రీరామ ముద్దశ్య శ్రీరామ ప్రీత్యర్ధం( ఏ దేవుని పూజించుచున్నాయో ఆ దేవునియొక్క పేరు చెప్పుకొని) సంభవద్భి రుపచారై: సంభవతానియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ( నాకు తోచిన రీతిలో, నాకు తోచిన విధముగా, భక్తి శ్రద్దలతో సమర్పించుకొంటున్న పూజ) ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తధంగ కలశ పూజాం కరిష్యే || పిద పకలశారాధ నను చెయవలెను.


కలశ పూజను గూర్చిన వివరణ 

వెండి, రాగి, లేక కంచు గ్లా సులు( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ద జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షింతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలువ గైరాబొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలెను.

మం || కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః

     మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యే మాతృ గణాస్మృతాః||

     ఋగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః   

     అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః    

శ్లో ||   గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ,

     నర్మదా సింధు కావేరౌయో జలే స్మిన్ సన్నిధంకురు ||

ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసి సహిత విష్ణు( ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం మమ దురితక్షయకార కాః కలశో దకేన ఓం దేవం సం ప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి) ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తన పై చల్లు కోవాలి) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజాద్రవ్యములు పై కూడా చల్లాలి)  కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని, ఆకుతో గానీ చల్లాలి.


మార్జనము

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా

యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:||  

అని పిద పకాసిని అక్షతలు, పసుపు, గణపతి పై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ ప్రతిష్టా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

 ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే ||

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

 లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

 ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః

 వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః

 షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి

 విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా

 సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||

పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచార ములనగా ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం,  ప్రదక్షిణములు మొదలగునవి. పిదప షోడశో పచార పూజను చేయవలెను. షోడశో పచారములనగా ధ్యాన, ఆవాహన, ఆసనం, ఆర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞో పవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం,  ప్రదక్షిణములు మొదలగునవి.    


షోడశో పచార పూజాప్రారంభః

ధ్యానం

శ్లో || ఓం శ్రీ త్రినాధ  నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి

  అని త్రినాధుని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

ఆవాహనం

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః ఆవాహయామి. ఆవా హనార్ధం అక్షతాం సమర్పయామి.

    అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవుని పై వేయవలెను.

ఆసనం

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

    సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి. దేవుడు కూర్చుండుట కై మంచి బంగరుపీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.


అర్ఘ్యం

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.

దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ, ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.


పాద్యం                       

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః పాదౌ: పాద్యం సమర్పయామి.

దేవుడు కాళ్లు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

ఆచమనీయం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః ఆచమనీయం సమర్పయామి.

   అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతొ ఒక మారు నీరు వదలవలెను.  

  

సూచన

అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పల్లెము) లో వదలరాదు.


మధుపర్కం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః  మధుపర్కం  సమర్పయామి.

    అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ , ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు )


పంచామృత స్నానం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః  పంచామృత స్నానం: సమర్పయామి.

    అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి ,ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.


శుద్దోదక స్నానం

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః  శుద్దోదక స్నానం సమర్పయామి .

    పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను .


వస్త్ర యుగ్మం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః  వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.


యజ్ఞోపవీతం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః  ఉపవీతం సమర్పయామి

    అనగా జందెమును ఇవ్వవలెను ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.


గంధం 

శ్లో || ఓం త్రినాధ నమః గంధాన్ సమర్పయామి.

   ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.


ఆభరణం 

శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే |

    భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||

   ఓం శ్రీ త్రినాధ నమః  ఆభరణాన్ సమర్పయామి

  అని స్వామికి మనము చేయించిన ఆభరణములను అలంకరించవలెను లేనిచో అలంకరణార్ధం అక్షతాన్ సమర్పయామి అని అక్షతలు స్వామిపై వేసి ఆభరణాన్ సమర్పయామి అని నమస్కరించవలెను.


అక్షతలు

శ్లో ||  ఓం శ్రీ త్రినాధ నమః అక్ష తాన్ సమర్పయామి.

( అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపువేసి కలుపవలెను) అక్షతలు తీసుకొని స్వామివారి ప్రతిమ పై చల్లవలెను.


పుష్ప సమర్పణ 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః పుష్పాణి సమర్పయామి.

   స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పువ్వులను స్వామి పై వేసి నమస్కరించవలెను.  

పిదప అధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.


తరువాత అష్టోత్తర శతనామావళి పూజ. దీనియందు 108 మంత్ర ములుండును. ఈ మంత్రంములును చదువుచు పుష్పములతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.


  1. ఓం భూతాత్మనే నమః

  2. ఓం అవ్యయాయ నమః

  3. ఓం పురుషాయ నమః

  4. ఓం పరమాత్మాయ నమః

  5. ఓం బలాయ నమః

  6. ఓం భూతకృతే నమః

  7. ఓం శర్వాయ నమః

  8. ఓం ముకుందాయ నమః

  9. ఓం అమేయాత్మనే నమః

  10. ఓం శుభ ప్రదాయ నమః || 10 ||

  11. ఓం కృతయే నమః

  12. ఓం పాపనాశాయ నమః

  13. ఓం తేజసే నమః

  14. ఓం గణపతయే నమః

  15. ఓం యోగాయ నమః

  16. ఓం దీర్ఘాయ నమః

  17. ఓం సుతీర్ధాయ నమః

  18. ఓం విఘ్నే నమః

  19. ఓం ప్రాణదాయ నమః

  20. ఓం మధువే నమః || 20 ||  

  21. ఓం పునర్వసవే నమః

  22. ఓం మాధ వాయ నమః

  23. ఓం మహా దేవాయ నమః

  24. ఓం సిద్ధయే నమః

  25. ఓం శ్రీబలాయ నమః

  26. ఓం నవ నాయకాయ నమః

  27. ఓం హంసాయ నమః

  28. ఓం బలినే నమః

  29. ఓం బలాయ నమః

  30. ఓం అనంద దాయ నమః || 30 ||   

  31. ఓం గురవే నమః

  32. ఓం ఆగ మాయ నమః

  33. ఓం అనలాయ నమః

  34. ఓం బుద్దవే నమః

  35. ఓం పద్మనాభాయ నమః

  36. ఓం సుఫలాయ నమః

  37. ఓం జ్ఞానదాయ నమః

  38. ఓం జ్ఞానినే నమః

  39. ఓం శశిబింద్వాయ నమః

  40. ఓం పవనాయ నమః || 40 ||

  41. ఓం ఖగాయ నమః

  42. ఓం సర్వవ్యాపినే నమః

  43. ఓం రామాయ నమః

  44. ఓం నిధయే నమః

  45. ఓం సూర్యాయ నమః

  46. ఓం ధన్వినే నమః

  47. ఓం అనాది నిధనాయ నమః

  48. ఓం పవిత్రాయ నమః

  49. ఓం అణి మాయ నమః

  50. ఓం పవిత్రే నమః || 50 ||

  51. ఓం విక్రమాయ నమః

  52. ఓం కాంతాయ నమః

  53. ఓం మహేశాయ నమః

  54. ఓం దేవాయ నమః

  55. ఓం అనంతాయ నమః

  56. ఓం మృదవే నమః

  57. ఓం అక్షమాయ నమః

  58. ఓం తారాయ నమః

  59. ఓం హంసాయ నమః

  60. ఓం వీరాయ నమః || 60 ||    

  61. ఓం ఆది దేవాయ నమః

  62. ఓం సులభాయ నమః

  63. ఓం తారకాయ నమః

  64. ఓం భాగ్యదాయ నమః

  65. ఓం ఆధారాయ నమః

  66. ఓం శూరాయ నమః

  67. ఓం శౌర్యాయ నమః

  68. ఓం అనిలాయ నమః

  69. ఓం శంభవే నమః

  70. ఓం సుకృతినే నమః || 70 ||

  71. ఓం తపసేన నమః

  72. ఓం భీమాయ నమః

  73. ఓం గదాయ నమః

  74. ఓం కపిలాయ నమః

  75. ఓం లోహితాయ నమః

  76. ఓం సమాయ నమః

  77. ఓం అజాయ నమః

  78. ఓం పసవే నమః

  79. ఓం విషమాయ నమః

  80. ఓం మాయాయ నమః || 80 ||

  81. ఓం కవయే నమః

  82. ఓం వేదాంగాయ నమః

  83. ఓం వామనాయ నమః

  84. ఓం విశ్వతేజాయ నమః

  85. ఓం వేద్యాయ నమః

  86. ఓం సంహారాయ నమః

  87. ఓం దమనాయ నమః

  88. ఓం దుష్ట ధ్వంసాయ నమః

  89. ఓం బంధకాయ నమః

  90. ఓం మూలాధారాయ నమః || 90 ||

  91. ఓం అజాయ నమః

  92. ఓం అజితాయ నమః

  93. ఓం ఈశానాయ నమః

  94. ఓం బలవతే నమః

  95. ఓం మహాదేవాయ నమః

  96. ఓం సుఖదాయ నమః

  97. ఓం పరాత్పరాయ నమః

  98. ఓం క్రూరనాశినే నమః

  99. ఓం భోగాయ నమః

  100. ఓం శుభ సంధాయ నమః || 100|| 

  101. ఓం పరాక్ర మాయ నమః

  102. ఓం సతీశాయ నమః

  103. ఓం సత్ఫలాయ నమః

  104. ఓం దేవ దేవాయ నమః

  105. ఓం బ్రహ్మాయ నమః

  106. ఓం విష్ణవే నమః

  107. ఓం మహేశ్వరాయ నమః 

  108. ఓం త్రిమూర్తి స్వరూప నమః|| 108|| 

ఓం శ్రీ త్రినాధ దేవాయ నమః పిదప  అగరువత్తిని వెలిగించి


ధూపం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః ధూపమాఘ్రాపయామి.

    ధూపం సమర్పయామి. అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.  

దీపం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః సాక్షాత్ దీపం దర్శయామి

    అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపు వత్తులతో ఒక దానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదవవలెను.


నైవేద్యం

శ్లో || ఓం శ్రీ త్రినాధ నైవేద్యం సమర్పయామి

అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరి కాయ మొదలగునవి ఒక పల్లెములోనికి తీసుకొని స్వామివద్ద నుంచి దాని పై పువ్వుతో నీళ్లు చల్లుతూ ఎడమ చేత్తో గంటవాయిస్తూ ' ఓం భూర్భువస్సువః ఓం తత్ స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరి షించామి,( ఋతంత్వా సత్యేత పరి షించామి అని రాత్రి చెప్పవలెను) అమృత మస్తు అమృతో పస్త రణమసి, ఓం ప్రాణాయ స్వాహా, మధ్యే మధ్యే

పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరిణెతో) స్వామికి నివేదనం చుపించాలి. పిదప ఓం తులసీ సహిత విష్ణు నమః  నైవేద్యానంతరం ' హస్తౌ ప్రక్షాళ యామి' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్యపాత్ర ( పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర ) లో వదలాలి. తరువాత ' పాదౌప్రక్షాళ యామి' అని మరో సారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి. పునః శుద్దాచ మనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి 


తాంబూలం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః తాంబూలం సమర్పయామి

అని చెబుతూ తాంబూలమును ( మూడు తమలపాకులు, రెండు పోక చెక్కలు, అరటి పండు వేసి) స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక  నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ, ' తాంబూల చరవణానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి


నీరాజనం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః కర్పూర నీరాజనం సమర్పయామి

అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి, మూడుమార్లు త్రిప్పుచూ, చిన్నగా ఘంట వాయించవలెను. అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ  ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచ మనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు, పువ్వులు, చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని


మంత్ర పుష్పం 

శ్లో || ఓం శ్రీ త్రినాధ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి

అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.


ప్రదక్షిణం

శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ,

  నమస్తే విఘ్న రాజాయ నమేస్తే విఘ్న నాశన ||

శ్లో || ప్రమధ గణ దేవేశ ప్రసిద్దే గణనాయక,

 ప్రదక్షిణం కరోమిత్వా మీశ పుత్ర నమోస్తుతే ||

శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ

 తానితాని ప్రణస్యంతి ప్రదక్షిణ పదే పదే ||

ఓం శ్రీ త్రినాధ నమః ఆత్మ ప్రదక్షిణ చేసి ( అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట సాష్టాంగ నమస్కారం చేసి ( మగ వారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి, ఆడువారు మోకాళ్ల పై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి ) తరువాత స్వామి పై చేతిలో నున్న అక్షతలు, పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసినులై నమస్కరించుచూ


పునః పూజ  

ఓం శ్రీ త్రినాధ నమః పునః పుజాంచ కరిష్యే

అని చెప్పుకొని, పంచపాత్ర లోని నీటిని చేతితో తాకి, అక్షతలు స్వామి పై చల్లుతూ ఈక్రింది మంత్రములు చదువుకొనవలెను.


విశేషో పచారములు

ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీజయామి, నృత్యం దర్శయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావ యామి, వాద్యం ఘోషయామి, సమస్త రాజో పచార, భక్త్యోపచార పూజాం సమర్పయామి అనుకొని, నమస్కరిస్తూ ఈక్రింది శ్లోకమును చదువుకొనవలెను.


పూజాఫల సమర్పణమ్

శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు

 యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్

 మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర

 యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ త్రినాధ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు.

ఏతత్ఫలం శ్రీ తులసీ సహిత విష్ణు: అర్పణమస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను. పిమ్మట శ్రీ త్రినాధ ప్రసాదం శిరసాగృహ్నామి' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.


ఓం శ్రీ త్రినాధ నమః యధాస్థానం ప్రవేశయామి.

శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

పూజా విధానం సంపూర్ణం.  


తీర్ధ ప్రాశ నమ్ 

శ్లో || అకాల మృత్యుహరణం సర్వ వ్యాధి నివారణమ్ |

  సమస్త పాపక్ష యకరం శ్రీ తులసీ సహిత విష్ణు పాదో దకం పావనం శుభమ్ ||

  అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడుమార్లు నోటి లోనికి తీసుకొనవలెను.


త్రినాధుని వ్రత కధా ప్రారంభము

మధుసూదనుని కధ

భక్తులారా ! మనస్సు నిర్మలంతో వినండి .ఈ త్రినాధుల చరిత్రము మాటి మాటికి వినుటకు అమృతమువలె నుండును. శ్రీ పురము అను గ్రామము నందు మధుసూదనుడను నొక బ్రాహ్మణు డుండెడివాడు.మిక్కిలి దరిద్రుదగుటచే బిక్ష మెత్తుకుని జీవించే వాడు. ఆ  బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించెను. తల్లికి పాలు చాలనందున అ బాలుని శరీరము దిన దినము కృశించు చున్నది . ఆ బాలుడు చిక్క పోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో నిట్లు పలికెను.

" అయ్యా ! నేను చెప్పెడి మాట శ్రద్దగా వినండి ,మన పిల్లవానికి పాలు నిమిత్తము పాలు గల ఆవు నొకటి తీసుకోండి " అని చెప్పగా ఆ మాట విని భర్త యేమని చెప్పు చున్నాడంటే 'ఓసీ ' నీకు వెర్రి పట్టినదా ? మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఏలాగున దొరుకుతుంది ? ధన రత్నములు మన వద్ద లేవు నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ? ఎవరికైతే ధన సంపదలు కలిగి యుండునో ,వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది . అట్టి వారికే లోకమంతా భయపడతారు. మనవంటి బీదవారిని ఎవరు అడగుతారు. అని బ్రాహ్మణుడు చెప్పెను. బార్య మిగుల దుఃఖించినదై ,ఓ బ్రహ్మ దేవుడా ! నీవు మా వంటి బీద వారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు ?ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ? ఈ శిశు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించు చుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియు తోచక ఆ బ్రాహ్మణుడు చింతా క్రాంతుడై విచారించి ,తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ,ఆ వచ్చిన సొమ్ము అయిదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్లి భార్య చేతికి ఇవ్వగా ,ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి , పెనిమిటిని చూచి అయ్యా ! ఈ సొమ్మును తీసుకు వెళ్లి పాలు ఇచ్చే ఆవును కొని తీసుకు రండని చెప్పినది.

అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకుని గ్రామ గ్రామము తిరిగెను .ఇట్లు తిరుగుచూ ,పెద్ద భాగ్య వంతుడగు షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను . ధన ధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరి సమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నియు పాలతో నిండి యున్నవి. దైవ ఘటన మాత్రం మరో విధముగా యున్నది . తన ఆవులలో 'భోదా ' అనే ఆవు ఉండెను .అది మిగుల దుష్ట బుడ్డి గలది .బైటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తిని వేస్తుంది .ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెద్ద వారి పొలంలోకి చొరబడి పండిన పంటను తిని వేయుచండెను . అది చూచి షావుకారు అతి కోపంతో యేమను చున్నాడంటే "ఇక దీని ముఖము చూడకూడదు .అవును ఇప్పుడే అమ్మివేస్తాను .ఇది 50 రూ || లు అయినప్పటికీ నాకు మంజూరు లేదు ఇప్పుడు బేరం వచ్చినచో ఐదు రూపాయలకే ఇచ్చి వేస్తాను " అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో యిట్లనెను. "షావుకారూ! వినండి 50 రూపాయలు ఖరీదు కల ఆవు అయినప్పటికీ అందువలన మీకు మంజూరు లేదు ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను ఆవూ దూడా రెండిటిని నాకు ఇప్పించండి " అని అనగానే " ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టినదా " అని షావుకారు అనెను. అంత బ్రాహ్మణుడు "మీరు షావుకార్లు అయి ఉన్నారు మీమాట మీరు నిలుపు కోండి మాట తప్పితే మీరు అసత్య వంతులవుతారు " అని అన్నాడు . ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని ,తన మదిలో విచారించి తెలియక అనివేసినాను .ఈ బ్రాహ్మణుడు ఎక్కడ నుండి వింటున్నాడో , ఈ ఆవును అతనికివ్వక పోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా ! అని బ్రాహ్మణుని చూచి చెయ్యి చాచినాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువ వలె సంతోష పడెను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది .ఇట్లు కొన్ని దినములు గడచిన తరువాత ఆవు ఎటు పోయినదో కనిపించ లేదు .ప్రొద్దు పోయెడి వేళయినది ఆవు రాకపోవడము చూచి బ్రాహ్మణుడు వెదక బోయినాడు .వీధుల్లోనూ ,సమీపమున ఉన్న వ్యవసాయ భూముల్లోను చూచెను . ఆవు కనిపించ లేదు .తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెదుకుటకై బయలుదేరి కొంత దూరము నడచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూచినాడు.

మధు సూదనునకు త్రినాధ దేవులు దర్శన మిచ్చుట :

అది ఒక గొప్ప మర్రి చెట్టు, పైన ముగ్గురు మనుష్యులు కూర్చుని వున్నారు .వారు వరుసగా బ్రహ్మ, విష్ణు ,మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకుని ,లేచి పోవుచుండగా ,త్రిమూర్తులు బ్రాహ్మణునితో ' ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది ? నీవు ఎక్కడికి వెళ్లుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పు " మనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి "అయ్యా !నేను కడు బీదవాడను బిక్ష మెత్తుకుని బ్రతికే వాడను నాకు ఒక ఆవు ఉన్నది .అది కనిపించట్లేదు ఈ దినము శ్రీ పురము సంత అగుచున్నది .ఆ సంతకు వెళ్లి వెతికెదను .ఎవరైనా దొంగిలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంత లోనే అమ్ముతారు గదా ! త్రినాధ స్వాములారా ! ఈ ఉద్దేశ్యముతోనే నేను వెతుక్కుంటూ వెళ్ళుచున్నాను ."అని తన సంగతి చెప్పెను.

అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు యేమి చెప్పుచున్నారంటే " నీ వేలాగూ సంతకు వెళ్లుచున్నావు కనుక ,మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకురావలెను అని త్రిమూర్తులు అన్నారు . అంత బ్రాహ్మణుడు " యేమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు యిట్లనిరి .ఒక్క పైసా ఆకు చెక్క ,ఒక్క పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పిరి .ఆ మాటలు విని బ్రాహ్మణుడు యేమని చెప్పు చున్నాడంటే " ఓ త్రిమూర్తులారా ! నాకు పైసాలు ఎక్కడ దొరుకును ? నేను బీదవాడను గదా ? బిక్ష మెత్తుకుని జీవించు చున్నాను "అని అనగా ,త్రిమూర్తులు యేమి చెప్పు చున్నారంటే "ఓ బ్రాహ్మణుడా ! విను, అదిగో ఆ గోరంట పొద కనిపించు చున్నది కదా ! దాని మొదట మూడు పైసాలున్నవి " ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్లి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగే సరికి మూడు పైసాలు దొరికినవి .ఇంకా ఉండునేమో నని ఆ చెట్టు నింకను పైకి లాగు చుండెను అది చూచి త్రినాదులవారు " బ్రాహ్మణుడా !నీకు వెర్రి పుట్టినదా ? అందులో పైసలు ఇంకా లేవు ,ఎంత దొరికినదో అంతే యుండును " అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని ,అచ్చట నుండి వెళ్ళిపోయెను. కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చి ఆ చెట్టు క్రింద నిలిచి చేతులు జోడించగా త్రినాదులు ఇట్లు పలికిరి. "ఓ విప్రుడా ! తిరిగి ఎందుకొచ్చావు " అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగున తెస్తాను అని ప్రశ్నించగా నీపై మీద గావంచాలో తెమ్మని త్రినాదులన్నారు .అందులకా బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది ? మీరు జగత్కర్తలు ,నాతో కపటంగా చెబుతున్నారు అనగా "ఓయీ ! నీతో కపటంగా చెప్పలేదు .మమ్ము తలుచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీ పురం సంతలో ప్రవేశించి నాడు .వెళ్లి చూడగా ఆవు కనిపించ లేదు .త్రినాదుల కరుణచే పై పంచెలో నూనె నిలుచుట

ఆకులు వక్కలు ,గంజాయి తీసుకుని ,నూనె కోసం బజారుకెళ్ళి తెలికల వానితో "ఒక్క పైసా నూనె గావంచ లో పోయమన్నాడు అందులకా తెలికలవాడు ఆశ్చర్య పడి , " ఈ బ్రాహ్మణుడు పిచ్చి వాడు కాబోలని నూనేలేదు .అని చెప్పినాడు .అక్కడ నుండి వెళ్లి ఒక ముసలి తెలికలవానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు " దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడుగగా ఒక్క పైసా నూనె మాత్ర మిమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు " ఈ బ్రాహ్మణుడు వికారపు వాడు కాబోలు ! వీనిని మోసము చేసి పైసాలు తీసుకుంటాను " అని ఆలోచించి కొలత పాత్ర తిరగ వేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు . విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని అచట నుండి వెడలిపోయెను .

అంతియే ,తెలివి కలవాని కుండలో నూనె కొంచమైననూ లేకుండా పోయినది .అది చూచి తెలికలవాడు మూర్చపోయినాడు . తెలికల వాళ్ళందరూ పరిగెత్తు కొచ్చి ముసలివాని ముఖముపై నీళ్ళు చల్లి ,సేద తీర్చి కూర్చుండ బెట్టినారు. ఏమి చెప్పుదను ? ఎక్కడ నుంచో ఒక భ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడిట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు.ఆ విప్రుడు మా వద్దకు  వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపొయినాడు .ఈ లాగున అందరూ విచారించి పరుగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్లి ఇలా అన్నారు ."విప్రుడా ! విను మీరు నూనె కొన్నారు కదా ! అది కొలతకు తక్కువగా యున్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి " అన్నారు .మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈ సారి ,ముందు తెచ్చిన దుత్త తోనే చమురు సరిగా కొలవగా ఎప్పటివలెనే దుత్త భర్తీ  లయిపోయినది . అది చూచి ముసలి తెలికలవాని ఆనందము చెప్పనలవి కాపోయినది .విప్రుని గావంచాలో చమురు ఉంచినారు.అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి శలవు అడిగినాడు .

త్రినాధుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట

శలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే "ఓయీ ! నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది .ఒక మాట విను .నీవు త్రినాధుల సేవ చేసేదవేని నీ దరిద్రము పటా పంచలై అధిక సంపదలు కల్గునని త్రినాధులనగా అది విని "స్వామీ ! ఏ యేవస్తువులతో మిమ్ములను పూజ చేయవలెననగా త్రినాధులు ఇలాగన్నారు . 'ఓ ద్విజుడా ! వినుము. మా పూజకు అధిక ద్రవ్యము అక్కరలేదు కొంచెము తోనే త్రుప్తి పొందుదుము.ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలును. త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే . మాకు వీనితోనే మేళా చేయుము. మూడు మట్టి చిలుమల యందు గంజాయి నలిపి ,అందులో నిప్పుతో ధూపము వేయవలెను .దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి ,వత్తులు వేసి, ఆకుచెక్కలు జాగ్రత్త చేసి ఉంచి ,రాత్రి తొలి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్ధములను స్వాములకు సమర్పించవలెను. అలాగున చేసిన సకల పాపములు నివారించును. " అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను .చెట్టు మొదటనే పూజ ఆరంబించి ,గంజాయి ముందు తయారు పరచినాడు. అప్పుడు త్రిమూర్తులు "నీ గావంచా చెంగు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు చెప్పుచున్నాడు , నేను బీద బ్రాహ్మణుడను బిక్ష మెత్తుకుని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను. అన్న వస్త్రములకు బహు కష్ట పడుచున్నాను ,దీపము ముట్టించుటకు అగ్గి లేదు నాగావంచా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది .నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తుంటారు ఏ బుద్దితో పూజ చేస్తాను ? అని ఏవగించు కుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూచి త్రిమూర్తులు " ఓ ద్విజుడా ! మదిలో చింత పడకు .నీ ఆవు పెయ్యా దొరుకుతాయి . నీవు నీ కుటుంబము ,సౌఖ్యముగా ఉంటారు.వస్త్రములు కూడా దొరుకునని చెప్పినారు. అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి " స్వాములారా ! అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామి వారికి ఇస్తాను .

ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపము వెలిగించుటకు అగ్గి లేదే ! నేను ఏమి చేయగలను ? అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు "ఓ బ్రాహ్మణుడా ! నీ రెండు నేత్రములు మూసుకో " వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది .అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు . మేళా ఇచ్చి వేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి ,సాష్టాంగ దండ మొనరించినాడు .

త్రినాధులు బ్రాహ్మణుని అనుగ్రహించుట

త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి " త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను " అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది ,కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు . చేయ వలసిన కార్యక్రమముల నందరికీ విశదముగా తెలియ పరచినాడు .తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్దతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాధ పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను.దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు.అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు .

రాజు త్రినాధులను తూలనాడి మేళాను నిషేదించుట

వారిని చూచి రాజు " మీరందరూ యెందుకు వచ్చినారు ? అని అడుగగా " అయ్యా మాఫిర్యాదు మీరు వినవలయును మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు బిక్ష మెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు .త్రినాదులు యే దేవతలో ? వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి . ఊరిలో నున్న రైతులు యావన్మంది త్రినాధ మేళా చేసినారు గ్రుడ్డివారు ,కుంటివారు, అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమంది నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు.మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఏలాగున జరుగుతాయి .!" అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు."త్రినాదులు అనే దేవతలు యేమి దేవతలు ? వారిని మీరు యెందుకు పూజించు చున్నారు. ? నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదువందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది .అటుల కాని యెడల శూలం వేయబడునని రాజు గారు ప్రజలందరికి తాఖీదు ఇచ్చి పంపినారు.

త్రినాధులు రాజుపై కోపించుట - యువరాజు మరణము

ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించి నారు .దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించు చున్నది .ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు .రాజు దైవ కృప ,తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చు చున్నాడు. తల్లి ,బంధువులు మొదలగు వారంతా దుఃఖించు చున్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు.

త్రినాధుల దయతో యువరాజు బ్రతుకుట

త్రినాదులకు దయ కలిగినది "రాజ కుమారుని బ్రతికించి వెతుమా ! మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును ." అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూసి "మీరందరూ ఈ నదీ తీరమునకు యెందుల కొచ్చినారు ?ఏల విచారముగా కూర్చున్నారు .ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని యున్నాడు ? ఇతని శరీరములో చల్లదనము కలదే ? అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు . "మీతో ఏమి చెప్పగలం రాజ కుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు. " అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాధుల వారికి రాజు అపరాధము చేసినందు న ఈ చావు కలిగినది .ఇప్పుడు మీరందరూ త్రినాధులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు . మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతక గలడని చెప్పి త్రినాధ మూర్తులు అదృశ్యులైనారు .అందరూ వారి మాటలను విని త్రినాధ స్వాముల పేరు ఆ రాజ తనయుని చెవిలో చెప్పినారు. ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు .అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషము ను పొందినారు .అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి .


వర్తకుడు త్రినాధుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట

అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ వూరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకు వెళ్ళు చుండెను .ఆ ఓడను నడిపించుకొని స్వర్ణ భద్రానది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి జనులారా ! త్రినాధుల పేర్లు యేమి పేర్లు ? మీరేల స్మరించు చున్నారు ? వినడానికి శ్రద్దగా ఉన్నవి .అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా ! వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాధ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు గారు మన్నించ నందున అపరాదుడైనాడు . ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుట చే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని యున్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది వచ్చి వీనిని బ్రతికించి నారు .అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము .వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని ,షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు లేక్కడుందురో ? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను .నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకొని యున్నవి నేను ఈ ఒడపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను . నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయిన ప్రభువులవారికి ఐదు మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపొయినాడు. పైదేశము వెళ్లి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.

మేళా చేయక పోవుటచే ఓడ మునుగుట

తన నౌకర్లందరూ ఓడ లోని ధనము మోసుకొని పోయినారు.ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువులవారి మేళాలు మరిచెను . అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది . నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగి పోయిరి .అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంత సేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చు చుండగా ఆకాశములో నుండి త్రినాధులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు. అందుచేతనే ఓడ మునిగినది . నీవు ఐదు మేళాలు సమర్పించి నట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును. అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసియుంటిని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాదులవారికి మేళా ఇస్తాను. అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులవారికి మేళా సమర్పించి ప్రార్ధించినాడు .నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది .అదిచూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకలు నౌకర్లు, ఓడలో గల మిగిలిన ధనము కొని పోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను.గంజాయి ఆకులు ,చెక్కలు అన్నీ స్వామి వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేసినారు .రాజ్యమంతా త్రినాధ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించి నారు.మేళాను చూచుటకు అంతా వస్తున్నారు .

గ్రుడ్డివానికి చూపు ,కుంటివానికి కాళ్ళు వచ్చుట

ఇట్టి స్థితిలో గ్రుడ్డివాడొకడు త్రోవను బోయే వారితో అన్నా మీరెవరు మీపేరేమిటి ? మీరెక్కడకు వెళ్ళు చున్నారు ? అనెను వారు మేళా చూచుట కనిరి .అది విని గ్రుడ్డి వారు నాకు కండ్లు కానరావు .మీరందరూ నేత్రములతో చూస్తారు .నేను దేనితో చూస్తాను. అని అనగా గ్రుద్దివాడా ! త్రినాధ స్వామీ వారిని భజింపుము నీ కన్నులు బాగుగా కనపడును. ప్రభువుల వారి మహిమ చూడ వచ్చును. అని చెప్పి ,వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు .గ్రుడ్డి వాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారి భజన చేయుచుండగా కొంచెము కన్నులు కన్పించినవి .అప్పుడు గ్రుడ్డివాడు కొంత దూరము పోయినాడు .దారిలో ఒక పొట్ట వాడు కూర్చుని యున్నాడు .వానిని చూసి నీవు గ్ర్ద్ది వాడవు ఇంత కష్టంతో ఎక్కడకు వెళ్లుచున్నావు అని అడిగినాడు .గ్రుడ్డివాడు చెప్పుచున్నాడు .అన్నా ! నేను మేళాను చూచుటకు వెళ్ళు చున్నాను ఆ మాటలు పొట్టవాడు విని " స్వామి వారి దయ నా మీద లేదు .చేతులు ,కాళ్ళు ,పొట్ట ,నేనెలాగున నడువగలను? నీకు కాళ్ళున్నవి దేక్కుని వెళ్ళగలవు , అంత గ్రుడ్డివాడు చెప్పు చున్నాడు " నీవు త్రినాధ స్వామి వారి ని భజింపుము .నీ కాళ్ళు చేతులు బాగౌతవి .క్షణంలో ఇద్దరం కలసి వెడలిపోదాము.నేను కేవలం గ్రుడ్డివాడిని ఎ మాత్రం కన్నులు కనిపించుటలేదు .త్రినాధ స్వామి వారిని భజించి నాను కనుక ,కొంచెము కనిపిస్తున్నది .అందుచే ,నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు . అని చెప్పగా పొట్టవాడు త్రినాధా! త్రినాధా ! అని భజించినాడు..గ్రుడ్డి అన్నా ! నీకు కాళ్ళున్నవి ,నడవ గలవు, నేను ఎలాగు నడవ గలను .నన్ను నీ భుజము మీద కూర్చో బెట్టుకొన నెమ్మదిగా నడచి వెళ్ళు నేను త్రోవ చూపుతుంటాను. నిశ్చింతగా ఇద్దరమూ మేళాకు చేరుకుందాము. అని పొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గ్రుడ్డివాడు పొట్టవానిని భుజముపై కూర్చో బెట్టుకుని మెల్లగా నడచి పోతున్నాడు.నేస్తం ! నా నేత్రాలు నిర్మలంగా కనిపించు చున్నవి అని అనగా పొట్టవాడు అయ్యా ఇప్పుడు నడచి పోగలను ఈ విధంగా గ్రుడ్డివాడు ,పొట్టవాడు కలసి త్రినాధ స్వామి మేళా దగ్గరకు ప్రవేశించి నారు .

త్రినాధులు వైష్ణవ భక్తుని రక్షించుట ,మూర్ఖపు గురువును శిక్షించుట

ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యమూ ఒక వైష్ణవుడు వస్తూ ఉండెడివాడు .అతడు త్రినాధ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు.అతనిని ఈ ప్రొద్దు మన స్థాన మందు కూర్చుండ బెట్ట వద్దు అని అనుకుని మేళా చేయు వారంతా వైష్ణవుడు రాగానే చూచి మేళా చెల్లించ కుండా నీవు వెళ్ళు చున్నావు. కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది .అని చెప్పగా వైష్ణవు డేమి అంటున్నాడనగా నాయనలారా ! అపరాధము క్షమించండి . ఇకనుండి మేళా కాకుండా వెళ్ళను.నేను నికరముగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను .దైవ యోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటిలోనికి వెళ్ళినాడు. నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు ? ఆ దినము అగుపించలేదే ? మని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడతనితో ఇలాగున చెప్పినది నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులకా ముసలిది అది త్రినాధుని మేళా అని చెప్పినది .ఆ మాటలు విని గురువు అక్కడకు వెళ్లి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్దలతో పూజ చేయుచున్నారు .అది చూచి గురువుకు కోపం వచ్చి ,బాగా తిట్టి ,మేళా స్థలమును సామాగ్రిని కాలితో తన్నివేశాడు .తరువాత వైష్ణవుని పట్టుకుని బర బరా లాక్కు పోయాడు .కొంత దూరము వెళ్లేసరికిబోరున వర్షము కురియసాగినది .కటిక చీకటి కావడం వలన త్రోవ కన్పించడము లేదు గురు శిష్యులు చెల్లా చెదురై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా ,అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చు చున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య ,కుమారుడు చనిపొయినారు.

గురువు పశ్చాత్తాప పడి మేళా చేయుట ,త్రినాధులు కరుణించుట

వారిని చూచి గురువు మూర్చబోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండ బెట్టి ,ముఖముపై నీళ్ళు చల్లి" అయ్యా ! తమరు త్రినాధ స్వామివారికి అపరాదులు, త్రినాధ మేళాను పాడు చేసినారు. అందుకే మీకిది ప్రతిఫలము .మీరు నిష్టతో స్వామీ వారి మేళాను చేసిన యెడల మీ భార్యా కుమారులు బ్రతుకుతారు." అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా ,వెంటనే భార్యా కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాధ మేళా పాడుచేసినందుకు తగిన శిక్ష దొరికింది ."నేను మూర్ఖుడను ,అధముడను ప్రభువులవారి మహిమ తెలిసికొనలేకపోతిని " అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్దములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు . నూనె కాండము చెల్లినది .ప్రభువుల వారి పూజ కావచ్చినది .ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకుని సేవించి సుఖమనుభవించినారు.

ఫలశ్రుతి

ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టు వ్యాధి గ్రుడ్డి తనము కూడా పోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటెగా హాస్యము చెప్పిన యెడల నడ్డి తనము ,గ్రుడ్డి తనము కలుగుతుంది .ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువును పూజించవలెను .చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరు వేరుగా పూజించవలెను. నైవేద్యము సమర్పించి గంజాయిలో అగ్నిని వేయవలెను. తాంబూలము మూడు భాగములు చేసి ఉంచవలెను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను. మూడు దీపములు వెలిగించి "ఓ త్రినాధ స్వాములారా దయ చేయండి " అని అనవలయును. అంతా సమర్పించి త్రినాధ స్వాములవారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చుని కదా వినవలయును. ప్రసాదము అందరూ పంచుకుని సేవించ వలెను. ఈ విధముగా త్రినాధులను పూజించి తరించండి " అని ఈ కధను సీతా దాసు చెప్పి యున్నారు.


శ్లో || మంగళం భగవాన్ విష్ణు : మంగళం మధుసూదన

మంగళం పుండరీ కాక్ష మంగళం గరుడధ్వజ

నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే

శ్రీ లక్ష్మీ ప్రాణ నాదాయ జగన్నాదాయ మంగళం.||

దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాధాయ మంగళం .

శ్రీ త్రినాధ మేళా సమాప్తం

 
   

Top

Welcome To Our New Ui., Now We are 100k Family.. 𝐓𝐡𝐚𝐧𝐤 𝐘𝐨𝐮.,

Bottom